ఆర్య మరాఠా కులాన్ని ఓబీసీలో చేర్చాలి
- వైఎస్ జగన్‌ను కలసిన ఆర్య మరాఠా సంఘం నేతలు
- కేంద్ర బీసీ కమిషన్‌కు సిఫార్సు చేయాలని వినతిపత్రం
సాక్షి, హైదరాబాద్: ఆర్య మరాఠా కులాన్ని ఓబీసీ జాబితాలో చేర్చేలా కేంద్ర బీసీ కమిషన్‌కు సిఫార్సు చేయాలని ఆ సంఘం నాయకులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి విజ్ఞప్తి చేశారు. మంగళవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆర్య మరాఠా సంఘం నేత జాదవ్ నాగేశ్వరరావు ప్రతినిధి బృందం జగన్‌ను కలసి ఈ మేరకు వినతి పత్రం సమర్పించారు. ఇప్పటి వరకు బీసీ-డి జాబితాలో కొనసాగుతున్న తమ కులాన్ని ఓబీసీ జాబితాలోకి మార్పించేందుకు కృషి చేయాలని కోరారు.
తమ సమస్యపై ప్రతిపక్ష నేత సానుకూలంగా స్పందించారని ఆ సంఘ నేత ఎలోజి నాని జాదవ్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఛత్రపతి శివాజీ ఖడ్గం, తలపాగాతో జగన్‌మోహన్‌రెడ్డిని సత్కరించారు. కార్యక్రమంలో ఆర్య మరాఠా సంఘం నేతలు పద్మశ్రీ సురభి నాగేశ్వరరావు, ముజ్జి శివరామ్, డొలె అంజాబి, ఎల్.చిన్న, ఆర్య మరాఠా కులం కృష్ణాజిల్లా అధ్యక్షుడు పకిడె ధర్మారావు, వైఎస్సార్‌సీపీ కృష్ణాజిల్లా కార్యదర్శి మోరె వినోద్ పాల్గొన్నారు.