
‘మూజువాణి’తోనే సరి
♦ ద్రవ్య వినిమయ బిల్లుపై ‘డివిజన్’కు విపక్షం పట్టు
♦ కుదరదన్న యనమల.. ససేమిరా అన్న స్పీకర్
♦ ఓటింగ్ పెట్టకుండా తప్పించుకున్న వైనం
♦ మూజువాణి ఓటుతో బిల్లుకు ఆమోదం.. సభ నిరవధిక వాయిదా
సాక్షి, హైదరాబాద్: పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను కాపాడుకోవడానికి అధికార పక్షం మరోసారి సభలో ‘డివిజన్’కు వెనుకంజ వేసింది. బుధవారం ద్రవ్య వినిమయ బిల్లు ఆమోదానికి మూజువాణి ఓటుతోనే సరిపెట్టింది. డివిజన్ కోసం ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ గట్టిగా పట్టుబట్టినా.. ద్రవ్య వినిమయ బిల్లుపై మూజు వాణి ఓటే తప్ప డివిజన్‌కు అవకాశం లేదని సభా వ్యవహారాల మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. పార్టీ నుంచి జారిపోతున్న వారిని కట్టడి చేయడానికే ప్రతిపక్షం డివిజన్ అడుగుతోందంటూ.. అధికార పక్షం వెనుకంజ వేయడానికి కారణాన్ని చెప్పకనే చెప్పారు. స్పీకర్ కోడెల శివప్రసాదరావు కూడా డివిజన్‌కు ససేమిరా అన్నారు.
డివిజన్ (అనుకూలురెందరు, వ్యతిరేకిస్తున్నవారెందరు లెక్కించేందుకు నిర్వహించే ప్రక్రియ) అడిగినప్పుడు ఇవ్వడం రాజ్యాంగ ధర్మమని పేర్కొంటూ ప్రతిపక్ష నేత జగన్‌మోహన్‌రెడ్డి.. కౌల్ అండ్ షక్దర్ రాసిన ప్రామాణిక నిబంధనల పుస్తకంలోని అంశాలను చదివి వినిపించే ప్రయత్నం చేసినా.. పూర్తి చేయడానికి స్పీకర్ అవకాశం ఇవ్వలేదు. విపక్ష నేత చెప్పిన నిబంధనను స్పీకర్ ప్రస్తావిస్తూ.. డివిజన్‌కు సంబంధించిన ప్రక్రియను చెబుతున్నారని, అది ద్రవ్య వినిమయ బిల్లుకు వర్తించదని చెప్పారు. ద్రవ్య వినిమయ బిల్లు ఒక్కటే కాదు.. సభ ఆమోదం కావాల్సిన ఎలాంటి అంశంపై డివిజన్ కోరినా ఇవ్వాల్సిందేనని నిబంధనల్లో స్పష్టంగా ఉందని జగన్ పేర్కొన్నారు.
విపక్ష నేత మాట్లాడటానికి అవకాశం ఇవ్వకుండా మైక్ కట్ చేశారు. ఈ దశలో మరోసారి తనకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని విపక్ష నేత అడిగారు. మైక్ ఇవ్వగానే.. ‘ఇంత దారుణమైన పరిస్థితుల్లో సభను నడిపిస్తున్నారు. వేరే పార్టీ బీ ఫామ్‌లపై గెలిచిన వారిని తీసుకుంటున్నారు. అవినీతి డబ్బుతో కొనుగోలు చేస్తున్నారు..’ అని అంటుండగానే మైక్ కట్ అయింది. డివిజన్‌కు అవకాశం ఇవ్వకపోవడంపై విపక్ష సభ్యులు తీవ్ర నిరసన తెలిపారు. గందరగోళ పరిస్థితుల మధ్య.. ద్రవ్య వినిమయ బిల్లుపై స్పీకర్ మూజువాణి ఓటు నిర్వహించి, బిల్లుకు సభ ఆమోదం లభించిందని ప్రకటించారు. అనంతరం సభను నిరవధికంగా వాయిదా వేశారు.
వాటికి పొంతనలేదు: కాకాణి
అంతకుముందు ద్రవ్య వినిమయ బిల్లుపై జరిగిన చర్చలో విపక్ష వైఎస్సార్‌సీపీ సభ్యుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి పాల్గొన్నారు. బిల్లును వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలకు, చెబుతున్న మాటలకు, బడ్జెట్ కేటాయింపులకు పొంతన లేదని విమర్శించారు. 2014-15 ఆర్థిక సంవత్సరానికి సబంధించిన ఆడిట్ చేసిన నివేదికలను ఎందుకు సమర్పించలేదని ప్రభుత్వాన్ని నిలదీశారు. పోలవరం తొలిదశను 2018లోగా పూర్తి చేస్తామని ప్రభుత్వం చెప్పిందని, తొలి దశ అంటే పట్టిసీమేనా అని ప్రశ్నించారు. మంత్రులు అచ్చెన్నాయుడు, పల్లె రఘునాథరెడ్డి, దేవినేని ఉమామహేశ్వరరావులు.. ఈ అంశాలపై సమాధానాలు ఇవ్వడం కంటే విపక్షనేత జగన్‌పై వ్యక్తిగత ఆరోపణలు చేయడానికే ప్రాధాన్యత ఇచ్చారు.
ఉద్యోగాలన్నీ భర్తీ చేయలేం: యనమల
ఖాళీగా ఉన్న ఉద్యోగాలన్నీ భర్తీ చేయబోమని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు మరోసారి స్పష్టం చేశారు. అయితే 20 వేల ఖాళీల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ ఇస్తామన్నారు. ఉద్యోగార్థుల గరిష్ట వయో పరిమితిని 45ఏళ్లకు పెంచడానికి సానుకూలంగా ఉన్నామని ప్రకటించారు. ద్రవ్య వినిమయ బిల్లుపై జరిగిన చర్చకు ఆయన సమాధానం ఇచ్చా రు. జీఎస్‌డీపీలో ద్రవ్య లోటు 3 శాతం దాటలేదని చెప్పారు. ద్రవ్య వినిమయ బిల్లు మీద డివిజన్‌కు అవకాశం లేదని, దేశ చరిత్రలో డివిజన్‌కు వెళ్లిన సందర్భాలు లేవన్నారు.దీనిపై స్పీకర్‌కు వారం క్రితం విపక్షం రాసిన లేఖకు విలువ లేదన్నారు.