అదే క్రేజ్
=హైటెక్ యుగంలోనూ పుస్తకాలకు డిమాండే..
=కొత్త విషయాల కోసం పుస్తక పఠనం చేసేవారు 68 శాతం
=నెట్‌లో పుస్తకాలు సెర్చ్ చేసే వారి శాతం 48
=‘సాక్షి’ సర్వేలో వెల్లడి
న్యూస్‌లైన్, ముషీరాబాద్: ఇంటర్‌నెట్‌లో సమస్త సమాచారం అందుబాటులోకి వచ్చినా... సిటీజనులకు పుస్తక పఠనంపై మక్కువ ఏమాత్రం తగ్గలేదు. ఇంటర్నెట్‌లో పుస్తకాలు అందుబాటులో ఉన్నా.. పఠనాభిలాషులు ప్రత్యక్షంగా పుస్తకాలను చదివేందుకే ఆసక్తి చూపుతున్నారు. ఎన్టీఆర్ స్టేడియంలో బుక్ ఫెయిర్ జరుగుతున్న సందర్భంగా ‘సాక్షి’ పుస్తక ప్రియులను పలకరించింది. పఠనాభిలాషపై 100మందిని ప్రశ్నించింది.
ఈ సర్వేలో ఆసక్తికరమైన అనేక అంశాలు బయటపడ్డాయి. 68 శాతం మంది కొత్త విషయాలు తెలుసుకునేందుకే పుస్తకాలను చదువుతున్నట్లు తేలింది. అలాగే 8 శాతం మంది ఒత్తిడిని తగ్గించుకునేందుకు, 24 శాతం మంది అలవాటు ప్రకారం పుస్తకాలను చదువుతున్నారు. విజ్ఞానదాయకమైన అంశాల కోసం 48 శాతం మంది పుస్తకాలను ఆశ్రయిస్తున్నట్లు వివరించారు. ఆధ్యాత్మిక పుస్తకాలు చదివేవారి సంఖ్య 12 శాతం మాత్రమే ఉంది.
ఇంటర్నెట్‌లోనూ పుస్తకాల కోసం సెర్చ్ చేసేవారి సంఖ్య తక్కువేం లేదు. 48 శాతం మంది నెట్‌లో సెర్చ్ చేసి పుస్తకాలను చదువుతున్నట్లు వెల్లడైంది. ఇంటర్నెట్ వంటి ఆధునిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చిన తర్వాత కూడా ముద్రిత పుస్తకాలను ఎందుకు కొనుగోలు చేస్తున్నారన్న ప్రశ్నకు.. ప్రత్యక్షంగా చదవడం వల్ల ఏకాగ్రత పెరుగుతుందని 56 శాతం మంది పేర్కొనడం విశేషం.