ఇక ప్రభుత్వంపై పోరాటమే
క్షేత్రస్థాయి పోరాటానికి పీసీసీ కసరత్తు
సాక్షి,హైదరాబాద్: టీఆర్‌ఎస్ ఇచ్చిన హామీల వైఫల్యం, ప్రజా సమస్యలపై క్షేత్రస్థాయి పోరాటానికి పీసీసీ కసరత్తు చేస్తోంది. టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లవుతున్న క్రమంలో ఇప్పటి వరకు రాష్ట్రంలో నెల కొన్న పరిస్థితిపై అధ్యయనం చేయాలని నిర్ణయించింది. ఈమేరకు రైతులు, యువత, విద్యార్థులు, దళితులు, మైనారిటీలకు టీఆర్‌ఎస్ ఇచ్చిన హామీల అమలు, వైఫల్యం తది తరాలపై సమగ్ర అధ్యయనం చేయాలని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కొందరికి బాధ్యతలు అప్పగించారు. లక్ష లోపు పంట రుణాలను నాలుగు విడతలుగా మాఫీ చేస్తామని చెప్పి, ఇప్పటిదాకా కేవలం రెండు విడతలే చేయడంపై రైతుల అభిప్రాయాలను సేకరించనుంది.
దళితులకు మూడెకరాల భూమి హామీ అమలుపై గ్రామాల్లో పరిస్థితులను తెలుసుకోనుంది. కేజీ టు పీజీ దాకా ఉచిత నిర్బంధ విద్య, లక్ష ఉద్యోగాల కల్పన, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ తదితరాలపైనా నివేదికను తెప్పించుకోనుంది. అనంతరం అంశాల వారీగా కార్యాచరణ రూపొందించుకోవాలని ఉత్తమ్ యోచి స్తున్నారు. ఇతర పార్టీలను, వివిధ ప్రజా సంఘాలను క్షేత్రస్థాయి సమరంలో భాగస్వామ్యం చేయడం ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడానికి వ్యూహరచన చేస్తున్నారు. జిల్లాల ఏర్పాటు ప్రక్రియ పూర్తయిన తర్వాత కొత్తగా తలెత్తే సమస్యలు, ప్రభుత్వ కదలికలను బట్టి కార్యాచరణపై దృష్టి కేంద్రీకరించాలని భావిస్తున్నారు.