♦ జిల్లాల వారీగా ఖనిజాల లభ్యతపై అధ్యయనం
♦ ఖనిజ ఆధారిత పరిశ్రమల స్థాపనపై ప్రత్యేక దృష్టి
♦ 2015-16లో రూ. 3,300 కోట్ల ఆదాయ లక్ష్యం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఖనిజ ఆధారిత పరిశ్రమల స్థాపనను ప్రోత్సహించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. గనులు, ఖని జాల ద్వారా రాష్ట్రానికి లభిస్తున్న ఆదాయం.. రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్‌డీపీ)లో 4 శాతం, పారిశ్రామిక రంగంలో 16 శాతంగా ఉంది. రాష్ట్రంలో ఖనిజ వినియోగం పెరుగుతున్నట్లు సామాజిక, ఆర్థిక సర్వే -2016 వెల్లడించింది. బొగ్గు, ముడి ఇనుము, సున్నపురాయి, డోల మైట్, మాంగనీస్ తదితర ఖనిజాలు రాష్ట్రంలో పుష్కలంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రం లో ఖనిజ లభ్యతపై అంచనా వేస్తున్న గనులు, భూగర్భ వనరుల శాఖ.. జిల్లాల వారీగా ఏయే పరిశ్రమల ఏర్పాటుకు అవకాశముందనే కోణంలో జాబితాను రూపొందించింది.
వివిధ ఖనిజాల వెలికితీతకు సంబంధించి గనులు, భూగర్భ వనరుల శాఖ ఇప్పటికే ప్రాథమిక అధ్యయనం చేసి.. రంగారెడ్డి, మహబూబ్‌నగర్, నల్లగొండ, మెదక్ జిల్లాల్లో ప్రత్యేక మైనింగ్ జోన్ల ఏర్పాటుకు ప్రతిపాదించింది. మరోవైపు మైనింగ్‌పై వేగంగా నిర్ణయాలు తీసుకునేందుకు పరిశ్రమల శాఖ కార్యదర్శి నేతృత్వంలో రాష్ట్రస్థాయి టాస్క్‌ఫోర్స్ ఏర్పాటైం ది. నిర్మాణ రంగంలో వినియోగించే మైనర్ మినరల్స్ సీనరేజీ చార్జీల చెల్లింపులో వన్ టైం సెటిల్‌మెంట్ విధానం, గ్రానైట్ పాలి షింగ్, సున్నపురాయి పరిశ్రమలపై సీనరేజీ చార్జీల విధింపులో రెండేళ్ల పాటు శ్లాబ్ విధా నం అమలు ద్వారా మైనింగ్ రంగాన్ని ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఏటా పెరుగుతున్న ఆదాయం
రాష్ట్రంలో ఏటా సుమారు రూ. 16 వేల కోట్ల విలువ చేసే ఖనిజ సంపదను వెలికితీస్తున్నారు. సీనరేజీ, లెసైన్సు ఫీజు తదితరాల ద్వారా 2015-16లో రూ. 3,300 కోట్ల మేర ఆర్జించాలని లక్ష్యం నిర్దేశించగా.. ఇప్పటి వరకు సుమారు రూ. రెండువేల కోట్ల మేర ఆదాయం లభించింది. నూతన ఇసుక విధానం కాసులు కురిపిస్తోంది. 2015-16లో ఇసుక వేలం ద్వారా రూ. 500 కోట్లు ఆర్జించాలని లక్ష్యం నిర్దేశించగా.. ఇప్పటికే రూ. 370 కోట్లు లభించింది. ప్రభుత్వ కొత్త మైనింగ్ విధానం, 31 మినరల్ పాలసీ అమల్లోకి వస్తే గనులు, ఖనిజాల ద్వారా ప్రభుత్వానికి ఏటా రూ. ఐదువేల కోట్ల మేర ఆదాయం లభించే అవకాశం ఉందని గనుల శాఖ అంచనా వేస్తోంది.
జిల్లా ఖనిజాధారిత పరిశ్రమ
ఆదిలాబాద్ : బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పత్తి, సిమెంట్
నిజామాబాద్ : బూడిద ఇటుకలు, బ్లాక్స్, సిమెంట్ మొజాయిక్ టైల్స్, వైట్ సిమెంట్, గ్రానైట్ కట్టింగ్, పాలిషింగ్
కరీంనగర్ : బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పత్తి, గ్రానైట్ కట్టింగ్, పాలిషింగ్
మెదక్ : ఫెర్రో సిలికాన్, గ్రానైట్ కట్టింగ్, పాలిషింగ్, రాతి ఇసుక, కంకర, గ్లాస్
వరంగల్ : బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పత్తి, గ్రానైట్ కట్టింగ్, పాలిషింగ్, సున్నం, స్పాంజ్ ఐరన్
రంగారెడ్డి : సిమెంటు, సిరామిక్, గ్లాస్, ఫెర్రో సిలికాన్, గ్రానైట్ కట్టింగ్, పాలిషింగ్, రాతి ఇసుక, కంకర
మహబూబ్‌నగర్ : గ్లాస్, ఫెర్రో సిలికాన్, పల్వరైజింగ్ యూనిట్లు, గ్రానైట్ కట్టింగ్, పాలిషింగ్, కంకర
నల్లగొండ : యురేనియం శుద్ధ్ది, సిమెంట్, గ్లాస్, ఫెర్రోసిలికాన్, గ్రానైట్, కంకర
ఖమ్మం : విద్యుత్ ఉత్పత్తి, సున్నం, స్పాంజ్ ఐరన్, ఇనుము, గ్రానైట్, గ్లాస్
మైనింగ్ పరిశ్రమకు ఊతం
Published Sat, Mar 26 2016 3:35 AM | Last Updated on Fri, Nov 9 2018 5:56 PM
Advertisement
Advertisement