
నిరసనల మధ్య ద్రవ్యవినిమయ బిల్లుకు ఆమోదం
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ప్రతిపక్ష వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేల నిరసనల మధ్య ద్రవ్యవినిమయ బిల్లును మూజువాణి ఓటుతో ఆమోదించారు. అనంతరం స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు సభను నిరవధికంగా వాయిదా వేశారు. బుధవారం ఏపీ అసెంబ్లీలో ద్రవ్యవినిమయ బిల్లుపై చర్చలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నామని, ఓటింగ్ పెట్టాలని డిమాండ్ చేశారు. ద్రవ్యవినిమయ బిల్లుపై డివిజన్ అడిగే హక్కు తమకుందని చెప్పారు. అధికార టీడీపీ అవినీతి సొమ్ముతో ఎమ్మెల్యేలను కొనుగోలు చేసిందని, పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. కాగా ఈ బిల్లుపై డివిజన్ ఓటింగ్ చేపట్టాలన్న వైఎస్ఆర్ సీపీ డిమాండ్ను స్పీకర్ తిరస్కరించారు.
ఓటింగ్పై నిపుణులతో చర్చించానని, ద్రవ్యవినిమయ బిల్లుపై సవరణలు కూడా చేపట్టరాదని స్పీకర్ చెప్పారు. సభలో వైఎస్ఆర్ సీపీ సభ్యులు నిరసన వ్యక్తం చేస్తుండగానే ద్రవ్యవినిమయ బిల్లుకు మూజువాణి ఓటుతో ఆమోదించారు. అనంతరం స్పీకర్ సభను నిరవధికంగా వాయిదా వేశారు.