ప్రాణహిత కన్నా మేడిగడ్డ మిన్న | hareesh rao interview in sakshi | Sakshi
Sakshi News home page

ప్రాణహిత కన్నా మేడిగడ్డ మిన్న

Published Thu, Mar 24 2016 3:00 AM | Last Updated on Sun, Sep 3 2017 8:24 PM

ప్రాణహిత కన్నా మేడిగడ్డ మిన్న

ప్రాణహిత కన్నా మేడిగడ్డ మిన్న

సాక్షి’ ఇంటర్వ్యూలో మంత్రి హరీశ్‌రావు

సాక్షి, హైదరాబాద్: గోదావరి పరీవాహకంలో లభించే ప్రతి నీటిచుక్కను సద్వినియోగం చేసుకుని, సమగ్ర అభివృద్ధిని సాధించడం కోసమే ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును రీఇంజనీరింగ్ చేస్తున్నామని నీటి పారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు వెల్లడించారు. నిర్ణీత 160 టీఎంసీల నీటిని మళ్లించేందుకు తమ్మిడిహెట్టి బ్యారేజీ అనువుగా లేకపోవడం, ఈ బ్యారేజీ ఎత్తుతో జరిగే ముంపును మహారాష్ట్ర అంగీకరించకపోవడం వంటి కారణాలతోనే ప్రత్యామ్నాయంగా ‘కాళేశ్వరం’ ప్రాజెక్టుకు నాంది పలికామన్నారు. ప్రాజెక్టుల రీడిజైనింగ్‌పై కొందరు నిపుణులు, విపక్షాలు ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో మంత్రి హరీశ్‌రావు ‘సాక్షి’కి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ అంశానికి సంబంధించిన వివరాలను, కేంద్ర జల సంఘం సూచనలు, మహారాష్ట్ర, ఉమ్మడి ఏపీ మధ్య జరిగిన సంప్రదింపులు తదితర వివరాలను వెల్లడించారు.

ఇంటర్వ్యూ ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే..
లభించేది 40 టీఎంసీలే

తమ్మిడిహెట్టిని 152 మీటర్ల ఎత్తుతో నిర్మిం చాలనే ప్రతిపాదనను మహారాష్ట్ర వ్యతిరేకిస్తోంది. ఆ ఎత్తులో 1,852 ఎకరాల ముంపు ఉంటుందని, దాన్ని అంగీకరించబోమని 2013 జనవరి 21న తెలంగాణకు స్పష్టం చేసింది. 2014 జూలై 23న మంత్రి స్థాయిలో నేను స్వయంగా మహారాష్ట్ర వెళ్లి చర్చలు జరిపాను. 2015 ఫిబ్రవరి 17న సీఎంల స్థాయిలో చర్చలు జరిగాయి. గోదావరిలో 160 టీఎంసీలు తీసుకునేందుకు అభ్యంతరం లేదని చెప్పిన మహా రాష్ట్ర.. ముంపును మాత్రం అంగీకరించబోమని స్పష్టం చేసింది. ఈ సమయంలోనే తమ్మిడిహెట్టి వద్ద తగినంత నీటి లభ్యత లేదంటూ కేంద్ర జల సంఘం 2015 మార్చిలో రాష్ట్రానికి లేఖ రాసింది.

152 మీటర్ల ఎత్తులో 5 టీఎంసీల సామర్థ్యంతో బ్యారేజీ నిర్మించి రోజుకు 1.8 టీఎంసీల చొప్పున నీటిని మళ్లించగలిగితేనే నిర్ణీత 160 టీఎంసీలు తీసుకోవచ్చని... కానీ అక్కడ పూర్తి లభ్యతే 165 టీఎంసీలని, మళ్లించడానికి అనువైన నీరు 100 నుంచి 110 టీఎంసీలేనని చెప్పింది. అదీగాక తమ్మిడిహెట్టి పూర్తిగా వన్యప్రాణుల అభయారణ్యం ప్రాంతంలో ఉంది.

దాన్ని పట్టించుకోకుండా అప్పటి ప్రభుత్వం పనులు ప్రారంభించింది. ఈ నిర్మాణం పూర్తి ఏకపక్షంగా చేపడుతున్నారని, ఈ పనులు ఫలప్రదం కావని 2013 అక్టోబర్ 15న అప్పటి మహారాష్ట్ర సీఎం పృథ్వీరాజ్ చవాన్ రాష్ట్రానికి లేఖ రాశారు కూడా. అయితే మహారాష్ట్ర తొలి నుంచీ చెబుతున్న 148 మీటర్ల ఎత్తులో 1.8 టీఎంసీలను మాత్రమే నిల్వ చేసుకోగలం, 40 టీఎంసీలను మాత్రమే మళ్లించగలం. అందుకే పుష్కలంగా నీరున్న మేడిగడ్డ నుంచి నీటిని మళ్లించాలని నిర్ణయించాం. దీనిద్వారా నిర్ణీత 16 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుతో పాటు ఎస్సారెస్పీ, సింగూరు, నిజాంసాగర్ కింది 20 లక్షల ఆయకట్టు స్థిరీకరణకు అవకాశం ఉంది.

152 మీటర్లకు ప్రామాణికతే లేదు
తమ్మిడిహెట్టి బ్యారేజీ ఎత్తును 152 మీటర్ల నుంచి 148 మీటర్లకు ఎందుకు తగ్గించారని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. నిజానికి ఆ ఎత్తుకున్న ప్రామాణికత ఏమిటో కాంగ్రెస్ నేతలు చెప్పాలి. 152 మీటర్ల ఎత్తుకు కాల్వల డిజైన్లు చేసిన కాంగ్రెస్ నేతలు, ఆ ఎత్తుపై మహారాష్ట్రను ఎందుకు ఒప్పించలేకపోయారు. 152 మీటర్ల ఎత్తులో బ్యారేజీ కట్టే అంశం 2012లో చేసుకున్న ఒప్పందంలో ఎక్కడైనా ఉందా కాంగ్రెస్ నేతలే చెప్పాలి.

ఆదిలాబాద్‌లో 2లక్షల ఎకరాలకు..
తమ్మిడిహెట్టి వద్ద 148 మీటర్ల ఎత్తుతో నిర్మించనున్న బ్యారేజీతో ఆదిలాబాద్ జిల్లాలో 2లక్షల ఎకరాలకు నీరందించేలా ప్రణాళికలు సిద్ధం చేశాం. 14.4 టీఎంసీల ప్రాణహిత నీటిని నిర్ణీత ఆయకట్టుకు అందించేలా వ్యాప్కోస్ నివేదిక అందజేసింది. గతంలో తమ్మిడిహెట్టి ద్వారా ఆదిలాబాద్ జిల్లాలో 56 వేల ఎకరాలకు నీరందించాలని నిర్ణయించగా... ఇప్పుడు మరో 1.44 లక్షల ఎకరాలకు అదనంగా నీరివ్వనున్నాం.

‘పాలమూరు’ ద్వారా రంగారెడ్డికి అదనపు ఆయకట్టు
కొత్తగా చేపడుతున్న పాలమూరు-రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల ద్వారా రంగారెడ్డి జిల్లాలో 4.35 లక్షల ఎకరాలకు సాగు నీరందించి జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు ప్రయత్నిస్తున్నాం. ప్రాణహిత పథకం కింద ఈ జిల్లాలో కేవలం 2.10లక్షల ఎకరాలకే నీరిచ్చేలా ప్రణాళికలు వేశా రు. కానీ రీఇంజనీరింగ్‌తో 4.35 లక్షల ఎకరాలకు సాగు నీరందుతుంది. జిల్లాలో పాలమూరు ఎత్తిపోతల ద్వారా 2.75 లక్షల ఎకరాలు, డిండి నుంచి లక్ష ఎకరా లు, ప్రాణహిత నుంచి గోదావరి ద్వారా 70 వేల ఎకరాలకు సాగునీరు అందిస్తాం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement