ఏపీపీఎస్‌సీ కొత్త వెబ్‌సైట్
వన్ టైమ్ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ సదుపాయం
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(ఏపీపీఎస్‌సీ) కొత్త వెబ్‌సైట్‌ను రూపొందించింది. దీని ద్వారా ఉద్యోగార్థులు, ఉద్యోగులకు వన్ టైమ్ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ (ఓటీపీఆర్) సదుపాయం అందుబాటులోకి తెచ్చింది. వీరు తమ వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసుకునివివిధ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. కొత్త వెబ్‌సైట్ (www.psc.ap.gov.in)ను శుక్రవారం ఏపీపీఎస్‌సీ కార్యాలయంలో కమిషన్ చైర్మన్ ప్రొఫెసర్ పి.ఉదయ్ భాస్కర్, సెక్రటరీ ఎ.గిరిధర్ ప్రారంభించారు. ఓటీపీఆర్ ద్వారా అభ్యర్థుల దరఖాస్తు ల నుంచి పరీక్ష నిర్వహణ వరకు ఆన్‌లైన్‌లోనే నిర్వహించనున్నట్లువారు తెలిపారు.
మొదట ప్రభుత్వ ఉద్యోగులకు: ఓటీపీఆర్ సదుపాయాన్ని తొలుత ప్రభుత్వ ఉద్యోగులకు అందుబాటులోకి తెచ్చారు. పలు శాఖల్లో విధులు నిర్వర్తిస్తూ డిపార్ట్‌మెంట్ పరీక్షలకు హాజరయ్యే ఉద్యోగులు ఓటీపీఆర్ ద్వారా తమ ఉద్యోగ వివరాలు నమోదు చేసుకోవచ్చు. వచ్చే నెల 9 నుంచి 14వరకు ఆన్‌లైన్‌లో నిర్వహించే డిపార్ట్‌మెంట్ టెస్ట్ ఈ విధానంలోనే ప్రారంభిస్తున్నట్లు కమిషన్ చైర్మన్, సెక్రటరీ తెలిపారు.
మరో నెలలో నోటిఫికేషన్: రాష్ట్రంలో 20వేల ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్ లభించిన నేపథ్యంలో ఏపీపీఎస్‌సీ ద్వారా దాదాపు 12 వేల ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్లు కమిషన్ సెక్రటరీ తెలిపారు. తొలి నోటిఫికేషన్‌ను మరో నెలలోపు విడుదల చేసే అవకాశముందన్నారు. కాగా అభ్యర్థులు కొత్త వెబ్‌సైట్‌లోని వన్ టైమ్ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ లింక్‌పై క్లిక్ చేసి అభ్యర్థులు తమ వ్యక్తిగత, విద్యార్హతల వివరాలు నమోదు చేసుకోవాలి.వీటిని బట్టి యునిక్ ఐడీ(గుర్తింపు సంఖ్య) కేటాయిస్తారు.