భలే యాప్
‘మై జీహెచ్‌ఎంసీ’ యాప్‌కు విశేష స్పందన
తొలి అరగంటలోనే 272 మంది... రాత్రి 9 వరకు 10,654 మంది డౌన్‌లోడ్
రూ. 1.36 లక్షల ఆస్తి పన్ను చెల్లింపులు
సేవలు బాగున్నాయని సిటీజనుల కితాబు
సిటీబ్యూరో: సేవల్లో పారదర్శకత, జాప్యం నివారణకు జీహెచ్‌ఎంసీ రూపొందిం చిన ‘మై జీహెచ్‌ఎంసీ’ యాప్‌కు తొలి రోజే విశేష స్పందన లభించింది. టెక్నాలజీ ద్వారా ప్రజలకు సత్వర సేవలు అందేలా రూపొందించిన ఈ యాప్‌ను శుక్రవారం ఐటీ మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు. ఈ యాప్ ద్వారా ఆస్తి పన్ను చెల్లింపులు, బర్త్, డెత్ సర్టిఫికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవడం, ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తుల వివరాలు, వివిధ సమస్యలపై ఫిర్యాదులు చేయవచ్చు. స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు ఈ సేవలను సత్వరమే వినియోగించుకోవచ్చు. కాగా యాప్‌ను ఆవిష్కరించిన అరగంటలోనే 272 మంది డౌన్‌లోడ్ చేసుకోగా, రాత్రి 9 గంటల వరకు 10,654 మంది డౌన్‌లోడ్ చేసుకున్నారు. తొలిరోజే 54 మంది భవన యజమానులు రూ. 1,36,145 ఆస్తిపన్నుగా చెల్లించారు. 607 మంది ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తులకు సంబంధించి సెర్చ్ చేశారు. 372 మంది వివిధ సమస్యలను ఫొటోలతో ఫిర్యాదు చేశారు. 4395 మంది బర్త్ సర్టిఫికెట్లను డౌన్‌లోడ్ చేసుకున్నారు. 466 మంది డెత్ సర్టిఫికెట్లు డౌన్‌లోడ్ చేసుకున్నారు. పలువురు యాప్ బాగుందని రేటింగ్స్ ఇచ్చారు. ఇంకా అభివృద్ధి పరచాల్సింది ఎంతో ఉందని మరికొందరు సూచించారు. యాప్ బాగున్నప్పటికీ, ఆస్తిపన్నుకు సంబంధించి అన్ని ప్రాంతాల వివరాలు రావడం లేవన్నారు. హోమ్ స్క్రీన్‌కు వెళ్లేందుకు నేవిగేషన్ లేదని ఫీడ్‌బ్యాక్ ఇచ్చారు.
ఇంకొందరు ‘మైండ్ బ్లోయింగ్ టెక్నాలజీ...’ అంటూ కేటీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఫిర్యాదుల విభాగంలో ఒకే ఫొటో కాకుండా మరికొన్ని ఫొటోలకు అవకాశమివ్వాలని కోరారు. బర్త్ సర్టిఫికెట్లు ఆశ్చర్యకరంగా బాగున్నప్పటికీ, మిగతా అంశాల్లో అభివృద్ధి చేయాల్సి ఉందని పలువురు సూచించారు. ఇలా వివిధ అభిప్రాయాలు వెలిబుచ్చారు. మొత్తానికి జీహెచ్‌ఎంసీ ప్రయత్నాన్ని ఎక్కువ మంది సిటీజనులు అభినందించారు.
భేష్.. సురేంద్ర!
జీహెచ్‌ఎంసీ ఐటీ విభాగం బాధ్యతలు నిర్వహిస్తున్న అడిషనల్ క మిషనర్ సురేంద్రమోహన్‌పై మునిసిపల్ మంత్రి కేటీ రామారావు ప్రశంసల జల్లు కురిపించారు. అనుకున్న దానికంటే తక్కువ సమయంలో నగరంలోని ప్రజలకు ఉపయోగపడేలా ‘ మై జీహెచ్‌ఎంసీ’ యాప్‌ను అందుబాటులోకి తేవడంపై అభినందించారు. ఐటీ విభాగంలోని సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్ విభాగాల్లో పనిచేస్తున్న ప్రతి ఒక్కరినీ పేరుపేరునా అభినందించారు. వారితో కరచాలనం చేశారు. శుక్రవారం ఈ యాప్‌ను ఆవిష్కరించిన కేటీఆర్.. ఆవిష్కరణ తర్వాతే అందులోని వివరాలు.. తద్వారా ప్రజలకు కలిగే సౌలభ్యాల గురించి పూర్తిగా తెలుసుకొని సంతోషం వ్యక్తం చేశారు. అంతకుముందు యాప్ కోసం.. ఐటీ విభాగంలో సురేంద్రమోహన్ చేస్తున్న విశేష కృషి గురించి జీహెచ్‌ఎంసీ కమిషనర్ డా.బి.జనార్దన్‌రెడ్డి మంత్రికి వివరించారు. అందుకు స్పందిస్తూ ఆయన ‘అయితే.. సురేంద్రమోహన్ లీవ్‌ను క్యాన్సిల్ చేస్తున్నా’ అని నవ్వుతూ అన్నారు. రెండు వారాల లండన్ పర్యటన కోసం సురేంద్రమోహన్ సెలవు కోరడాన్ని దృష్టిలో ఉంచుకొని మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు.
ఇప్పుడు నువ్విక్కడ లేకుంటే ఎలా.. అనడంతో లండన్‌నుంచి కూడా యాప్‌ను పరిశీలించవచ్చునని సురేంద్రమోహన్ బదులిచ్చారు. ఐటీ వినియోగం ద్వారా కొత్తపుంతలు తొక్కుతామని, అందుకోసం ఒక చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్‌ను నియమించనున్నామని గతంలో తాను చెప్పానని, ఇప్పుడు అది సురేంద్రమోహన్ జరిగిందని మంత్రి కితాబిచ్చారు. యాప్ పనితీరును, ప్రజల స్పందనను ప్రతివారం సమీక్షించాల్సిందిగా ఆయనకు సూచించారు. ఎల్‌ఆర్‌ఎస్‌కు సంబంధించి ప్రతి స్టెప్ స్పష్టంగా, విపులంగా అర్థమయ్యేలా మరింత అభివృద్ధి పరచాల్సిందిగా సూచించారు. టెక్నాలజీని, ఐటీని వినియోగించుకోవడం ద్వారా గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఆస్తిపన్ను వసూళ్లు తదితర అంశాల్లో సాధించిన ప్రగతిని అంతకుముందు సురేంద్రమోహన్ మంత్రి దృష్టికి తెచ్చారు.