జవహర్ నగర్ పేలుడు ఘటనలో చిన్నారి మృతి
హైదరాబాద్ : హైదరాబాద్ జవహర్ నగర్లో శుక్రవారం ఉదయం జరిగిన పేలుడు ఘటనలో గాయపడ్డ చిన్నారి తిరుత్తవేణి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ప్రమాదం జరిగిన సమయంలో తల్లిదండ్రులు ఇంట్లో లేరని వెస్ట్జోన్ డీసీపీ తెలిపారు. చిన్నారులు ఇంట్లో ఆడుకుంటున్న సమయంలో బండల కింద నుంచి పేలుడు వచ్చినట్లు పేర్కొన్నారు. అయితే ప్రమాదానికి కారణమైన వస్తువు ఏంటో తెలియటం లేదని, విచారణ అనంతరమే పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు. అయితే సిలిండర్ పేలడంతోనే ప్రమాదం జరిగిందని పోలీసులు మొదట భావించారు. కాగా ప్రమాదానికి గురైన కుటుంబం శ్రీకాకుళం జిల్లా నుంచి నగరానికి వలస వచ్చినట్లు చెప్పారు. సంఘటనా స్థలానికి చేరుకున్న బాంబ్ స్వ్కాడ్, ఫోరెన్సిక్ నిపుణులు ఆధారాలు సేకరిస్తున్నారు.