పత్తాలేని ‘ప్రజా రవాణా’ ! | Are not invisible 'public transport'! | Sakshi
Sakshi News home page

పత్తాలేని ‘ప్రజా రవాణా’ !

Published Sun, Dec 14 2014 12:03 AM | Last Updated on Sat, Sep 2 2017 6:07 PM

పత్తాలేని ‘ప్రజా రవాణా’ !

పత్తాలేని ‘ప్రజా రవాణా’ !

‘ఔటర్’ చుట్టూ అమరని ఆధునిక వ్యవస్థ
శివారు ప్రాంతాలను  విస్మరించిన సర్కార్
అంతర్గత రవాణా గ్రిడ్ లేకుండా విశ్వనగ రం సాధ్యమా...?

 
సిటీబ్యూరో:  హైదరాబాద్‌ను వరల్డ్ క్లాస్ సిటీగా మార్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తోన్న ప్రభుత్వం..‘రవాణా గ్రిడ్’ను మాత్రం విస్మరించింది. ముఖ్యంగా నగర శివార్లను కోర్ ఏరియాతో కలిపేందుకు కీలకమైన ప్రజా రవాణా (పబ్లిక్ ట్రాన్స్‌పోర్టు) వ్యవస్థను గాలికి వదిలేయడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. అంతర్గత రవాణా గ్రిడ్ అభివృద్ధి చేయకుండా విశ్వనగరాన్ని ఎలా ఆవిష్కరిస్తారన్నది ఇప్పుడు అందరిలో మదిలో ఉదయిస్తున్న ప్రశ్న. ఔటర్ రింగ్‌రోడ్డు చుట్టూ 158 కి.మీ. మేర ప్రజా రవాణా వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు (సిటీ వైపు) 25 మీటర్ల వెడల్పుతో  ప్రత్యేకంగా స్థలాన్ని కేటాయించారు.  ఔటర్ నిర్మాణం పూర్తికావస్తున్నా ప్రజా రవాణా వ్యవస్థ ఏర్పాటు మాత్రం ఫైళ్లకే పరిమితమైంది. శివారు ప్రాంతాలు శరవేగంగా విస్తరిస్తుండటంతో నగరానికి రాకపోకలకు మెరుగైన రావాణా వ్యవస్థ తప్పనిసరి.  ప్రధానంగా ఎంఎంటీఎస్, బీఆర్‌టీఎస్, మెట్రోరైల్, మోనోరైల్ వంటివాటిలో ఏదో ఒకదాన్ని ఎంపిక చేయాల్సి ఉండగా... సర్కార్ అసలు ఇంతవరకు దాని ఊసే పట్టించుకోలేదు.

ఓఆర్‌ఆర్ ఎక్స్‌ప్రెస్ హైవే కనుక దానిపైకి సాధారణ రవాణా వాహనాలను అనుమతించరు. సర్వీసు రోడ్డు గుండానే రాకపోకలు సాగించాలి. అయితే.. నగరానికి త్వరితగతిన చేరుకొనేందుకు తగిన ప్రజా రవాణా సౌకర్యం లేకపోవడంతో  ఔటర్‌కు సమీపంలోని సుమారు 600 గ్రామాల ప్రజలు  తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అందరికీ వ్యక్తిగత వాహనాలు ఉండవు గనుక అత్యవసర పరిస్థితుల్లో  వారు పడుతున్న యాతన అంతా ఇంతా కాదు. ఆదిభట్ల, ఘట్‌కేసర్ వంటి ప్రాంతాలు అనూహ్యంగా అభివృద్ధి చెందుతున్నాయి. నగరం నుంచి అక్కడికి చేరుకోవాలంటే 2 గంటలకు పైగా సమయం పడుతుండటంతో ప్రజలు యాతనపడుతున్నారు. ఇప్పటికే పటాన్‌చెరు నుంచి శంషాబాద్ మీదుగా  పెద్దఅంబర్‌పేట, అలాగే పటాన్‌చెరు-శామీర్‌పేట వరకు 120 కి.మీ మేర ఔటర్ రింగ్‌రోడ్డు అందుబాటులోకి వచ్చింది. అక్కడి ప్రజలు నగరానికి వచ్చి వెళ్లేందుకు ఒక పూట సమయాన్ని వెచ్చించాల్సి వస్తుండడం ట్రాఫిక్ రద్దీకి అద్దం పడుతోంది.

ఇది కీలకం...

గ్రేటర్ ముంబయి తరహాలో ఓఆర్‌ఆర్ చుట్టూ వెలిసే శాటిలైట్ నగరాలకు కోర్ ఏరియాతో ప్రజా రవాణా వ్యవస్థ వల్లే అనుసంధానం కలుగుతుంది. ఔటర్‌కు సమీపంలోని ప్రజలు ఉద్యోగ, వ్యాపారాల నిమిత్తం నగరానికి రావడానికి ఇదే ప్రధాన రవాణా మార్గం. అత్యంత కీలకమైన ఈ అంతర్గత రోడ్ గ్రిడ్ ప్రాజెక్టుపై సర్కార్ ప్రత్యేక దృష్టి పెట్టాలని రవాణా రంగ నిపుణులు సూచిస్తున్నారు. నగరంలో సమగ్ర రవాణా వ్యవస్థ (సీటీఎస్) అధ్యయనంలో భాగంగా ఔటర్ చుట్టూ నిర్మించాల్సిన ప్రజా రవాణా వ్యవస్థను కూడా చేర్చి హెచ్‌ఎండీఏ నివేదికలు రూపొందించింది. మెట్రోరైల్, ఎంఎంటీఎస్ వంటివి రెండు లేన్లు నిర్మించవచ్చని, అవసరమైన చోట స్టేషన్లు నిర్మించేందుకు తగినంత స్థలం ఉన్నట్లు గుర్తించింది. అయితే, నిధుల్లేకపోవడంతో నిర్మాణ విషయంలో చేతులెత్తేసింది. ప్రతిష్టాత్మకమైన ఈ ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వ ఆలోచన ఏమిటో అంతుచిక్కట్లేదని అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు.  
 
అంటీముట్టనట్లుగా హెచ్‌ఎండీఏ..

ఔటర్‌ను పూర్తిచేయడంపైనే దృష్టిపెట్టిన హెచ్ ఎండీఏ ప్రజారవాణా వ్యవస్థ విషయంలో అంటీముట్టనట్లు వ్యవహరిస్తోంది. నిజానికి ఔటర్ చుట్టూ ప్రజా రవాణా వ్యవస్థ ఏర్పాటు ఓఆర్‌ఆర్ ప్రణాళికలో భాగమే అయినా...ప్రత్యేకంగా నిధులేవీ కేటాయించలేదు. రవాణా కారిడార్ కోసం ఔటర్ చుట్టూ 25 మీటర్ల వెడల్పుతో స్థలం కేటాయించామని, అయితే... అక్కడ ఏ తరహా రవాణా వ్యవస్థ ఏర్పాటు చేయాలన్నది ప్రభుత్వం నిర్ణయించాల్సి ఉందని అధికారులు అంటున్నారు.
 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement