
చదివింది బీటెక్.. చేసేది గంజాయి వ్యాపారం
నాగోలు,న్యూస్‌లైన్: చదువు మధ్యలో ఆపేసి గంజాయికి అలవాటుపడి..చివరకు గంజాయిని విక్రయిస్తూ పోలీసులకు చిక్కిన ఘటన ఎల్‌బీనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఏసీపీ సీతారాం కథనం ప్రకారం... నల్లగొండ జిల్లా కోదాడకు చెందిన కంచర్ల రాకేష్ అలియాస్ సుబ్బారావు (22) బీటెక్ తృతీయ సంవత్సరం చదివి మధ్యలోనే ఆపేసి ఎల్‌బీనగర్‌లో పాన్‌షాప్ నిర్వహిస్తున్నాడు. రాకేష్ కళాశాలలో చదివేప్పుడు స్నేహితుల ద్వారా గంజాయికి అలవాటుపడ్డాడు.
అది ఎక్కడ్నుంచి సరఫరావుతుందో తెలుసుకుని తానే గంజాయి సరఫరా చేయడం మొదలుపెట్టాడు. ఈ క్రమంలో పాన్‌షాప్ ద్వారా యువతను పరిచయం చేసుకుని నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్, ధూల్‌పేట నుంచి గంజాయిని తెచ్చుకుని విక్రయిస్తున్నాడు. సమాచారమందుకున్న ఎస్‌ఐ అవినాష్‌బాబు ఆధ్వర్యంలో ప్రత్యేక దర్యాప్తు చేపట్టి మంగళవారం రాకేష్ గంజాయి విక్రయిస్తుండగా అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించారు.
అతడివద్ద 20 ప్యాకెట్లలో ఉన్న 900 గ్రాముల గంజాయి, రూ.2వేల నగదు స్వాధీనం చేసుకున్నారు.100 గ్రాములు గంజాయి ప్యాకెట్ రూ.300, 50 గ్రాముల ప్యాకెట్ రూ.200ల చొప్పున విక్రయిస్తున్నట్లు ఏసీపీ వెల్లడించారు. ఈ విలేకరుల సమావేశంలో ఎల్‌బీనగర్ సీఐ శ్రీనివాస్‌రెడ్డి, డీఐ మురళీకృష్ణ, ఎస్‌ఐ అవినాష్‌బాబు తదితరులున్నారు.