
ముంబై: టాటా కన్జ్యూమర్, స్టార్‌బక్స్ జాయింట్ వెంచర్ కంపెనీ టాటా స్టార్‌బక్స్ (కాఫీ ఔట్‌లెట్స్) భారీ విస్తరణ ప్రణాళికలను ప్రకటించింది. ప్రతి మూడు రోజులకు ఒక కొత్త స్టోర్‌ను ప్రారంభించనున్నట్టు తెలిపింది. 2028 నాటికి దేశవ్యాప్తంగా తమ నిర్వహణలోని స్టోర్లను 1,000కి పెంచుకోవాలనే లక్ష్యంతో ఉన్నట్టు ప్రకటించింది. స్థానిక భాగస్వాములకు నైపుణ్య శిక్షణతో ఉపాధి కల్పించడం, కొత్త స్టోర్ల ప్రారంభంతో కస్టమర్లకు మెరుగైన అనుభవాన్ని అందించడం, ప్రపంచవ్యాప్తంగా స్టార్‌బక్స్ కస్టమర్లు భారత కాఫీ రుచులను ఆస్వాదించేలా ప్రోత్సహించడం తమ విధానంలో భాగంగా ఉంటాయని వెల్లడించింది.
ఇరు సంస్థలు 2012లో చెరో సగం వాటాతో కూడిన జాయింట్ వెంచర్‌ను ఏర్పాటు చేయడం గమనార్హం. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 54 పట్టణాల్లో 390 స్టోర్లను నిర్వహిస్తూ, 4,300 మందికి ఉపాధి కల్పిస్తోంది. 2028 నాటికి వెయ్యి స్టోర్ల లక్ష్యాన్ని సాధించేందుకు వీలుగా ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లోకి విస్తరిస్తామని, ఎయిర్‌పోర్టుల్లోనూ స్టోర్లను ప్రారంభిస్తామని, ఉద్యోగుల సంఖ్యను 8,600కు పెంచుకుంటామని ప్రకటించింది.
మహిళలకు శిక్షణ
ఫుడ్ అండ్ బేవరేజెస్ (ఎఫ్‌అండ్‌బీ) పరిశ్రమలో కెరీర్ కోరుకునే మహిళలకు వృత్తిపరమైన శిక్షణ అందిస్తున్నట్టు టాటా స్టార్‌బక్స్ ప్రకటించింది. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, ముంబైలో స్టోర్లలో పనిచేస్తూనే నేర్చుకునే అవకాశం కల్పిస్తున్నట్టు తెలిపింది. ఉద్యోగులకు వారంలో ఐదు రోజుల పని విధానాన్ని అమలు చేస్తున్న తొలి ఎఫ్‌అండ్‌బీ కంపెనీ తమదేనని పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment