టీఆర్‌ఎస్‌కు షాక్ ఇవ్వండి
బీజేపీ ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మణ్
ముషీరాబాద్: గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేసి టిఆర్‌ఎస్ పార్టీకి షాక్ ఇవ్వాలని బీజేపీ ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మణ్ అన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తోందన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం అడిక్‌మెట్ డివిజన్‌లో అభ్యర్థి కె.ప్రసన్నతో కలిసి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా బస్తీల్లో ఇంటింటికి తిరిగి కమలం గుర్తుకు ఓటేయాలని కోరారు. ఎం.పీ, ఎమ్మెల్యే, కార్పొరేటర్ ముగ్గురూ ఒకటే పార్టీకి చెందినవారైతే అడిక్‌మెట్ మరింతగా అభివృద్ధి చెందుతుందన్నారు. అనంతరం అడిక్‌మెట్ బీజేపీ కార్యాలంయలో విలేకరులతో మాట్లాడుతూ టీఆర్‌ఎస్ నేతలకు నగర ప్రజలపై నమ్మకం లేకనే పక్క జిల్లాల నుంచి కార్యకర్తలను తెచ్చుకున్నారన్నారు. అధికార పార్టీ ఎన్నికల కోడ్‌ను ఉల్లఘించి రూ. కోట్లు వెదజల్లుతోం దని ఆరోపించారు. తెలంగాణ ఆవిర్భావం రోజున ప్రధానిని పిలవమని కోరితే ఆయన వస్తే తమ గ్రాఫ్ తగ్గిపోంతుందని భయపడి నేడు ప్రధానిపై విమర్శలు చేయడం తగదన్నారు.
అధికారంలోకి వచ్చి 18నెలలు గడిచినా ఒక్క ఉద్యోగం ఇవ్వలేదని ఆరోపించారు. కేటీఆర్, కవితలు మజ్లిస్‌కు తమకు పొత్తు లేదని చెబుతుండగా, ముఖ్యమంత్రి కేసీఆర్ మజ్లిస్ మిత్రపక్షమని బహిరంగంగా ప్రకటించారన్నారు. నగరంలో మంచినీరు లేక ప్రజలు అల్లాడుతుంటే, నగరానికి వచ్చే సింగూర్ నీటిని గజ్వేల్, సిద్దిపేటలకు తరలించాలంటున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంటింటికి నల్ల ఏ విధంగా ఇస్తారన్నారు.
31 తరువాత టీఆర్‌ఎస్ బయట వ్యక్తులను పంపాలి...
వివిధ జిల్లాల నుంచి గ్రేటర్ ఎన్నికల ప్రచారానికి వచ్చిన టిఆర్‌ఎస్ కార్యకర్తలు 31వ తేదీ సాయంత్రం నగరం విడిచి వెళ్లిపోవాలన్నారు. వాళ్లు నగరం విడిచి వెళ్లేలా పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. లేని పక్షంలో తమ పార్టీకి చెందిన యువమోర్చా నాయకులు వారిని వెళ్లగొడతారన్నారు. కార్యక్రమంలో విన్ను ముది రాజ్, బొట్టు శ్రీను, సాయికృష్ణ యాదవ్, జగదీష్, కౌండిన్య ప్రసాద్, అనురాధ, ఓంప్రకాష్, కిషోర్, రామస్వామి తదితరులు పాల్గొన్నారు.