tammidihetti byareji
-
ప్రాణహితనా.. వార్ధానా?
సాక్షి, హైదరాబాద్: ప్రాణహిత ప్రాజెక్టులో భాగంగా నిర్మించ తలపెట్టిన తమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణం మళ్లీ తెరపైకి వచ్చింది. కొన్నేళ్లుగా పక్కన పెట్టిన ఈ బ్యారేజీ నిర్మాణాన్ని ఏ నదిపై నిర్మించాలన్న తర్జన భర్జన మొదలైంది. వెయిన్‌గంగ, వార్ధా నదుల సంగమం అనంతరం ఏర్పడే ప్రాణహిత నదిపై తమ్మిడిహెట్టి నిర్మాణాన్ని తొలుత ప్రతిపాదించగా, కొత్తగా కేవలం వార్ధా నదిపై వీర్దండ వద్ద నిర్మించాలన్న ప్రతిపాదనపైనా అధ్యయనం చేయాలని అధికారులను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. ఈ రెండు ప్రతిపాదనల్లో ఏది పూర్వ ఆదిలాబాద్ జిల్లాకు మేలు చేస్తుందో తనకు నివేదిక ఇవ్వాలని సూచించారు. ఇప్పుడైనా తేలుతుందా.. వెయిన్‌గంగ, వార్ధా నదులు కలిసిన అనంతరం ప్రాణహిత నదిపై తమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మించడం ద్వారా ఆదిలాబాద్ జిల్లాలో 56 వేల ఎకరాలకు నీరందించాలని 2004లో నిర్ణయించారు. రాష్ట్ర ఏర్పాటు అనంతరం బ్యారేజీలో రీడిజైన్ తర్వాత జిల్లాలో మరో 1.44 లక్షల ఎకరాలను కలిపి మొత్తం 2 లక్షల ఎకరాలకు నీరిచ్చేలా ప్రణాళిక రూపొందించారు. తమ్మిడిహెట్టి వద్ద 4.5 టీఎంసీ సామర్థ్యంతో బ్యారేజీ నిర్మించి 20 టీఎంసీల నీటిని ఎత్తిపోసేలా మొదట రూ.639 కోట్లతో అంచనా వేశారు. వన్యప్రాణి సంరక్షణ కారణంగా ప్రాణహిత నదిపైనే ఒకటిన్నర కిలోమీటర్ ఎగువకు బ్యారేజీ ప్రాంతాన్ని మార్చడంతో అంచనా వ్యయం రూ.1,918.70 కోట్లకు చేరింది. ప్రాణహిత నదిపై 6.45 కిలోమీటర్ల మేర బ్యారేజీ నిర్మాణానికి 107 గేట్లు ఏర్పాటు చేయాల్సి ఉంటుందని, స్పిల్‌వే నిర్మాణమే 3 కిలోమీటర్లు ఉంటుందని ఇంజనీర్లు పేర్కొన్నారు. ఈ నిర్మాణంతో మహారాష్ట్ర లోని చంద్రాపూర్, గడ్చిరోలి జిల్లాల్లో 509 ఎకరాల ముంపు, ప్రస్తుత ఆసిఫాబాద్ జిల్లాలో 300 ఎకరాల ముంపు ఉంటుందని అంచనా వేశారు. బ్యారేజీ నిర్మాణం గత ఐదేళ్లుగా జరగకపోవడంతో ప్రస్తుత లెక్కల ప్రకారం అంచనా వ్యయం రూ.1,918.70 కోట్ల నుంచి రూ.2,600 కోట్లకు చేరుతోంది. పునరాలోచనలో ప్రభుత్వం... బ్యారేజీ వ్యయం భారీగా పెరుగుతుండటంతో పునరాలోచించిన ప్రభుత్వం కేవలం వార్ధా నది వరకే పరిమితం చేయాలని నిర్ణయించింది. వార్ధాపై నిర్మాణంతో కేవలం కిలోమీటర్ మేరకే బ్యారేజీ నిర్మాణం అవసరమవుతుండగా ఇందుకు 28 గేట్లు సరిపోనున్నాయి. ముంపు ప్రాంతం 400 ఎకరాలకు మించదని, వ్యయం సైతం రూ.700 కోట్లు దాటదని నీటిపారుదల వర్గాలు అంచనా వేశాయి. వార్ధా నదిలో 60 టీఎంసీల నీటి లభ్యత ఉండగా ఇందులో 20 టీఎంసీలు ఆదిలాబాద్ జిల్లా అవసరాలకు సరిపోతాయని లెక్క గట్టాయి. ఈ ప్రాజెక్టుపై శుక్రవారం సమీక్షించిన సీఎం గత ప్రతిపాదనలతో పాటు కొత్త ప్రతిపాదనలపై సమగ్ర అధ్యయనం చేయాలని ఆదేశించారు. వార్ధా వద్ద నీటి లభ్యత ఉన్నా అది తక్కువ సమయంలోనే భారీగా ఉంటుంది. ప్రస్తుతం ప్రతిపాదిస్తున్న బ్యారేజీ సామర్థ్యం 1.5 టీఎంసీలే కావడంతో అంత తక్కువ సమయంలో నిర్ణీత 20 టీఎంసీలు మళ్లించడం సాధ్యమా? అన్న అనుమానాన్ని సమీక్ష సందర్భంగా ఇంజనీర్లు లేవనెత్తారు. ఈ నేపథ్యంలో నీటి లభ్యత, లభ్యత కాలం, మళ్లింపు అవకాశాలపై అధ్యయనం చేయాలని సీఎం ఆదేశించారు. దీంతోపాటు పెద్దవాగులో సైతం 16 నుంచి 18 టీఎంసీల మేర లభ్యత ఉన్న దృష్ట్యా, ఆ నీటిని కాళేశ్వరంలో భాగంగా ఉన్న సుందిళ్ల వరకు ఎలా తరలించాలన్న దానిపైనా పరిశీలన చేయాలని సూచించారు. -
ప్రాణహిత పోయి వార్ధా వచ్చె!
సాక్షి, హైదరాబాద్: ప్రాణహిత ప్రాజెక్టులో భాగంగా నిర్మించతలపెట్టిన తమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణ ప్రాంతం మారనుంది. మెయిన్‌గంగ, వార్ధా నదుల సంగమం అనంతరం ఏర్పడే ప్రాణహిత నదిపై తమ్మిడిహెట్టి నిర్మాణాన్ని తొలుత ప్రతిపాదించగా ప్రస్తుతం దాన్ని కేవలం వార్ధా నది మీదకు మార్చాలని ప్రభుత్వం యోచిస్తోంది. దీనిపై సర్వే చేసే బాధ్యతను వ్యాప్కోస్‌కు అప్పగించింది. వ్యయ అంచనా తగ్గుతుండటం, ముంపు తగ్గే అవకాశాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నా దీన్ని ఎప్పటిలోగా పూర్తి చేస్తారన్న విషయమై అనేక ప్రశ్నలు తలెత్తున్నాయి. మొదటి నుంచీ తడబాటే... ప్రాణహిత ప్రాజెక్టులో భాగంగా తమ్మిడిహెట్టి బ్యారేజీ ద్వారా ఆదిలాబాద్ జిల్లాలో 56 వేల ఎకరాలకు నీరందించాలని గతంలో నిర్ణయించగా కొత్తగా చేసిన నిర్ణయం మేరకు జిల్లాలో మరో 1.44 లక్షల ఎకరాలను కలిపి మొత్తంగా 2 లక్షల ఎకరాలకు నీరిచ్చేలా ప్రణాళిక తయారు చేశారు. తమ్మిడిహెట్టి వద్ద 4.5 టీఎంసీ సామర్ధ్యంతో బ్యారేజీ నిర్మించి 20 టీఎంసీల నీటిని ఎత్తిపోసేలా మొదట రూ. 639 కోట్లతో అంచనా వేశారు. అనంతరం వన్యప్రాణి సమస్యల కారణంగా ప్రాణహిత ఎగువకు బ్యారేజీ ప్రాంతాన్ని మార్చి రూ. 1,918.70 కోట్లతో ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. ప్రాణహిత నదిపై 6.45 కిలోమీటర్ల మేర బ్యారేజీ నిర్మాణానికి 107 గేట్లు ఏర్పాటు చేయాల్సి ఉంటుందని, స్పిల్‌వే నిర్మాణమే 3 కిలోమీటర్లు ఉంటుందని లెక్కగట్టారు. ఈ నిర్మాణంతో మహారాష్ట్రలోని చంద్రాపూర్, గడ్చిరోలి జిల్లాల్లో 509 ఎకరాలు ముంపు ఉండగా ప్రస్తుత ఆసిఫాబాద్ జిల్లాలో 300 ఎకరాల ముంపు ఉంటుందని అంచనా వేశారు. అయితే ఇక తమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణ ప్రాంతం రాష్ట్ర పరిధిలోని కవ్వాల్, మహారాష్ట్ర పరిధిలోని తడోబా వన్యప్రాణి ప్రాంతం పరిధిలో ఉంటోంది. దీంతో పర్యావరణ అటవీ అనుమతులతోపాటు వన్యప్రాణి బోర్డు అనుమతులు తప్పనిసరయ్యాయి. అయితే తమ ప్రాంతంలోని ముంపు ప్రాంతాలపై మహారాష్ట్ర అంగీకరించకపోవడంతో ఇన్నాళ్లూ ప్రాజెక్టు ముందుకు కదల్లేదు. అయితే అంతర్రాష్ట్ర ఒప్పందాల్లో భాగంగా తమ ప్రాంత భూములు ఇచ్చేందుకు మహారాష్ట్ర సమ్మతి తెలపడంతో పర్యావరణ, అటవీ అనుమతులు లభించాయి. కానీ పరిహారం చెల్లింపు విషయంలో అటవీశాఖ చేస్తున్న జాప్యంతో ముందడుగు పడట్లేదు. దీంతో బ్యారేజీ నిర్మాణం నాలుగేళ్లుగా మొదలుకాలేదు. బ్యారేజీ స్థలం మార్పు యోచన... బ్యారేజీ నిర్మాణంలో జాప్యంపై ఇటీవల సమీక్షించిన ప్రభుత్వం కొత్త రేట్ల ప్రకారం తమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణ వ్యయాన్ని లెక్కగట్టింది. దీని ప్రకారం 2007–08లో వేసిన అంచనా రూ. 1,918.70 కోట్లుకాగా ప్రస్తుత అంచనా రూ. 2,600 కోట్లకు చేరింది. వ్యయం భారీగా పెరుగుతుండటంతో పునరాలోచించిన ప్రభుత్వం బ్యారేజీని కేవలం వార్ధా నది వరకే పరిమితం చేయాలని నిర్ణయించింది. దీంతో కేవలం ఒక కిలోమీటర్ మేరకే బ్యారేజీ నిర్మాణం అవసరమవుతుండగా ఇందుకు 36 గేట్లు సరిపోనున్నాయి. ముంపు ప్రాంతం 400 ఎకరాలకు మించదని, వ్యయం సైతం రూ. 650 కోట్లను దాటదని నీటిపారుదల వర్గాలు అంచనా వేశాయి. వార్ధా నదిలో 60 టీఎంసీల నీటి లభ్యత ఉండగా ఇందులో 20 టీఎంసీలు ఆదిలాబాద్ జిల్లా అవసరాలకు సరిపోతాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రాణహితను కాదని వార్ధాపై నిర్మాణానికి వేగంగా ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. అయితే తమ్మిడిహెట్టి నిర్మాణమే పదేళ్లుగా మూలనపడగా తాజాగా వార్ధాపై నిర్మాణాన్ని ఎప్పటికి పూర్తి చేస్తారన్నదానిపై అనేక ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. మార్పు ఆలోచనలపై కాంగ్రెస్ కన్నెర్ర..! తమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణ ప్రాంత మార్పు యోచనపై కాంగ్రెస్ పార్టీ మండిపడుతోంది. తమ్మిడిహెట్టి వద్ద తట్టెడు మట్టి కూడా ఎత్తలేదంటూ అధికార టీఆర్ఎస్ గతంలో తమపై విమర్శలు చేసిందని, మరి నాలుగేళ్ల పాలనలో అక్కడ బ్యారేజీ నిర్మాణానికి టీఆర్ఎస్ ఏం చేసిందో చెప్పాలని నిలదీస్తోంది. బ్యారేజీ నిర్మాణంపై కొత్త ప్రతిపాదన తేవడం ప్రజలను మభ్యపెట్టడమేనని కాంగ్రెస్ ఎమ్మెల్యే టి. జీవన్‌రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. బ్యారేజీ ప్రాంతాన్ని మారిస్తే కాగజ్‌నగర్, బెల్లంపల్లి, చెన్నూర్, ఆసిఫాబాద్ నియోజకవర్గ ప్రజలతో కలసి భారీ ఉద్యమ కార్యాచరణకు దిగాలని కాంగ్రెస్ నిర్ణయించినట్లు తెలిసింది. అవసరమైతే రంగారెడ్డి జిల్లా నేతలను కలుపుకొని రెండు జిల్లాల్లో ఉద్యమాలు చేయాలని భావిస్తున్నట్లు కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. -
ఛనాకా–కొరట బ్యారేజీకి క్లియరెన్స్
సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి ఆదిలాబాద్ తూర్పు, పశ్చిమ ప్రాంతాలకు సంబంధిం చిన ప్రాణహితలో భాగంగా చేపట్టిన తమ్మిడిహెట్టి బ్యారేజీ, ఛనాకా–కొరట బ్యారేజీ సాగునీటి ప్రాజెక్టులకు మహారాష్ట్ర వన్యప్రాణి బోర్డు క్లియరెన్స్‌లు ఇచ్చింది. నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు గత కొన్ని నెలలుగా మహారాష్ట్రతో జరుపుతున్న సంప్రదింపుల ఫలితంగా ఈ కీలక నిర్ణయం వెలువడింది. ఈ రెండు బ్యారేజీల వల్ల వన్యప్రాణులకు ఎలాంటి హాని ఉండదని మహారాష్ట్ర తెలిపింది. ఛనాకా–కొరట బ్యారేజీని పెన్‌గంగ నదిపై నిర్మిస్తున్నారు. 51 వేల ఎకరాలకు సాగు నీరందించే ఈ ప్రాజెక్టుకు తిప్పేశ్వర్ వన్యప్రాణి కేంద్రం నుంచి అనుమతి లభించింది. ప్రాణహిత నదిపై 2 లక్షల ఎకరాలకు సాగునీరందించే లక్ష్యంతో నిర్మిస్తున్న తమ్మిడిహెట్టి ప్రాజెక్టుకు చాప్రాల్ వన్యప్రాణి కేంద్రం అనుమతిచ్చింది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ అధ్యక్షతన బుధవారం ముంబైలో ఆ రాష్ట్ర వన్యప్రాణి బోర్డు సమావేశమైంది. సమావేశంలో మహారాష్ట్ర ఆర్థిక మంత్రి సుధీర్ మునిగంటివార్, రాష్ట్ర అటవీ శాఖ చీఫ్ కన్జర్వేటర్ భగవాన్, తెలంగాణ నుంచి ఆదిలాబాద్ సీఈ భగవంతరావు, డిప్యూటీ ఫారెస్ట్ కన్జర్వేటర్ శ్రీనివాస్, పెన్‌గంగ ఎస్ఈ అమ్జద్ హుస్సేన్ పాల్గొన్నారు. ఛనాకా–కొరట, తమ్మిడిహెట్టి బ్యారేజీలపై సీఈ భగవంతరావు ప్రజెంటేషన్ ఇచ్చారు. ప్రజెంటేషన్‌పై సంతృప్తి వ్యక్తం చేస్తూ, వీటి నిర్మాణంతో వన్యప్రాణి కేంద్రాలపై ప్రభావముండదని తేల్చిన మహారాష్ట్ర వన్యప్రాణి మండలి.. జాతీయ వన్యప్రాణి బోర్డుకు సిఫారసు చేసింది. ఆ నిర్ణయం పట్ల హరీశ్‌రావు బుధవారం ఓ ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. -
బ్యారేజీల భారం రాష్ట్రానిదే
- తమ్మిడిహెట్టి, మేడిగడ్డ నిర్మాణ బాధ్యత తెలంగాణదే - అంతర్రాష్ట్ర బోర్డు సమావేశంలో నిర్ణయం సాక్షి, హైదరాబాద్: తమ్మిడిహెట్టి, మేడిగడ్డ బ్యారేజీల నిర్మాణ భారాన్ని పూర్తిగా తెలంగాణ రాష్ట్రమే భరించాలని తెలంగాణ, మహారాష్ట్ర సీఎం్ల నేతృత్వంలోని అంతర్రాష్ట్ర వాటర్ బోర్డు సమావేశంలో నిర్ణయించారు. పెన్‌గంగపై నిర్మించే ఛనాఖా-కొరాటా బ్యారేజీ నిర్మాణ వ్యయాన్ని మాత్రం 80:20 నిష్పత్తిన భరించనున్నారు. ప్రాజెక్టుల కింద సాధ్యమైనంత వరకు ముంపును నివారించేందుకు తెలంగాణ సర్కారు ఫ్లడ్ బ్యాంకుల నిర్మాణం చేపట్టాలని.. బ్యారేజీల్లో నీటి నిల్వలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, ప్రైవేటు భూములేవీ ముంపు కాకుండా చూసుకోవాలనే అభిప్రాయానికి వచ్చారు. భూసేకరణ చట్టం లేదా భూ కొనుగోలు విధానం ద్వారా సేకరించే ముంపు భూములకు తెలంగాణే పరి హారం చెల్లించాలని నిర్ణయించారు. వాటర్‌బోర్డు సమావేశం నిర్ణయాల మినిట్స్ కాపీని నీటి పారుదల శాఖ మంగళవారం విడుదల చేసింది. తమ్మిడిహెట్టి బ్యారేజీని 148 మీటర్ల ఎత్తుతో నిర్మించేందుకు అంగీకారం కుదరగా.. మేడిగడ్డను 100 మీటర్ల ఎత్తుతో, ఛనాఖా-కొరాటాను 213 మీటర్ల ఎత్తుతో చేపట్టేందుకు అంగీకారం కుదిరింది. గోదావరి జలాల వివాద పరిష్కార ట్రిబ్యునల్ (జీడబ్ల్యూడీటీ) ప్రకారం... ఈ బ్యారేజీల నిర్మాణంతో ముంపునకు గురయ్యే ప్రాంతంలోని నీటిని తాగు, సాగు అవసరాలకు వినియోగించుకునే హక్కు మహారాష్ట్రకు ఉంటుంది. అలాగే కరువు పరిస్థితులు నెలకొన్నప్పుడు మహారాష్ట్రలోని బ్యారేజీ ఎగువ, దిగువ ప్రాంతాల్లో తాగునీటి సరఫరాకు ప్రాధాన్యమివ్వాలి. భూసేకరణ లేదా కొనుగోలు కోసం ప్రజాభిప్రాయ సేకరణ సమావేశాల నిర్వహణకు మహారాష్ట్ర సంపూర్ణంగా సహకరిస్తుంది. ప్రాజెక్టులకు సంబంధించిన అన్ని అంశాలనూ ఇరు రాష్ట్రాలు ఎప్పటికప్పుడు పంచుకోవాల్సి ఉంటుంది. -
ప్రాణహిత కన్నా మేడిగడ్డ మిన్న
‘సాక్షి’ ఇంటర్వ్యూలో మంత్రి హరీశ్‌రావు సాక్షి, హైదరాబాద్: గోదావరి పరీవాహకంలో లభించే ప్రతి నీటిచుక్కను సద్వినియోగం చేసుకుని, సమగ్ర అభివృద్ధిని సాధించడం కోసమే ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును రీఇంజనీరింగ్ చేస్తున్నామని నీటి పారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు వెల్లడించారు. నిర్ణీత 160 టీఎంసీల నీటిని మళ్లించేందుకు తమ్మిడిహెట్టి బ్యారేజీ అనువుగా లేకపోవడం, ఈ బ్యారేజీ ఎత్తుతో జరిగే ముంపును మహారాష్ట్ర అంగీకరించకపోవడం వంటి కారణాలతోనే ప్రత్యామ్నాయంగా ‘కాళేశ్వరం’ ప్రాజెక్టుకు నాంది పలికామన్నారు. ప్రాజెక్టుల రీడిజైనింగ్‌పై కొందరు నిపుణులు, విపక్షాలు ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో మంత్రి హరీశ్‌రావు ‘సాక్షి’కి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ అంశానికి సంబంధించిన వివరాలను, కేంద్ర జల సంఘం సూచనలు, మహారాష్ట్ర, ఉమ్మడి ఏపీ మధ్య జరిగిన సంప్రదింపులు తదితర వివరాలను వెల్లడించారు. ఇంటర్వ్యూ ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే.. లభించేది 40 టీఎంసీలే తమ్మిడిహెట్టిని 152 మీటర్ల ఎత్తుతో నిర్మిం చాలనే ప్రతిపాదనను మహారాష్ట్ర వ్యతిరేకిస్తోంది. ఆ ఎత్తులో 1,852 ఎకరాల ముంపు ఉంటుందని, దాన్ని అంగీకరించబోమని 2013 జనవరి 21న తెలంగాణకు స్పష్టం చేసింది. 2014 జూలై 23న మంత్రి స్థాయిలో నేను స్వయంగా మహారాష్ట్ర వెళ్లి చర్చలు జరిపాను. 2015 ఫిబ్రవరి 17న సీఎంల స్థాయిలో చర్చలు జరిగాయి. గోదావరిలో 160 టీఎంసీలు తీసుకునేందుకు అభ్యంతరం లేదని చెప్పిన మహా రాష్ట్ర.. ముంపును మాత్రం అంగీకరించబోమని స్పష్టం చేసింది. ఈ సమయంలోనే తమ్మిడిహెట్టి వద్ద తగినంత నీటి లభ్యత లేదంటూ కేంద్ర జల సంఘం 2015 మార్చిలో రాష్ట్రానికి లేఖ రాసింది. 152 మీటర్ల ఎత్తులో 5 టీఎంసీల సామర్థ్యంతో బ్యారేజీ నిర్మించి రోజుకు 1.8 టీఎంసీల చొప్పున నీటిని మళ్లించగలిగితేనే నిర్ణీత 160 టీఎంసీలు తీసుకోవచ్చని... కానీ అక్కడ పూర్తి లభ్యతే 165 టీఎంసీలని, మళ్లించడానికి అనువైన నీరు 100 నుంచి 110 టీఎంసీలేనని చెప్పింది. అదీగాక తమ్మిడిహెట్టి పూర్తిగా వన్యప్రాణుల అభయారణ్యం ప్రాంతంలో ఉంది. దాన్ని పట్టించుకోకుండా అప్పటి ప్రభుత్వం పనులు ప్రారంభించింది. ఈ నిర్మాణం పూర్తి ఏకపక్షంగా చేపడుతున్నారని, ఈ పనులు ఫలప్రదం కావని 2013 అక్టోబర్ 15న అప్పటి మహారాష్ట్ర సీఎం పృథ్వీరాజ్ చవాన్ రాష్ట్రానికి లేఖ రాశారు కూడా. అయితే మహారాష్ట్ర తొలి నుంచీ చెబుతున్న 148 మీటర్ల ఎత్తులో 1.8 టీఎంసీలను మాత్రమే నిల్వ చేసుకోగలం, 40 టీఎంసీలను మాత్రమే మళ్లించగలం. అందుకే పుష్కలంగా నీరున్న మేడిగడ్డ నుంచి నీటిని మళ్లించాలని నిర్ణయించాం. దీనిద్వారా నిర్ణీత 16 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుతో పాటు ఎస్సారెస్పీ, సింగూరు, నిజాంసాగర్ కింది 20 లక్షల ఆయకట్టు స్థిరీకరణకు అవకాశం ఉంది. 152 మీటర్లకు ప్రామాణికతే లేదు తమ్మిడిహెట్టి బ్యారేజీ ఎత్తును 152 మీటర్ల నుంచి 148 మీటర్లకు ఎందుకు తగ్గించారని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. నిజానికి ఆ ఎత్తుకున్న ప్రామాణికత ఏమిటో కాంగ్రెస్ నేతలు చెప్పాలి. 152 మీటర్ల ఎత్తుకు కాల్వల డిజైన్లు చేసిన కాంగ్రెస్ నేతలు, ఆ ఎత్తుపై మహారాష్ట్రను ఎందుకు ఒప్పించలేకపోయారు. 152 మీటర్ల ఎత్తులో బ్యారేజీ కట్టే అంశం 2012లో చేసుకున్న ఒప్పందంలో ఎక్కడైనా ఉందా కాంగ్రెస్ నేతలే చెప్పాలి. ఆదిలాబాద్‌లో 2లక్షల ఎకరాలకు.. తమ్మిడిహెట్టి వద్ద 148 మీటర్ల ఎత్తుతో నిర్మించనున్న బ్యారేజీతో ఆదిలాబాద్ జిల్లాలో 2లక్షల ఎకరాలకు నీరందించేలా ప్రణాళికలు సిద్ధం చేశాం. 14.4 టీఎంసీల ప్రాణహిత నీటిని నిర్ణీత ఆయకట్టుకు అందించేలా వ్యాప్కోస్ నివేదిక అందజేసింది. గతంలో తమ్మిడిహెట్టి ద్వారా ఆదిలాబాద్ జిల్లాలో 56 వేల ఎకరాలకు నీరందించాలని నిర్ణయించగా... ఇప్పుడు మరో 1.44 లక్షల ఎకరాలకు అదనంగా నీరివ్వనున్నాం. ‘పాలమూరు’ ద్వారా రంగారెడ్డికి అదనపు ఆయకట్టు కొత్తగా చేపడుతున్న పాలమూరు-రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల ద్వారా రంగారెడ్డి జిల్లాలో 4.35 లక్షల ఎకరాలకు సాగు నీరందించి జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు ప్రయత్నిస్తున్నాం. ప్రాణహిత పథకం కింద ఈ జిల్లాలో కేవలం 2.10లక్షల ఎకరాలకే నీరిచ్చేలా ప్రణాళికలు వేశా రు. కానీ రీఇంజనీరింగ్‌తో 4.35 లక్షల ఎకరాలకు సాగు నీరందుతుంది. జిల్లాలో పాలమూరు ఎత్తిపోతల ద్వారా 2.75 లక్షల ఎకరాలు, డిండి నుంచి లక్ష ఎకరా లు, ప్రాణహిత నుంచి గోదావరి ద్వారా 70 వేల ఎకరాలకు సాగునీరు అందిస్తాం.