ఏపీ, తెలంగాణ మధ్య జేఎన్‌ఏఎఫ్‌ఏయూ వివాదం
* తెలంగాణ కాలేజీలకే గుర్తింపునిచ్చిన వర్సిటీ
* ఏపీ కళాశాలలతో సంబంధం లేదని స్పష్టీకరణ
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య మరో కొత్త వివాదం తలెత్తుతోంది. అంబేడ్కర్ యూనివర్సిటీ, తెలుగు యూనివర్సిటీల మాదిరిగానే తాజాగా జవహర్‌లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ (జేఎన్‌ఏఎఫ్‌ఏయూ) కూడా అదే జాబితాలో చేరింది. పదో షెడ్యూల్‌లో ఉన్న ఈ యూనివర్సిటీ కేవలం తెలంగాణకు మాత్రమే సేవలందిస్తామని, ఏపీతో తమకు సంబంధం లేదని పేర్కొంటోంది.
పదో షెడ్యూల్‌లోని సంస్థలన్నీ తమవేనని తెలంగాణ ప్రభుత్వం పేర్కొనడం, ఇటీవల ఆ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కార్యదర్శులు, ఆయా సంస్థలతో నిర్వహించిన సమావేశంలో ఈ విషయాన్ని స్పష్టం చేసిన నేపథ్యంలో వర్సిటీ ఆ దిశగానే అడుగులు వేస్తోంది. ఉమ్మడి రాష్ట్రంలో ఆర్కిటెక్ట్, ఫైన్ ఆర్ట్స్ కోర్సులతో జేఎన్‌ఏఎఫ్‌ఏయూను కేంద్రప్రభుత్వం ప్రారంభించింది. హైదరాబాద్ కేంద్రంగా ఈ వర్సిటీ పనిచేస్తుండగా తెలంగాణ, ఏపీలో పది ప్రైవేట్ కాలేజీల్లో కోర్సులు కొనసాగుతున్నాయి. సదరు కళాశాలలకు అఫిలియేషన్‌తో సహా పరీక్షల నిర్వహణ వంటి కార్యకలాపాలన్నీ వర్సిటీయే చూస్తోంది.
తాజా పరిణామాల నేపథ్యంలో జేఎన్‌ఏఎఫ్‌ఏయూ తెలంగాణలోని ఏడు కాలేజీలకు అనుమతులు మంజూరు చేసింది. ఏపీలోని మూడు కాలేజీలకు నిలిపి వేసింది. ఏపీలో ప్రస్తుతమున్న మూడు కాలేజీలతో పాటు కొత్తగా మరో మూడు కాలేజీలు ఏర్పాటు కావాల్సి ఉంది. అయితే, వర్సిటీ మాత్రం పాత కాలేజీలతో పాటు కొత్తగా ఏర్పాటు కావాల్సిన మూడు కాలేజీలకు అనుమతుల బాధ్యత నుంచి తప్పుకొంది. ఏపీ కళాశాలతో తమకు సంబంధం లేదని వర్సిటీ అధికారులు పేర్కొంటుండడం వివాదాస్పదంగా మారుతోంది.
వర్సిటీ సీట్లలోనూ వాటా లేనట్లేనా?
ఉమ్మడి రాష్ట్రంలో ప్రత్యేకత కలిగిన జేఎన్‌ఏఎఫ్‌ఏయూలో సీట్లను గతంలో మూడు ప్రాంతాల విద్యార్థులకు న్యాయం జరిగేలా కోటాను నిర్దేశించారు. దాని ప్రకారం 42 శాతం ఏపీకి, 22 శాతం రాయలసీమకు, 36 శాతం తెలంగాణకు దక్కుతుండేవి. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఉమ్మడి ప్రవేశాలు జరిగితే అందుకు అవకాశముండేది. కానీ ఇప్పుడు ఏపీతో తమకు సంబంధం లేదన్నట్లుగా వర్సిటీ నిర్ణయాలు ఉండడంతో సీట్లలో కోటా అమలు ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్‌లోనే ఈ వర్సిటీ ఉండడం, ఇందులోని ప్రత్యేక కోర్సులేవీ ఏపీలో లేకపోవడంతో అక్కడి విద్యార్థులకు నష్టం వాటిల్లనుంది.