ఆయుష్ సీటు రూ.50 లక్షలు
ఆయుష్ సీటు రూ.50 లక్షలు
Published Tue, Sep 12 2017 12:00 AM | Last Updated on Fri, Nov 9 2018 5:56 PM
సీ కేటగిరీ సీటు వార్షిక ఫీజు రూ.10 లక్షలు
- బీ కేటగిరీ రూ. 5 లక్షలు.. ఏ కేటగిరీ రూ. 40 వేలు
- నీట్ ర్యాంకుల ఆధారంగా కౌన్సెలింగ్
- మార్గదర్శకాలు విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం
- గతేడాదితో పోలిస్తే భారీగా పెరిగిన ఫీజులు
సాక్షి, హైదరాబాద్: ఆయుష్ డిగ్రీ సీట్ల ప్రవేశాలపై రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు మార్గదర్శకాలు ఖరారు చేసింది. ఫీజులను భారీగా పెంచింది. ఆయుర్వేద, హోమియోపతి, యునానీ, నేచురోపతి–యోగిక్ సీట్ల భర్తీకి అనుసరించే మార్గదర్శకాలను ఖరారు చేస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. హోమియోపతి కోర్సుల సీ కేటగిరీ వార్షిక ఫీజును రూ.10 లక్షలుగా (ఐదేళ్లకు రూ.50 లక్షలు) ఖరారు చేసింది. ఇదే కోర్సు బీ కేటగిరీ సీటుకు రూ.5 లక్షలు, ఏ కేటగిరీ సీటుకు ఫీజు రూ.40 వేలుగా నిర్ణయించారు. గతేడాదితో పోలిస్తే ఈసారి ఫీజులు భా రీగా పెరిగాయి. గతేడాది ఇవే కోర్సుల వార్షిక ఫీజులు సీ కేటగిరీకి రూ.1.25 లక్షలు, బీ కేటగిరీకి రూ. 50 వేలు, ఏ కేటగిరీకి రూ.21 వేలుగా ఉన్నాయి. ప్ర భుత్వ కాలేజీల్లోని ఏ కేటగిరీ సీట్లకు ఫీజు తక్కువగానే ఉంటుంది. కాళోజీ నారాయణరావు ఆరోగ్య, విజ్ఞాన విశ్వవిద్యాలయం ఈ సీట్ల భర్తీ కోసం కౌన్సెలింగ్ నిర్వహిస్తుంది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ త్వరలోనే వెలువడనుంది. ఈ నోటిఫికేషన్‌లో ఫీజులపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
9 కాలేజీలు.. 655 సీట్లు
రాష్ట్రంలో ఆయుర్వేద, హోమియోపతి, యునానీ, నేచురోపతి–యోగిక్ కోర్సులను నిర్వహించే కాలేజీలు తొమ్మిది ఉన్నాయి. మొత్తం 655 సీట్లు ఉండగా.. అందులో మూడు ప్రైవేటు కాలేజీల్లో 250 సీట్లు ఉన్నాయి. నేచురోపతి–యోగిక్ కోర్సును అందించే కాలేజీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు కలిపి ఒకటే ఉంది. ఈ కాలేజీలోని 30 సీట్లలో రెండు రాష్ట్రాల అభ్యర్థులకు ప్రవేశాలు కల్పిస్తారు. ఇక ఏ కేటగిరీ కింద ప్రభుత్వ కాలేజీల్లోని అన్ని సీట్లతోపాటు ప్రైవేటు, మైనారిటీ కాలేజీల్లోని 50 సీట్లు ఉంటాయి. ప్రైవేటు, మైనారిటీ కాలేజీల్లోని మరో 35 శాతం సీట్లు బీ కేటగిరీలో, 15 శాతం సీట్లు సీ కేటగిరీలో ఉంటాయి. ఆయుష్ విభాగంలోని అన్ని సీట్లను జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నీట్) ర్యాంకుల ఆధారంగా భర్తీ చేయనున్నారు.
Advertisement