పోలీసు పోస్టులకు బీటెక్, ఎంటెక్‌లు
♦ 32 వేల మంది బీటెక్, 1,836 మంది ఎంటెక్ అభ్యర్థుల దరఖాస్తు
♦ మొత్తం దరఖాస్తులు 5,36,037.. పోస్టులు 9,281..
♦ ఒక్కో పోస్టుకు 57 మంది పోటీ
♦ అత్యధికంగా నల్లగొండ జిల్లా నుంచి 71,743 మంది దరఖాస్తు
♦ పోటీలో తెలంగాణేతరులు 18,358 మంది
సాక్షి, హైదరాబాద్: పోలీసు కానిస్టేబుల్ పోస్టులకు ఉన్నత విద్యావంతులే కాదు.. ఇంజనీరింగ్ అభ్యర్థులు కూడా భారీగా పోటీ పడుతున్నారు. కానిస్టేబుల్ పోస్టులకు ఇంటర్మీడియెట్ కనీస అర్హత కాగా... పీహెచ్‌డీ, ఎంఫిల్, ఎంటెక్, బీటెక్ చదివినవాళ్లూ పెద్ద సంఖ్యలో దరఖాస్తు చేసుకున్నారు. కానిస్టేబుల్ పోస్టులకు దరఖాస్తుల గడువు గురువారం రాత్రి 12 గంటలతో ముగిసే సమయానికి మొత్తం 5,36,037 దరఖాస్తులు వచ్చాయి. అందులో మహిళలు 82,889 మంది, పురుషులు 4,53,148 ఉంది ఉన్నారు. బీటెక్ గ్రాడ్యుయేట్లు 32,729, పీజీ చేసినవారు 28,610, బ్యాచిలర్ డిగ్రీ చదివిన వారు 1,32,327 మంది ఉన్నారు. మొత్తంగా 9,281 పోస్టులు ఉండగా... ఒకో పోస్టుకు 57 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు.
మహిళా అభ్యర్థులు అంతంతే..
పోలీస్ కానిస్టేబుల్ పోస్టులకు మహిళల నుంచి అంతంత మాత్రంగానే దరఖాస్తులు వచ్చాయి. ఇప్పటికే పోలీసు విభాగంలో మహిళల శాతం తక్కువగా ఉండటంతో... వారి సంఖ్యను పెంచడానికి ఈసారి ప్రత్యేకంగా 33 శాతం రిజర్వేషన్లు ప్రకటించారు. అయినా పెద్దగా స్పందన రాలేదు. రాష్ట్రవ్యాప్తంగా మహిళా అభ్యర్థుల నుంచి కేవలం 82,889 దరఖాస్తులు వచ్చాయి. అన్ని జిల్లాలతో పోలిస్తే హైదరాబాద్‌లో చాలా తక్కువగా 4,219 మంది మాత్రమే దరఖాస్తు చేశారు. అత్యధికంగా వరంగల్ జిల్లా నుంచి 11,691 మంది మహిళా అభ్యర్థులు దరఖాస్తులు చేసుకున్నారు.
దరఖాస్తుల్లో నల్లగొండ జిల్లా టాప్
పోలీసు కొలువుల కోసం వచ్చిన దరఖాస్తులలో నల్లగొండ జిల్లా నుంచి అత్యధికంగా దరఖాస్తులు వచ్చాయి. ఇప్పటికే పోలీసు విభాగంలో అన్ని ఫార్మాట్లలో నల్లగొండ జిల్లావాసులే ఎక్కువగా ఉండడం గమనార్హం. అత్యధికంగా నల్లగొండ జిల్లా నుంచి 71,743 దరఖాస్తులు రాగా, తర్వాతి స్థానాల్లో వరంగల్ (67,583), మహబూబ్‌నగర్ (56,292), రంగారెడ్డి (55,720), కరీంనగర్ (55,600), ఆదిలాబాద్ (51,212), ఖమ్మం (51,144), హైదరాబాద్ (38,757), మెదక్ (38,516), నిజామాబాద్ (31,112) ఉన్నాయి. ఇక ఇతర రాష్ట్రాలు, ప్రాంతాలకు చెందిన వారు 18,358 మంది దరఖాస్తు చేసుకున్నారు.