‘గ్రేడింగ్‌’పై వెనక్కి! | Back to 'Grading'! | Sakshi
Sakshi News home page

‘గ్రేడింగ్‌’పై వెనక్కి!

Published Wed, Jan 10 2018 2:48 AM | Last Updated on Wed, Jan 10 2018 2:48 AM

Back to 'Grading'! - Sakshi

   ⇒  కేవలం గ్రేడింగ్‌ మాత్రమే
   ⇒  అమలు చేయడం కష్టమే
   ⇒  జేఈఈలో 75 శాతం మార్కుల నిబంధనతో సమస్యలు
   ⇒  ర్యాంకుల ఖరారులో వెయిటేజీతో ఇబ్బందులు
   ⇒  కొందరి మార్కులు వెల్లడించాల్సి వస్తే ఎలాగన్న సందేహాలు
   ⇒  సాధ్యాసాధ్యాలపై 
   ⇒  మళ్లీ కమిటీ పరిశీలన 

 

సాక్షి, హైదరాబాద్‌ : విద్యార్థులను మార్కుల ఒత్తిడి నుంచి దూరం చేసేందుకు, కార్పొరేట్‌ యాజమాన్యాల అడ్డగోలు ప్రచారానికి తెరవేసేందుకు అమల్లోకి తేవాలని నిర్ణయించిన గ్రేడింగ్‌ విధానంపై ఇంటర్మీ డియట్‌ బోర్డు వెనకడుగు వేస్తోంది. ప్రభుత్వం కూడా దీనిలోని ఇబ్బందులు, సందేహాలను లేవనెత్తడంతో గ్రేడింగ్‌ విధానం అమలును విరమించు కునే అవకాశం కనిపిస్తోంది. తల్లిదండ్రులు, కాలేజీ యాజమాన్యాలు, విద్యావేత్తలు, అధికారులతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇంటర్‌ బోర్డు సలహా కమిటీ సిఫార్సు మేరకు ఇంటర్‌ బోర్డు గ్రేడింగ్‌ విధానం అమలుపై ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిన విషయం తెలిసిందే.

వాటిని పరిశీలించిన ఉన్నతాధికారులు గ్రేడింగ్‌ అమలుతో తలెత్తే సమస్యలు, సందేహాలను లేవనెత్తారు. ప్రస్తుతం దేశంలో తెలంగాణ, ఏపీలతోపాటు ఐదారు రాష్ట్రాల ఇంటర్‌ బోర్డులు మార్కులను మాత్రమే ఇస్తుండగా.. సీబీఎస్‌ఈతోపాటు మరికొన్ని రాష్ట్రాల బోర్డులు మార్కులతోపాటు గ్రేడ్లను ఇస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేవలం గ్రేడింగ్‌ మాత్రమే ఎలా అమలు చేస్తారని ప్రశ్నించినట్లు తెలిసింది. 

కమిటీ నివేదిక తరువాత తుది నిర్ణయం 
గ్రేడింగ్‌ విధానంపై సందేహాలు వస్తున్న నేపథ్యంలో.. సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేయిస్తామని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ప్రకటించారు. గ్రేడింగ్‌ విధానాన్ని సిఫారసు చేసిన కమిటీకే ప్రభుత్వం లేవనెత్తిన ప్రశ్నలు, వాటికి సమాధానాలను సూచించడంతోపాటు అసలు గ్రేడింగ్‌ సాధ్యాసాధ్యాలను తేల్చే పని అప్పగించారు. అయితే ప్రభుత్వం లేవనెత్తిన అంశాలకు తగిన పరిష్కారాలు లేవని, అందువల్ల గ్రేడింగ్‌పై వెనక్కి తగ్గే పరిస్థితి ఉందని ఇంటర్‌ బోర్డు వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే కమిటీ తమ తుది నివేదికను ఇచ్చాక ప్రభుత్వం నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించే అవకాశముంది.

ఇంటర్‌ బోర్డు ప్రతిపాదనలివీ.. 
ఎంసెట్‌ తుది ర్యాంకుల ఖరారులో ఇంటర్‌ మార్కులకు వెయిటేజీ ఉండటం, ఎన్‌ఐటీ, ట్రిపుల్‌ఐటీ, ఐఐటీల్లో ప్రవేశాలు పొందేవారు జేఈఈ ర్యాంకుతోపాటు ఇంటర్‌లో 75 శాతం మార్కులు (ఎస్సీ, ఎస్టీలకు 65 శాతం) ఉండాలన్న నిబంధన నేపథ్యంలో ఇంటర్‌ బోర్డు మూడు రకాల ప్రతిపాదనలు చేసింది. 
1. ఎంసెట్‌ ర్యాంకుల ఖరారులో ఇంటర్‌ మార్కులకు వెయిటేజీని తొలగించి.. ఎంసెట్‌ మెరిట్‌ ఆధారంగానే ప్రవేశాలు చేపట్టడం.  
2. మార్కులకు బదులు సబ్జెక్టుల వారీగా గ్రేడ్లను పరిగణనలోకి తీసుకోవడం. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టుల్లో వచ్చే గ్రేడ్లను బట్టి వెయిటేజీని లెక్కించడం. 
3. విద్యార్థులకు గ్రేడ్లు ఇచ్చినా, బోర్డు వద్ద మార్కులు ఉంటాయి. కాబట్టి ఎంసెట్‌ ర్యాంకుల ఖరారులో ఆ మార్కుల ఆధారంగా వెయిటేజీ ఇవ్వడం. అలాగే జేఈఈ, అడ్వాన్స్‌డ్‌ పరీక్షలు నిర్వహించే సీబీఎస్‌ఈ, ఐఐటీలకు మా ర్కుల జాబితాలు అందజేయడం.. అయితే ఈ మూడు రకాల ప్రతిపాదనలపై ఉన్నతాధికారులు అనేక అనుమానాలు వ్యక్తం చేశారు.

‘గ్రేడింగ్‌’పై సందేహాలివీ..
 ఎన్‌ఐటీ, ట్రిపుల్‌ఐటీ, ఐఐటీల్లో ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ మెయిన్, జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షల్లో విద్యార్థుల మధ్య పోటీ ఒకటీ రెండు మార్కుల వ్యత్యాసంతోనే ఉంటుంది. ఉదాహరణకు నలుగురు విద్యార్థులకు జేఈఈలో మంచి ర్యాంకు వచ్చి, ఆ నలుగురికీ ఇంటర్‌లో 70–79 శాతం గ్రేడ్‌ ఉంటే.. ఎవరికి ఎక్కువశాతం మార్కులు ఉన్నాయన్నది తెలియదు. సీబీఎస్‌ఈకి మార్కులు ఇచ్చినా విద్యార్థుల్లో సందేహాలు తలెత్తుతాయి. అలాంటపుడు వారి అనుమానాల నివృత్తి ఎలాగనే సందేహాలు తలెత్తుతున్నాయి.

  సందేహం వ్యక్తం చేసిన విద్యార్థులకు మార్కులను ఇచ్చి, మిగతావారికి ఇవ్వకపోవడం కుదరదు. 
ఎంసెట్‌లో వెయిటేజీ కోసం మార్కులు ఇచ్చినపుడు విద్యార్థులకు ఎందుకు ఇవ్వరనేదానిపై న్యాయస్థానాలకు వెళ్లే అవకాశం ఉంటుంది. 
 తక్కువ గ్రేడ్‌ వచ్చిన వారు ఇంప్రూవ్‌మెంట్‌ కోసం పరీక్షలు రాయాలంటే ఎలా? రాసినా ముందు ఎన్ని మార్కులు వచ్చాయి, ఇప్పుడెన్ని పెరిగాయనేది తెలిసేదెలా? అన్న సందేహాలు వస్తున్నాయి. 


 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement