ప్రాణహిత పోయి వార్ధా వచ్చె! | Tammidihetti byareji place change? | Sakshi
Sakshi News home page

ప్రాణహిత పోయి వార్ధా వచ్చె!

Published Sat, Jul 14 2018 2:08 AM | Last Updated on Sat, Jul 14 2018 2:08 AM

Tammidihetti byareji place change? - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రాణహిత ప్రాజెక్టులో భాగంగా నిర్మించతలపెట్టిన తమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణ ప్రాంతం మారనుంది. మెయిన్‌గంగ, వార్ధా నదుల సంగమం అనంతరం ఏర్పడే ప్రాణహిత నదిపై తమ్మిడిహెట్టి నిర్మాణాన్ని తొలుత ప్రతిపాదించగా ప్రస్తుతం దాన్ని కేవలం వార్ధా నది మీదకు మార్చాలని ప్రభుత్వం యోచిస్తోంది. దీనిపై సర్వే చేసే బాధ్యతను వ్యాప్కోస్‌కు అప్పగించింది. వ్యయ అంచనా తగ్గుతుండటం, ముంపు తగ్గే అవకాశాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నా దీన్ని ఎప్పటిలోగా పూర్తి చేస్తారన్న విషయమై అనేక ప్రశ్నలు  తలెత్తున్నాయి.

మొదటి నుంచీ తడబాటే...
ప్రాణహిత ప్రాజెక్టులో భాగంగా తమ్మిడిహెట్టి బ్యారేజీ ద్వారా ఆదిలాబాద్‌ జిల్లాలో 56 వేల ఎకరాలకు నీరందించాలని గతంలో నిర్ణయించగా కొత్తగా చేసిన నిర్ణయం మేరకు జిల్లాలో మరో 1.44 లక్షల ఎకరాలను కలిపి మొత్తంగా 2 లక్షల ఎకరాలకు నీరిచ్చేలా ప్రణాళిక తయారు చేశారు. తమ్మిడిహెట్టి వద్ద 4.5 టీఎంసీ సామర్ధ్యంతో బ్యారేజీ నిర్మించి 20 టీఎంసీల నీటిని ఎత్తిపోసేలా మొదట రూ. 639 కోట్లతో అంచనా వేశారు. అనంతరం వన్యప్రాణి సమస్యల కారణంగా ప్రాణహిత ఎగువకు బ్యారేజీ ప్రాంతాన్ని మార్చి రూ. 1,918.70 కోట్లతో ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు.

ప్రాణహిత నదిపై 6.45 కిలోమీటర్ల మేర బ్యారేజీ నిర్మాణానికి 107 గేట్లు ఏర్పాటు చేయాల్సి ఉంటుందని, స్పిల్‌వే నిర్మాణమే 3 కిలోమీటర్లు ఉంటుందని లెక్కగట్టారు. ఈ నిర్మాణంతో మహారాష్ట్రలోని చంద్రాపూర్, గడ్చిరోలి జిల్లాల్లో 509 ఎకరాలు ముంపు ఉండగా ప్రస్తుత ఆసిఫాబాద్‌ జిల్లాలో 300 ఎకరాల ముంపు ఉంటుందని అంచనా వేశారు. అయితే ఇక తమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణ ప్రాంతం రాష్ట్ర పరిధిలోని కవ్వాల్, మహారాష్ట్ర పరిధిలోని తడోబా వన్యప్రాణి ప్రాంతం పరిధిలో ఉంటోంది.

దీంతో పర్యావరణ అటవీ అనుమతులతోపాటు వన్యప్రాణి బోర్డు అనుమతులు తప్పనిసరయ్యాయి. అయితే తమ ప్రాంతంలోని ముంపు ప్రాంతాలపై మహారాష్ట్ర అంగీకరించకపోవడంతో ఇన్నాళ్లూ ప్రాజెక్టు ముందుకు కదల్లేదు. అయితే అంతర్రాష్ట్ర ఒప్పందాల్లో భాగంగా తమ ప్రాంత భూములు ఇచ్చేందుకు మహారాష్ట్ర సమ్మతి తెలపడంతో పర్యావరణ, అటవీ అనుమతులు లభించాయి. కానీ పరిహారం చెల్లింపు విషయంలో అటవీశాఖ చేస్తున్న జాప్యంతో ముందడుగు పడట్లేదు. దీంతో బ్యారేజీ నిర్మాణం నాలుగేళ్లుగా మొదలుకాలేదు.

బ్యారేజీ స్థలం మార్పు యోచన...
బ్యారేజీ నిర్మాణంలో జాప్యంపై ఇటీవల సమీక్షించిన ప్రభుత్వం కొత్త రేట్ల ప్రకారం తమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణ వ్యయాన్ని లెక్కగట్టింది. దీని ప్రకారం 2007–08లో వేసిన అంచనా రూ. 1,918.70 కోట్లుకాగా ప్రస్తుత అంచనా రూ. 2,600 కోట్లకు చేరింది. వ్యయం భారీగా పెరుగుతుండటంతో పునరాలోచించిన ప్రభుత్వం బ్యారేజీని కేవలం వార్ధా నది వరకే పరిమితం చేయాలని నిర్ణయించింది. దీంతో కేవలం ఒక కిలోమీటర్‌ మేరకే బ్యారేజీ నిర్మాణం అవసరమవుతుండగా ఇందుకు 36 గేట్లు సరిపోనున్నాయి.

ముంపు ప్రాంతం 400 ఎకరాలకు మించదని, వ్యయం సైతం రూ. 650 కోట్లను దాటదని నీటిపారుదల వర్గాలు అంచనా వేశాయి. వార్ధా నదిలో 60 టీఎంసీల నీటి లభ్యత ఉండగా ఇందులో 20 టీఎంసీలు ఆదిలాబాద్‌ జిల్లా అవసరాలకు సరిపోతాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రాణహితను కాదని వార్ధాపై నిర్మాణానికి వేగంగా ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. అయితే తమ్మిడిహెట్టి నిర్మాణమే పదేళ్లుగా మూలనపడగా తాజాగా వార్ధాపై నిర్మాణాన్ని ఎప్పటికి పూర్తి చేస్తారన్నదానిపై అనేక ప్రశ్నలు ఉదయిస్తున్నాయి.

మార్పు ఆలోచనలపై కాంగ్రెస్‌ కన్నెర్ర..!
తమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణ ప్రాంత మార్పు యోచనపై కాంగ్రెస్‌ పార్టీ మండిపడుతోంది. తమ్మిడిహెట్టి వద్ద తట్టెడు మట్టి కూడా ఎత్తలేదంటూ అధికార టీఆర్‌ఎస్‌ గతంలో తమపై విమర్శలు చేసిందని, మరి నాలుగేళ్ల పాలనలో అక్కడ బ్యారేజీ నిర్మాణానికి టీఆర్‌ఎస్‌ ఏం చేసిందో చెప్పాలని నిలదీస్తోంది. బ్యారేజీ నిర్మాణంపై కొత్త ప్రతిపాదన తేవడం ప్రజలను మభ్యపెట్టడమేనని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే టి.

జీవన్‌రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. బ్యారేజీ ప్రాంతాన్ని మారిస్తే కాగజ్‌నగర్, బెల్లంపల్లి, చెన్నూర్, ఆసిఫాబాద్‌ నియోజకవర్గ ప్రజలతో కలసి భారీ ఉద్యమ కార్యాచరణకు దిగాలని కాంగ్రెస్‌ నిర్ణయించినట్లు తెలిసింది. అవసరమైతే రంగారెడ్డి జిల్లా నేతలను కలుపుకొని రెండు జిల్లాల్లో ఉద్యమాలు చేయాలని భావిస్తున్నట్లు కాంగ్రెస్‌ వర్గాలు వెల్లడించాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement