విజిల్ మింగిన బాలుడు
- బయటకు తీసి ప్రాణాలు కాపాడిన గాంధీ ఆస్పత్రి వైద్యులు
హైదరాబాద్: ఓ బాలుడి గొంతులోకి జారిన విజిల్‌ను శస్త్రచికిత్స లేకుండా అత్యాధునిక పద్ధతుల ద్వారా బయటికి తీసి సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రి ఈఎన్‌టీ వైద్యులు చిన్నారి ప్రాణాలు కాపాడారు. హైదరాబాద్ బాలాపూర్‌కు చెందిన ప్రశాంతి, వెంకటేశ్వర్లు భార్యాభర్తలు. కొద్దిరోజుల క్రితం వీరు విడిపోయారు. తల్లి వద్ద ఉంటున్న కుమారుడు అభిరాం(10) స్థానిక పాఠశాలలో 3వ తరగతి చదువుతున్నాడు. ఈ నెల 24వ తేదీ సాయంత్రం అభిరాం ఆరుబయట విజిల్ ఊదుతూ తోటి చిన్నారులతో ఆడుకుంటున్నాడు.
ఈ క్రమంలో విజిల్ ప్రమాదవశాత్తు గొంతులోకి జారిపోయింది. తోటి పిల్లలు ఆరా తీయగా విజిల్ మింగేశానని చెప్పి ఇంటికి వెళ్లాడు. విజిల్ శబ్దం తప్ప మాట్లాడలేని స్థితిలో ఉన్న కుమారుడిని తల్లి పలు ఆస్పత్రులకు తీసుకువెళ్లింది. అక్కడి వైద్యులు చేతులెత్తేయడంతో ఈ నెల 25న గాంధీ ఆస్పత్రికి తీసుకువెళ్లింది. ఈఎన్‌టీ వైద్యులు పలు రకాలు ఎక్స్‌రేలు తీశారు. విజిల్ వంటి సాధనం ఎక్కడా కనిపించలేదు. నోటి వెంట విజిల్ సౌండ్ వస్తున్నా ఎక్స్‌రేల్లో కనిపించకపోవడంతో ఈఎన్‌టీ వైద్యులు కేసును ఛాలెంజింగ్‌గా తీసుకున్నారు. అత్యవసర కేసుగా పరిగణించి చిన్నారిని ఇన్‌పేషెంట్‌గా చేర్చుకుని గ్య్రాస్ట్రో ఎంట్రాలజీ విభాగంలో ఎండోస్కోపి చేయించారు. కుడి ఊపిరితిత్తిలో ఇరుక్కున్న విజిల్ వంటి ప్లాస్టిక్ సాధనాన్ని గుర్తించారు. శస్త్రచికిత్స చేస్తే బాలుడి ప్రాణాలకు ప్రమాదమని వైద్యులు భావించారు. బ్రాంకోస్కోపీ విధానం ద్వారా సన్నని తీగ వంటి సాధనాన్ని ఊపిరితిత్తుల్లోకి పంపి విజిల్‌ను విజయవంతంగా బయటకు తీశారు. మరోమారు వైద్యపరీక్షలు నిర్వహించి బాలుడిని డిశ్చార్జ్ చేస్తామని ఈఎన్‌టీ హెచ్‌వోడీ ప్రొఫెసర్ హన్మంతరావు తెలిపారు. అరుదైన వైద్యాన్ని అందించిన ప్రొఫెసర్ హన్మంతరావు, వైద్యులు శ్రీకాంత్, వెంకటరామిరెడ్డి, రాథోడ్, శ్యాంసన్ తదితరులను వైద్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి, డీఎంఈ రమణి, గాంధీ సూపరింటెండెంట్ శ్రవణ్‌కుమార్‌లు అభినందించారు.