
మనసు మాట వినండి
► లేదంటే నా వయసుకు వచ్చాక బాధపడతారు: షారుఖ్
► ‘మనూ’స్నాతకోత్సవంలో బాలీవుడ్ సూపర్ స్టార్
► విద్యార్థి దశలో ఎంతో ఉత్సాహం.. ఎన్నో ఆకాంక్షలు..
► తల నిండా వెంట్రుకలుంటాయి..
► కాలం గడిచే కొద్దీ అవి తగ్గిపోతాయి
► లోకంలో విద్యకు మించిందేమీ లేదు
► షారూఖ్‌కు గౌరవ డాక్టరేట్ ప్రదానం
► అనారోగ్యంతో హాజరు కాలేకపోయిన రాష్ట్రపతి ప్రణబ్
సాక్షి, హైదరాబాద్: ‘‘విద్యార్థి దశలో అంతులేని ఉత్సాహం... భవిష్యత్తుపై ఎన్నో ఆకాంక్షలు.. తల నిండా వెంట్రుకలు ఉంటాయి.. కాలం గడిచే కొద్దీ ఇవన్ని తగ్గిపోతాయి. జీవితంలో ఏం సాధించాలన్నా విద్యార్థి దశ కీలకం. మనసు ఏం చెబితే అదే చేయాలి. మనసుకు నచ్చిన మార్గాన్ని ఎంచుకోవాలి.. లేదంటే మీరు(విద్యార్థులు) నా వయసు, తల్లిదండ్రులు, గురువుల వయసుకు చేరిన తర్వాత మనసు చెప్పినట్లు ఎందుకు చేయలేదన్న బాధ కలుగుతుంది..’’అని బాలీవుడ్ సూపర్‌స్టార్ షారూఖ్ ఖాన్ యువతకు సూచించారు. లోకంలో విద్యకు మించిందేమి లేదని చెప్పారు.
సోమవారం హైదరాబాద్‌లోని మౌలానా ఆజాద్ జాతీయ ఉర్దూ విశ్వవిద్యాలయం(మనూ) 6వ స్నాతకోత్సవం ఘనంగా జరిగింది. ఉర్దూ భాషకు చేసిన సేవకు గుర్తింపుగా షారుక్‌ఖాన్, రేఖ్తా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సంజీవ్ సరఫ్‌లకు వర్సిటీ యాజమాన్యం గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది. ఈ సందర్భంగా షారుక్ మాట్లాడుతూ... తన తల్లి పుట్టినిళ్లయిన హైదరాబాద్‌లో ఈ పురస్కారం అందుకోవడం ఎంతో సంతోషాన్ని కలిగించిందన్నారు. ‘‘ఈ గౌరవం అందుకునే అర్హత నాకు ఉందో నాకు లేదో తెలియదు.. మీరు ఇచ్చారు కాబట్టి సంతోషంగా స్వీకరిస్తున్నా..’అంటూ చమత్కరించారు. తల్లిదండ్రులు ఈ రోజు బతికి ఉంటే చాలా ఆనందించేవారన్నారు. ఉన్నత విద్యావంతుడైన తన తండ్రికి చదువు పట్ల ఎంతో మమకారం ఉండేదని, చాలా అందమైన ఉర్దూ మాట్లాడేవారని పేర్కొన్నారు. తనకు లభించిన కొద్దో గొప్పో మాట్లాడే జ్ఞానం తండ్రి నుంచే అబ్బిందన్నారు. విద్య, ఉర్దూ భాష పట్ల ఈ పురస్కారం తన బాధ్యతను మరింత పెంచిందన్నారు. స్నాతకోత్సవంలో 276 మంది వర్సిటీ విద్యార్థులకు పీహెచ్‌డీ, ఎంఫిల్, 2,885 మంది విద్యార్థులకు గ్యాడ్యుయేషన్ పట్టాలను ప్రదానం చేశారు. కార్యక్రమంలో వర్సిటీ చాన్స్‌లర్ జఫర్ సరేష్‌వాలా, వీసీ డాక్టర్ ముహమ్మద్ అస్లాం పర్వేజ్, వర్శిటీ పాలకవర్గం, అధ్యాపకులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనారోగ్యం కారణంగా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ స్నాతకోత్సవానికి హాజరు కాలేకపోయారు. విద్యార్థులను ఉద్దేశించి షారుక్ ఖాన్ చేసిన ప్రసంగం ఆకట్టుకుంది.
చెస్.. టైప్‌రైటర్.. పాత కెమెరా..
డబ్బుల్లేకపోయినా తన తండ్రి తమకు చాలా ప్రేమానురాగాలను పంచారని షారుక్ చెప్పారు. ‘‘డబ్బుల్లేక నా ప్రతి జన్మదినానికి తండ్రి ఆయన ఏదో ఒక పాత వస్తువును కానుకగా ఇచ్చేవారు. ఉర్దూ పదాలతో ఆ వస్తువు గొప్పతనాన్ని అందంగా వివరించి నచ్చజెప్పేవారు. అలా తొలి కానుకగా విరిగిపోయిన చదరంగం సెట్‌ను ఇచ్చారు. దాంతో జీవితానికి సంబంధించిన ఎన్నో విషయాలను నేర్చుకోవచ్చని చెప్పారు. కలిసిమెలిసి పరస్పర సహకారంతో ఎలా పని చేయాలి.. జీవితంలో ముందుకు వెళ్లడానికి ఒక్కోసారి వెనక్కి తగ్గాల్సి రావచ్చు.. జీవితంలో ఏ వ్యక్తి చిన్నవాడు కాదు.. ఎవరితోనైనా అవసరం పడొచ్చు.. ప్రతి ఒక్కరిని గౌరవించడం నేర్చుకోవాలి.. జీవితంలో విజయం సాధించేందుకు త్యాగాలు తప్పవన్న విషయాలను చదరంగం నేర్పుతుంది. ఇక రెండో కానుకగా నా తండ్రి టైప్‌రైటర్ ఇచ్చారు. దాంతో రాస్తే చెరపడం కష్టం కావడంతో ఎంతో ఏకాగ్రత్తతో టైపింగ్ చేయాల్సి ఉంటుంది. జీవితంలో అభ్యాసంతో ఏదైన సాధించవచ్చని ఆ టైప్‌రైటర్ నేర్పింది. మూడో కానుక పాత కెమెరా. అందులోంచి చూస్తే అందమైన దృశ్యాలు కనిపిస్తుండేవి. అయితే ఆ కెమెరా ఫోటోలు తీసేందుకు పనికొచ్చేది కాదు. మనలోని సృజనాత్మకత, ఆకాంక్షలకు తగ్గట్లు చాలా మంది జీవితాలు ఉండవని ఆ కెమెరా ద్వారా తండ్రి బోధించారు’’అని షారుక్ వివరించారు.
మనసు బాగోలేనప్పుడు కవిత్వం రాస్తా
తన మనసుకు నచ్చిన నటనా రంగంలో అడుగుపెట్టి విజయం సాధించానని, జీవితంలో కొందరికే ఈ అదృష్టం దక్కుతుందని షారుక్ అన్నారు. మనలోని సృజనాత్మకతను ప్రపంచం స్వీకరించాలన్న నిబంధన లేదన్నారు. ‘‘కష్టకాలంలో ఒంటరిగా ఉన్నప్పుడు మన సృజనాత్మకతే మనకు తోడుగా నిలుస్తుంది. నాకు కవిత్వం రాయడం రాకపోయినా మనసు బాగో లేనప్పుడు రాస్తుంటా’’అని చెప్పారు. ఈ సందర్భంగా తాను రాసిన ‘హమ్‌నే తుమ్హారీ రాహ్‌మే రోరోకే టబ్ భర్‌దియా...వోహ్ ఆకే నహకే చలేగయే’కవితను ఉటంకించారు. ఎప్పుడైనా బాధలో ఉన్నప్పుడు ఇలా కవిత్వం రాస్తే మనసుకు ప్రశాంతత లభిస్తుందన్నారు.
కొంచెమైనా పిల్లల అమాయకత్వం ఉండాలి..
ప్రతి ఒక్కరికి సెన్స్ ఆఫ్ హ్యూమర్ (హస్య చతురత) ఉండాలని షారుక్ అన్నారు. చిన్నపిల్లాడిలో ఉండే అమాయకత్వాన్ని కొంచెమైనా కలిగి ఉంటే జీవితం ఆనందంగా సాగుతుందన్నారు. మన గురించి మంచి, చెడు రెండు రకాలుగా చెప్పేవారుంటారని, వాటిని ‘సెన్స్ ఆఫ్ హ్యూమర్’దృష్టితో స్వీకరిస్తే జీవితం సాఫీగా సాగిపోతుందన్నారు. తల్లిదండ్రులు మనకు ఇచ్చిన ఈ విలువైన జీవితాన్ని ప్రేమించాలని, జీవితంపట్ల దృఢమైన నమ్మకం కలిగి ఉండాలన్నారు.