ఉత్తమ ఉద్యోగులకు పురస్కారాలు
సిటీబ్యూరో: గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని సోమవారం హైదరాబాద్ కలెక్టరేట్ ఆవరణలో జిల్లా యంత్రాంగం ద్వారా గుర్తించిన వివిధ శాఖలకు చెందిన ఉద్యోగులకు ఉత్తమ సేవా ప్రశంసా పత్రాలను జిల్లా కలెక్టర్ నిర్మల అందజేశారు. ప్రశంసాపత్రాలు అందుకున్న వారిలో జిల్లా అడినల్ జేసీ బి.సంజీవయ్య, సీపీఓ బలరామ్, ఏస్సీ కార్పోరేషన్ ఈడీ సత్యనారాయణ, లాండ్ రికార్డ్సు అండ్ సర్వే డీడీ ఎం.గోపాల్‌రావు, వికలాంగుల సంక్షేమ శాఖ ఏడీ సుదర్శన్‌లతో పాటు రెవెన్యూ అండ్ కలెక్టరేట్ స్టాఫ్ 18 మంది ఉన్నారు. అదేవిధంగా లాండ్ సర్వే నుంచి ఇద్దరు, విద్యాశాఖ నుంచి ముగ్గురు, వైద్యశాఖ నుంచి తొమ్మిది మందితో సహా 21 శాఖలలో పని చేస్తున్న 96 మంది ఉద్యోగులకు ఉత్తమ సేవా ప్రంశంసా పత్రాలను కలెక్టర్ అందజేశారు.
విద్యార్థులకు...
రిపబ్లిక్‌డే సందర్భంగా 22వ జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్‌లో హైదరాబాద్ జిల్లా నుంచి అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన సెయింట్ మైఖేల్ స్కూల్ విద్యార్థులకు కలెక్టర్ నిర్మల మెమెంటోలు, ప్రశంసా పత్రాలు అందజేశారు. విద్యార్థులు పాఠ్యాంశాలతో పాటు సమాజానికి ఉపయోగపడే అంశాలపై చిన్నతనం నుంచే అవగాహన పెంచుకోవాలని కలెక్టర్ ఈ సందర్భంగా ఉద్బోధించారు. షేక్ ఖైరున్ ఉపాధ్యాయుని నేతృత్వంలో నో యువర్ కార్బన్ ఫుట్ ప్రింట్ అనే అంశంపై ప్రదర్శించిన నమూనాకు అవార్డు లభించింది. గ్రూప్ లీడర్ దృవచౌదరి, బృందం సభ్యులు దర్శన సురేష్, జహ్నవి, ములాని, సాయిరామకృష్ణ, వైష్ణవిలు కలెక్టర్ చేతుల మీదుగా జ్ఞాపిక అందుకున్నారు.