ఇలాగే అవమానిస్తే ధర్నా చేస్తా | BJLP leader Vishnu kumar raju expreses intolarence | Sakshi
Sakshi News home page

ఇలాగే అవమానిస్తే ధర్నా చేస్తా

Published Tue, Mar 29 2016 2:28 AM | Last Updated on Sat, Aug 11 2018 9:14 PM

ఇలాగే అవమానిస్తే ధర్నా చేస్తా - Sakshi

ఇలాగే అవమానిస్తే ధర్నా చేస్తా

అసెంబ్లీలో తనకు మాట్లాడే చాన్సివ్వకపోవడంపై విష్ణుకుమార్‌రాజు కినుక
 
 సాక్షి, హైదరాబాద్: ‘ప్రతిసారీ నాకు అవమానం జరుగుతోంది... మరోమారు ఇలాగే అవమానిస్తే ధర్నా చేస్తా’ అని బీజేపీ శాసనసభాపక్ష నేత పి.విష్ణుకుమార్‌రాజు ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తి, ఆగ్రహం వెలిబుచ్చారు. ఎప్పుడూ ప్రభుత్వాన్ని విమర్శించకుండా, ఇరకాటంలో పెట్టకుండా సహకరిస్తుంటే ఇలా అవమానించటం సరికాదని,  కేంద్రంలో అధికారంలో ఉన్న, రాష్ర్టంలో ప్రభుత్వ భాగస్వామిగా ఉన్న జాతీయపార్టీకి పక్కనే ఉన్న తెలంగాణ అసెంబ్లీలో ఎలా అవకాశాలిస్తున్నారో, గౌరవిస్తున్నారో తెలుసుకోండంటూ ఆర్థిక, శాసనసభా వ్యవహారాల మంత్రి యనమల రామకృష్ణుడు, వ్యవసాయ మంత్రి పత్తిపాటి పుల్లారావుకు ఆయన స్పష్టం చేశారు.

ఆగ్రిగోల్డ్ అంశంపై సోమవారం శాసనసభలో చర్చ సందర్భంగా మాట్లాడేందుకు అవకాశమివ్వాలంటూ స్పీకర్ కోడెల శివప్రసాదరావును విష్ణుకుమార్‌రాజు మూడుసార్లు చెయ్యెత్తి కోరారు. ఒకసారి నిలుచుని అడిగారు. అయినప్పటికీ స్పీకర్ దృష్టి ఆయనపై పడలేదు. ఈలోగా అర్ధంతరంగా సభను మంగళవారానికి వాయిదా వేశారు. దీంతో సభనుంచి ఆగ్రహంగా బయటికొచ్చిన విష్ణుకుమార్‌రాజు అసెంబ్లీ లాబీల్లో తారసపడిన మంత్రులు యనమల, ప్రత్తిపాటి వద్ద అసంతృప్తి వ్యక్తం చేశారు. తీవ్ర స్వరంతో తన అసంతృప్తిని మంత్రులముందు వెళ్లగక్కారు. దీంతో లాబీల్లో ఉన్నవారి దృష్టి అటు పడింది. ఇది ఇబ్బందికర పరిణామంగా భావించిన మంత్రి యనమల.. బీజేఎల్పీ నేత చేయి గట్టిగా నొక్కుతూ మీకన్యాయం జరిగింది, మరోసారి అలా జరగకుండా చూస్తాం, రేపు(మంగళవారం) మాట్లాడేందుకు అవకాశమిస్తాం, శాంతించండని కోరారు. అయితే విష్ణుకుమార్‌రాజు తగ్గలేదు. దీంతో మంత్రులు వడివడిగా నడుచుకుంటూ బయటికొచ్చి తమ కార్లలో ఎక్కి వెళ్లిపోయారు.

 ఇలా జరగడం బాధిస్తోంది..
 తమ నేతకు ఏపీ అసెంబ్లీలో మాట్లాడేందుకు అవకాశం లభించలేదని తెలుసుకున్న తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి ఎందుకలా జరిగిందో విష్ణుకుమార్‌రాజును వాకబు చేశారు. సభలో నలుగుర ముంటే.. అందులో ఇద్దరు మంత్రులుగా ఉన్నారు, మరో ఇద్దరం సభ్యులుగా ఉన్నా కనీసం మాట్లాడే అవకాశం రావట్లేదని విష్ణుకుమార్‌రాజు చెప్పారు. తెలంగాణలో బీజేపీ ప్రతిపక్షంగా ఉన్నా మంచి అవకాశాలిస్తున్నారు, బాగా గౌరవిస్తున్నారని, కానీ మాదగ్గర పరిస్థితి  అందుకు విరుద్ధంగా ఉందన్నారు. అనంతరం విష్ణుకుమార్‌రాజు మీడియాతో మాట్లాడుతూ.. అగ్రిగోల్డ్ బాధితులు తనను కలసి వినతిపత్రం అందచేశారని, 40 లక్షలమంది బాధితులపక్షాన బీజేపీ వాదన ను సభలో వినిపించేందుకు అవకాశమివ్వకపోవటం బాధాకరమన్నారు.

 భూకేటాయింపుల్లో జాగ్రత్తగా ఉండాలి
 పరిశ్రమల పేరుతో చేసే భూ కేటాయింపుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని బీజేపీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్‌రాజు కోరారు. సోమవారం అసెంబ్లీలో బడ్జెట్ పద్దులపై చర్చలో ఆయన మాట్లాడారు. పరిశ్రమలు ఏర్పాటు చేసి ఉపాధి కల్పిస్తామని మోసం చేసే సంస్థలు చాలా ఉంటాయన్నారు. అందువల్ల భూములు కేటాయించే సమయంలో ఇలాంటి వాటి విషయంలో జాగ్రత్తగా ఉండాలని ఆయన ప్రభుత్వానికి సూచించారు. ‘కోటు వేసుకుని వచ్చేవారికి భూములిచ్చేస్తున్నారు. దీనివల్ల భూమిపోతోందేగానీ ఉపాధి లభించట్లేదు. బ్రాడిక్స్ ఇలాగే రూ.3,500 కోట్ల పెట్టుబడి పెడతామని, 60 వేల మందికి ఉపాధి కల్పిస్తామని ప్రభుత్వాన్ని భ్రమల్లో పెట్టి భూమి కొట్టేసింది’ అని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement