
ఒక్క డ్వాక్రా మహిళతోనైనా మాట్లాడించారా?
మహిళా సదస్సు నిర్వహణపై భూమన కరుణాకర రెడ్డి ధ్వజం
సాక్షి, హైదరాబాద్: మహిళా సాధికారత అంటూ చంద్రబాబు ప్రభుత్వం నిర్వహించిన మహిళా పార్లమెంట్ ఓ కిట్టీ పార్టీలాగా జరిగిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకరరెడ్డి విమర్శించారు. పారిశ్రామిక రంగంలోని మహిళలతో వేదికను నింపి.. గొప్పగా నిర్వహించామని చెప్పకోవడం దౌర్భాగ్యమని ఆయన ధ్వజమెత్తారు. సోమవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. సదస్సులో ఒక్క డ్వాక్రా మహిళ గొంతన్నా వినిపించిందా? దేశంలో మహిళలకు జరుగుతున్న అన్యాయాలకు వ్యతిరేకంగా పోరాడుతున్నవారు ఒక్కరైనా కనిపించారా?
కనీసం ఒక్కటైనా ఉపయోగపడే చర్చ జరిగిందా? అని చంద్రబాబును ప్రశ్నించారు. కేవలం తన అనుచరవర్గం, తమ కుటుంబీకులకు సంబంధించిన వారి హడావుడితో, మహిళా సదస్సును టీడీపీ పార్టీ ఇంటి కార్యక్రమంగా నిర్వహించారని అన్నారు. ఈ సదస్సుకు మహిళల రోదన అంతా బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌లా మారిందని, ఎమ్మెల్యే రోజా కన్నీళ్లను పన్నీరులా చల్లుకున్నారని మండిపడ్డారు. సదస్సు నిర్వాహకుడు, స్పీకర్ కోడెల శివప్రసాదరావు.. ప్రతిపక్షం విషం చిమ్మటానికి ప్రయత్నిస్తోందనటాన్ని భూమన తీవ్రంగా వ్యతిరేకించారు. కడివెడు విషంలో చిటికెడు పాలు కలపడానికి వైఎస్సార్‌సీపీ సదస్సుకు వచ్చిందని చెప్పారు. టీడీపీ ఎంపీ కుమార్తె చంద్రబాబుకు వ్యతిరేకంగా తిరుపతిలో నిరసన తెల్పిన విషయాన్ని గుర్తుచేశారు. టీఆర్‌ఎస్ ఎంపీ కవిత.. దూబగుంట రోశమ్మ ప్రస్తావన తీసుకురాగానే నిర్వాహకుల ముఖాలన్నీ కందగడ్డలుగా మారిపోయాయని భూమన చెప్పారు.
కార్పొరేట్ కార్పెట్ల కింద పాలన..
రాష్ట్రంలో చంద్రబాబు పాలన కార్పొరేట్ కార్పెట్ల కింద నుంచి కొనసాగుతోందని భూమన ఎద్దేవా చేశారు. అన్ని వర్గాల ప్రజలను మోసపూరిత హామీలతో వంచించి ప్రచార ఆర్భాటాలతో పాలన సాగిస్తున్నారని ధ్వజమెత్తారు.