
ఎక్కడి బస్సులు అక్కడే
బస్‌భవన్ వద్ద ధర్నా కోసం తరలి వెళ్లిన కార్మికులు
70 శాతానికిపైగా బస్సులు డిపోలకే పరిమితం
అల్లాడిన టెన్త్ విద్యార్థులు, ఇతర ప్రయాణికులు
నగరంలో గురువారం గురువారం పెద్ద సంఖ్యలో ఆర్టీసీ సర్వీసులు నిలిచిపోయాయి. ఆర్టీసీ ఉద్యోగులు ఉన్నట్టుండి బస్ భవన్ వద్ద ధర్నాకు తరలివె ళ్లడంతో ఎక్కడికక్కడ బస్సులు నిలిచిపోయాయి. ప్రయాణికులు ఇక్కట్ల పాలయ్యారు. ముఖ్యంగా పదో తరగతి విద్యార్థులు సకాలంలో పరీక్ష కేంద్రాలకు వెళ్లడానికి అష్టకష్టాలు పడ్డారు.
సిటీబ్యూరో: ఆర్టీసీ కార్మికుల ధర్నా గురువారం లక్షలాది మంది ప్రయాణికుల పాలిట శాపంగా మారింది. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా నగరంలోని వివిధ డిపోలకు చెందిన కండక్టర్‌లు, డ్రైవర్‌లు భారీ సంఖ్యలో బస్‌భవన్ వద్ద ధర్నాకు తరలి వెళ్లడంతో గ్రేటర్‌లోని అన్ని డిపోలలో ఎక్కడి బస్సులు అక్కడే నిలిచిపోయాయి. దీంతో ఉదయాన్నే పరీక్షలకు బయలుదేరిన పదోతరగతి విద్యార్ధులు, ఉద్యోగులు, అన్ని వర్గాల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. గంటల తరబడి బస్టాపుల్లోనే పడిగాపులు పడ్డారు. తిరిగిన కొద్దిపాటి బస్సులు ప్రయాణికులతో కిక్కిరిపోయాయి. ఉ. 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు 70 శాతానికి పైగా బస్సులు నిలిచిపోయినట్లు ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ జయరావు తెలిపారు. కండక్టర్‌లు, డ్రైవర్లు ఇలా పెద్ద సంఖ్యలో ధర్నాకు తరలి వెళ్తారని తాము అంచనా వేయలేకపోయినట్లు పేర్కొన్నారు. కాగా నగరంలోని 28 డిపోల పరిధిలో 3850 బస్సులు ఉన్నాయి. మొదటి షిఫ్టులో (మధ్యాహ్నం 2 గంటల వరకు) బయలుదేరవలసిన 1264 బస్సులలో కేవలం 456 బస్సులు మాత్రమే రోడ్డెక్కాయి.
టెన్త్ విద్యార్థుల్లో టెన్షన్
కేవలం బస్‌పాస్‌పైనే ఆధారపడి పరీక్షలకు హాజరయ్యేందుకు ఇంటి నుంచి బయలుదేరిన పదోతరగతి విద్యార్థులు గంటలు గడిచినా బస్సులు రాకపోవడంతో తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఒకవైపు పరీక్షా సమయం దగ్గరపడడం, వందల రూపాయలు చెల్లించి ఆటోల్లో వెళ్లేందుకు జేబులో తగినన్ని డబ్బులు లేకపోవడంతో కన్నీటిపర్యంతమయ్యారు. ఎనిమిదిన్నర దాటినా బస్సులు రాకపోవడంతో వారికి దిక్కుతోచని పరిస్థితి ఎదురైంది. చివరి క్షణాల్లో వచ్చిన ఒకటి రెండు బస్సుల్లో కిక్కిరిసి బయలుదేరారు. మరోవైపు కొంతమంది చివరి క్షణాల్లో తల్లిదండ్రు సహాయంతో పరీక్షా కేంద్రాలకు చేరుకోలేకపోయారు. ఏమైనప్పటికీ ఆర్టీసీ నిర్లక్ష్యం వల్ల పదోతరగతి విద్యార్ధులు గురువారం ప్రశాంతంగా పరీక్షలు రాయలేకపోయారు. కార్మికుల ధర్నా నేపథ్యంలో సికింద్రాబాద్, దిల్‌సుఖ్‌నగర్, అమీర్‌పేట్, పంజగుట్ట, కూకట్‌పల్లి, తదితర ప్రాంతాల్లో బస్టాపుల్లో ప్రయాణికుల రద్దీ నెలకొంది, ఇక బస్సుల కొరతను ఆటో, క్యాబ్ డ్రైవర్లు క్యాష్ చేసుకున్నారు. ప్రయాణికుల నుంచి రెట్టింపు చార్జీలు వసూలు చేశారు.