రూ 10.32 లక్షలు పలికిన బాలాపూర్ లడ్డూ
ప్రపంచ స్థాయి గుర్తింపు పొందిన బాలాపూర్ లడ్డూ ఈ ఏడాది10.32 లక్షలు పలికింది. ఆది నుంచి పోటా పోటీగా సాగిన వేలం పాటలో బాలాపూర్ గణేశుడి లడ్డూను కళ్లెం మదన్ మోహన్ రెడ్డి సొంతం చేసుకున్నారు. ఎప్పటి లాగానే.. రూ116 నుంచి ప్రారంభమైన వేలం పాట.. చివరి వరకూ ఉత్కంఠగా సాగింది. లడ్డూను సొంతం చేసుకునేందుకు 24 మంది భక్తులు పోటీ పడ్డారు. చివరకు గణేశ్ లడ్డూ కల్లెం మదన్ మోహన్ రెడ్డి ని వరించింది. గత ఏడాది రూ 9.50 లక్షలు పలికిన ఈ లడ్డూ ఈ సారి మరో 82 వేలు అధికంగా పలికింది. ఈ లడ్డూను సొంతం చేసుకునేందుకు ఏటా పోటీ పెరుగుతూ వస్తోంది.
కాగా బాలాపూర్ లడ్డూ ప్రస్థానం 1980లో మొదలైంది. మూడు దశాబ్దాల పాటు సాగుతున్న ఈ వేలంలో ఏటేటా.. రికార్డు ధర పలుకుతోంది. గణేశ్ ఉత్సవాలు ముగిసే వరకూ బాలాపూర్ వాసులు మద్యం, మాంసాహారానికి దూరంగా ఉంటారు. ఇక్కడి లడ్డూను ప్రత్యేకంగా పూజిస్తారు. లడ్డూను వేలంలో దక్కించుకున్న వారే కాకుండా దాన్ని దర్శించి పూజించిన వారు సైతం సుఖ సంతోషాలతో ఉంటారన్నది ఇక్కడి వారి నమ్మకం. మొదట్లో వేలల్లో ఉండే ఈ లడ్డూ .. మెల్ల మెల్లగా లక్షలకు చేరింది.