టీఆర్‌ఎస్ ప్రభుత్వం మధ్యవర్తి మాత్రమే: దత్తాత్రేయ
కేంద్రం సహకారంతోనే సంక్షేమ పథకాల అమలు
హైదరాబాద్: తెలంగాణలో అమలవుతున్న చిన్న చిన్న సంక్షేమ పథకాలు మినహా పెద్ద పథకాల అమలుకు కేంద్ర ప్రభుత్వమే సహకారం అందిస్తోందని కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన మంత్రి బండారు దత్తాత్రేయ తెలిపారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, రూపాయికి కిలో బియ్యం వంటి పథకాల అమలుకు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ మధ్యవర్తులు మాత్రమేనని, మొత్తం రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి ఖర్చు చేయడం లేదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని అన్నారు. శనివారం హైదరాబాద్ అంబర్‌పేట నియోజకవర్గంలో నిర్వహించిన బహిరంగ సభకు కేంద్రమంత్రి ముఖ్యఅతిథిగా విచ్చేసి మాట్లాడారు.
ఎన్నికల కోసం మంత్రి కేటీఆర్ నగరంలో తెగిన గాలిపటంలా తిరుగుతున్నాడని, ఆయన మాటలు నీటి బుడగలేనన్న విషయం ప్రజలకు తెలుసునని ఆయన తెలిపారు. కోతల్లేని విద్యుత్, ఫ్లైఓవర్లు, స్కైవే నిర్మాణం వెనుక కేంద్ర సాయం ఉందని.. దీనిని ప్రజలు గమనించాలన్నారు. ఉగ్రవాదులకు మద్దతు తెలిపే ఎంఐఎం పార్టీతో టీఆర్‌ఎస్ కలవడం దారుణమన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో మూసీ ప్రక్షాళన, మహిళలందరికీ ఉపాధి అవకాశాలు కల్పించేందుకు తన వంతు కృషి చేస్తామన్నారు. ఇటీవల మంత్రి కేటీఆర్ గోల్నాక డివిజన్‌కు వచ్చి అభివృద్ధి ఎక్కడని ప్రశ్నించడం హాస్యాస్పదంగా ఉందని ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి ఎద్దేవా చేశారు.
తాను అంబర్‌పేటలో అభివృద్ధి చేసినప్పుడు.. కేటీఆర్ అమెరికా బీచ్‌లో ఆటలు ఆడుకుంటున్నాడన్నారు. ఎన్నికలు రాగానే గంగిరె ద్దులోళ్లలాగా వస్తారని కేటీఆర్ ప్రస్తావించడం.. ఆయనకే వర్తిస్తుందన్నారు. బీజేపీ శాసన సభా పక్ష నేత డాక్టర్ లక్ష్మణ్ మాట్లాడుతూ నగరంలో టీఆర్‌ఎస్‌కు బలం లేదు కాబట్టే పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నగర అధ్యక్షుడు బి. వెంకట్‌రెడ్డి, రాష్ట్ర నాయకులు నాగురామ్, నామోజీ, అనిఫ్ అలీ, వెంకటరమణి, బండారు రాధిక, గీతామూర్తి, విజితారెడ్డి తదితరులు పాల్గొన్నారు.