యాకుత్‌పురా: బిల్డింగ్ అనుమతి మంజూరు కోసం రూ. 25 వేలు లంచం తీసుకుంటూ జీహెచ్‌ఎంసీ దక్షిణ మండలం సర్కిల్-4 కార్యాలయ సెక్షన్ ఆఫీసర్ మెహదీ అలీ మంగళవారం ఏసీబీ (అవినీతి నిరోధకశాఖ) అధికారులకు పట్టుబడ్డాడు. ఈ వ్యవహారంలో ఇతనికి సహకరించిన అటెండర్‌ను కూడా అరెస్టు చేశారు.
హైదరాబాద్ జిల్లా ఏసీబీ డీఎస్పీ-2 వి.రవి కుమార్ తెలిపిన వివరాల ప్రకారం... మలక్‌పేట్ రేస్ కోర్ట్స్ ప్రాంతానికి చెందిన సయ్యద్ గౌస్ 40 గజాల స్థలంలో ఇంటి నిర్మాణ అనుమతి కోసం సర్కిల్-4 టౌన్ ప్లానింగ్ సెక్షన్ ఆఫీసర్ మెహదీ అలీని సంప్రదించి, దరఖాస్తు ఫీజు నిమిత్తం రూ. 25 వేల డీడీ కట్టాడు. అయితే, తనకు రూ. 30 వేల లంచం ఇస్తేనే అనుమతి మంజూరు చేస్తానని మెహదీ అలీ అన్నాడు.
దీంతో రూ. 25 వేలు ఇచ్చేందుకు ఒప్పుకున్న గౌస్ ఈ విషయాన్ని ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. దీంతో సెక్షన్ ఆఫీసర్‌ను పట్టుకొనేందుకు ఏసీబీ అధికారులు పథకం వేసి.. రసాయనాలు పూసిన నోట్లను గౌస్ చేతికి ఇచ్చి మంగళవారం మధ్యాహ్నం 3.30కి సర్కిల్-4 టౌన్ ప్లానింగ్ కార్యాలయానికి పంపారు. గౌస్ ఆ డబ్బును మెహదీ అలీకి ఇవ్వబోగా...అటెండర్ వంశీకి ఇవ్వమని చెప్పాడు. గౌస్ నుంచి అటెండర్ వంశీ లంచం డబ్బు తీసుకుంటుండగా అప్పటికే అక్కడ కాపుకాసిన ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.
కేసు నమోదు చేసి సెక్షన్ ఆఫీసర్ మెహదీ అలీతో పాటు అటెండర్ వంశీని అదుపులోకి తీసుకున్నారు. ప్రభుత్వ ఆఫీసుల్లో పని చేసేందుకు ఎవరైనా లంచం అడిగితే ప్రజలు 9440446134కు సమాచారం అందిస్తే చర్యలు తీసుకుంటామని ఏసీబీ డీఎస్పీ రవి తెలిపారు. ఈ దాడిలో ఏసీబీ ఇన్‌స్పెక్టర్లు అంజిరెడ్డి, నిరంజన్, సుదర్శన్ రెడ్డి, మంజుల, ఏసుదాస్ తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా.. సెక్షన్ ఆఫీసర్ మెహదీ అలీ ఇంటి నిర్మాణాల అనుమతి కోసం వచ్చే వారి నుంచి లంచం తీసుకుంటున్నట్టు కొన్నేళ్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇతను అనుమతి లేని ఇళ్లను గుర్తించి మరీ డబ్బు వసూలు చేస్తున్నాడని తెలుస్తోంది.