
పాపం.. బిహారీ..!
ఆస్పత్రిలో యువకుడి శవం..పక్కనే రోదిస్తున్న మిత్రుడు.. అంతే..! ఇక్కడ వారికెవరూ లేరు.. వారిని పట్టించుకునే వారు అసలే లేరు..
నల్లకుంట: ఆస్పత్రిలో యువకుడి శవం..పక్కనే రోదిస్తున్న మిత్రుడు.. అంతే..! ఇక్కడ వారికెవరూ లేరు.. వారిని పట్టించుకునే వారు అసలే లేరు.. మిత్రుడి మృతదేహాన్ని తల్లిదండ్రుల వద్దకు చేర్చాలి.. చేతిలో చిల్లిగవ్వ లేదు.. ఏంచేయాలో పాలుపోలేదు.. తల్లిదండ్రులకైనా చెబతామని ఫోన్‌చేస్తే.. అటువైపు నుంచి గుండె తరుక్కుపోయే సమాధానం.. ‘‘బాబూ..మేం పేదవాళ్లం.. మా వాడి శవం తీసుకువెళ్లడానికి డబ్బుల్లేవు.. అక్కడే దహనకార్యక్రమాలు కానివ్వండి’’ అంటూ ఆ తల్లిదండ్రులు చెప్పేశారు. అర్థంకాని ఈ పరిస్థితుల్లో శవాన్ని ఓ స్వచ్చంద సంస్థ దహనకార్యక్రమాలు నిర్వహించే బాధ్యతను తన భుజానవేసుకుంది. ఈ హృదయవిదారక సంఘటన ఆదివారం నిలోఫర్ ఆస్పత్రిలో జరిగింది. బీహార్ డర్బన్ బైరీ గ్రామానికి చెందిన లలిత్ సాగ(35) రాయిచూర్‌లో రైస్‌మిల్ కూలీగా పనిచేస్తున్నాడు. 20 రోజుల క్రితం ఓ కుక్క కరిచింది.
నిరక్షరాస్యుడైన అతను చికిత్స తీసుకోలేదు. ఈ క్రమంలో మూడు రోజులుగా వింతగా ప్రవర్తిస్తున్న అతను స్వగ్రామానికి వెళతానని పట్టు బట్టాడు. అతని స్నేహితుడు రామ్‌కుమార్ ఆదివారం లలిత్‌నాగ్‌ను బస్సులో స్వగ్రామానికి తీసుకు వెళుతున్నాడు. హైదరాబాద్‌కు చేరుకునే సరికి లలిత్‌నాగ్ మరింత వింతగా ప్రవర్తించసాగాడు. వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తీసుకు వెళ్లి చూపించగా అతని ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది వెంటనే నల్లకుంటలోని ఫీవర్ ఆస్పత్రికి తీసుకు వెళ్లాలని ఆక్కడి వైద్యులు సూచించారు. పరీక్షించిన నిలోఫర్ వైద్యులు రేబీస్‌గా నిర్ధారించి చికిత్సలు ప్రారంభించేలోపే అతను మృతి చెందాడు. మృతునితో పాటు వచ్చిన రామ్‌నాగ్ బీహార్‌లో ఉన్న మృతుని తల్లి దండ్రులకు ఫోన్‌లో సమాచారమందించాడు. పేద కుటుంబానికి చెందిన తాము ఇప్పుడు అంత దూరం రాలేమని ఎలాగోలా అక్కడే తమ కుమారుడి మృత దేహానికి అంత్య క్రియలు నిర్వహించాలని వేడుకున్నారు. దీంతో ఆస్పత్రి అధికారులు నల్లకుంట పోలీసులకు సమాచారమందించగా మృత శవ పంచనామ నిర్వహించి, మృత దేహాన్ని గాంధీ మార్చురికీ తరలించారు. రియల్ వివేక్ స్వచ్ఛంద సేవా సంస్థ ప్రతినిధులకు సమాచారమందించడంతో వారు దహన సంస్కారాలు నిర్వహించేందుకు ముందుకు వచ్చారు. పోస్టుమార్టం అనంతరం శవాన్ని వారికి అప్పగిస్తారు.