బ్యారేజీల భారం రాష్ట్రానిదే
- తమ్మిడిహెట్టి, మేడిగడ్డ నిర్మాణ బాధ్యత తెలంగాణదే
- అంతర్రాష్ట్ర బోర్డు సమావేశంలో నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: తమ్మిడిహెట్టి, మేడిగడ్డ బ్యారేజీల నిర్మాణ భారాన్ని పూర్తిగా తెలంగాణ రాష్ట్రమే భరించాలని తెలంగాణ, మహారాష్ట్ర సీఎం్ల నేతృత్వంలోని అంతర్రాష్ట్ర వాటర్ బోర్డు సమావేశంలో నిర్ణయించారు. పెన్‌గంగపై నిర్మించే ఛనాఖా-కొరాటా బ్యారేజీ నిర్మాణ వ్యయాన్ని మాత్రం 80:20 నిష్పత్తిన భరించనున్నారు. ప్రాజెక్టుల కింద సాధ్యమైనంత వరకు ముంపును నివారించేందుకు తెలంగాణ సర్కారు ఫ్లడ్ బ్యాంకుల నిర్మాణం చేపట్టాలని.. బ్యారేజీల్లో నీటి నిల్వలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, ప్రైవేటు భూములేవీ ముంపు కాకుండా చూసుకోవాలనే అభిప్రాయానికి వచ్చారు. భూసేకరణ చట్టం లేదా భూ కొనుగోలు విధానం ద్వారా సేకరించే ముంపు భూములకు తెలంగాణే పరి హారం చెల్లించాలని నిర్ణయించారు.
వాటర్‌బోర్డు సమావేశం నిర్ణయాల మినిట్స్ కాపీని నీటి పారుదల శాఖ మంగళవారం విడుదల చేసింది. తమ్మిడిహెట్టి బ్యారేజీని 148 మీటర్ల ఎత్తుతో నిర్మించేందుకు అంగీకారం కుదరగా.. మేడిగడ్డను 100 మీటర్ల ఎత్తుతో, ఛనాఖా-కొరాటాను 213 మీటర్ల ఎత్తుతో చేపట్టేందుకు అంగీకారం కుదిరింది. గోదావరి జలాల వివాద పరిష్కార ట్రిబ్యునల్ (జీడబ్ల్యూడీటీ) ప్రకారం... ఈ బ్యారేజీల నిర్మాణంతో ముంపునకు గురయ్యే ప్రాంతంలోని నీటిని తాగు, సాగు అవసరాలకు వినియోగించుకునే హక్కు మహారాష్ట్రకు ఉంటుంది. అలాగే కరువు పరిస్థితులు నెలకొన్నప్పుడు మహారాష్ట్రలోని బ్యారేజీ ఎగువ, దిగువ ప్రాంతాల్లో తాగునీటి సరఫరాకు ప్రాధాన్యమివ్వాలి. భూసేకరణ లేదా కొనుగోలు కోసం ప్రజాభిప్రాయ సేకరణ సమావేశాల నిర్వహణకు మహారాష్ట్ర సంపూర్ణంగా సహకరిస్తుంది. ప్రాజెక్టులకు సంబంధించిన అన్ని అంశాలనూ ఇరు రాష్ట్రాలు ఎప్పటికప్పుడు పంచుకోవాల్సి ఉంటుంది.