Starbucks Coffee Company
-
మూడు రోజులకు ఒక టాటా స్టార్‌బక్స్
ముంబై: టాటా కన్జ్యూమర్, స్టార్‌బక్స్ జాయింట్ వెంచర్ కంపెనీ టాటా స్టార్‌బక్స్ (కాఫీ ఔట్లెట్స్) భారీ విస్తరణ ప్రణాళికలను ప్రకటించింది. ప్రతి మూడు రోజులకు ఒక కొత్త స్టోర్‌ను ప్రారంభించనున్నట్టు తెలిపింది. 2028 నాటికి దేశవ్యాప్తంగా తమ నిర్వహణలోని స్టోర్లను 1,000కి పెంచుకోవాలనే లక్ష్యంతో ఉన్నట్టు ప్రకటించింది. స్థానిక భాగస్వాములకు నైపుణ్య శిక్షణతో ఉపాధి కల్పించడం, కొత్త స్టోర్ల ప్రారంభంతో కస్టమర్లకు మెరుగైన అనుభవాన్ని అందించడం, ప్రపంచవ్యాప్తంగా స్టార్‌బక్స్ కస్టమర్లు భారత కాఫీ రుచులను ఆస్వాదించేలా ప్రోత్సహించడం తమ విధానంలో భాగంగా ఉంటాయని వెల్లడించింది. ఇరు సంస్థలు 2012లో చెరో సగం వాటాతో కూడిన జాయింట్ వెంచర్‌ను ఏర్పాటు చేయడం గమనార్హం. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 54 పట్టణాల్లో 390 స్టోర్లను నిర్వహిస్తూ, 4,300 మందికి ఉపాధి కల్పిస్తోంది. 2028 నాటికి వెయ్యి స్టోర్ల లక్ష్యాన్ని సాధించేందుకు వీలుగా ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లోకి విస్తరిస్తామని, ఎయిర్పోర్టుల్లోనూ స్టోర్లను ప్రారంభిస్తామని, ఉద్యోగుల సంఖ్యను 8,600కు పెంచుకుంటామని ప్రకటించింది. మహిళలకు శిక్షణ ఫుడ్ అండ్ బేవరేజెస్ (ఎఫ్అండ్బీ) పరిశ్రమలో కెరీర్ కోరుకునే మహిళలకు వృత్తిపరమైన శిక్షణ అందిస్తున్నట్టు టాటా స్టార్‌బక్స్ ప్రకటించింది. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, ముంబైలో స్టోర్లలో పనిచేస్తూనే నేర్చుకునే అవకాశం కల్పిస్తున్నట్టు తెలిపింది. ఉద్యోగులకు వారంలో ఐదు రోజుల పని విధానాన్ని అమలు చేస్తున్న తొలి ఎఫ్అండ్బీ కంపెనీ తమదేనని పేర్కొంది. -
World Coffee Portal: కాఫీకి చైనా జై
తేనీరు... ప్రపంచంలో ఈ పానీయం గురించి తెలియనివారు ఉండరు. తేనీరు డ్రాగన్ దేశం చైనాలో పుట్టిందన్న వాదన కూడా ఉంది. ఈ ఉష్ణోదకం సేవించడంలో చైనీయులు ముందంజలో ఉంటారు. కానీ, ఇప్పుడా పరిస్థితి మారిపోయింది. చైనా ప్రజలు ఇప్పుడు కాఫీపై మక్కువ పెంచుకుంటున్నారు. సాక్షాత్తూ ‘వరల్డ్ కాఫీ పోర్టల్’ నిర్వహించిన తాజా సర్వేలో ఈ విషయం బహిర్గతమైంది. బ్రాండెడ్ కాఫీ షాప్ మార్కెట్ విషయంలో అమెరికాను చైనా మించిపోయిందని ‘వరల్డ్ కాఫీ పోర్టల్’ వెల్లడించింది. అమెరికాలో కంటే చైనాలోనే అత్యధిక కాఫీ ఔట్లెట్లు ఉన్నాయని తెలియజేసింది. ప్రపంచంలో రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలుస్తున్న చైనాలో కాఫీ ప్రేమికుల పెరిగిపోతోందని, కేవలం గత 12 నెలల వ్యవధిలోనే కాఫీ ఔట్లెట్ల సంఖ్య 58 శాతం పెరిగిందని పేర్కొంది. ప్రసుతం చైనాలో 49,691 బ్రాండెడ్ కాఫీ దుకాణాలు ఉన్నాయని వివరించింది. ► ప్రఖ్యాత స్టార్‌బక్స్ సంస్థ గత ఏడాది వ్యవధిలో చైనాలో కొత్తగా 785 కాఫీ దుకాణాలు తెరిచింది. చైనాలో రూ.1,660 కోట్లకుపైగా పెట్టుబడులు పెట్టింది. అమెరికా బయట స్టార్‌బక్స్ ఈ స్థాయిలో పెట్టుబడులు పెట్టడం ఇదే మొదటిసారి. ప్రపంచవ్యాప్తంగా తమకు రెండో అతిపెద్ద మార్కెట్ చైనాయేనని స్టార్‌బక్స్ స్పష్టం చేసింది. ► చైనాలో కాఫీలను విక్రయించడంలో స్టార్టప్ కంపెనీ ‘లకిన్ కాఫీ’దే పైచేయి. ఈ సంస్థకు దేశంలో 13,000కుపైగా ఔట్లెట్లు ఉన్నాయి. ► సర్వేలో భాగంగా 4,000 మంది కాఫీ ప్రియులను ప్రశ్నించారు. వీరిలో 90 శాతం మంది వారానికోసారి హాట్ కాఫీ తాగుతామని చెప్పారు. వారానికి ఒక్కసారైనా ఐస్డ్ కాఫీ తీసుకుంటామని 64 శాతం మంది తెలిపారు. ► ప్రతివారం కాఫీ షాప్‌నకు వెళ్తాం లేదా ఆర్డర్ చేసి తెప్పించుకుంటామని 90 శాతం మంది వెల్లడించారు. ► చైనాలో ఇటీవలికాలంలో ఆర్థిక ప్రగతి కొంత నెమ్మదించింది. అయినప్పటికీ ప్రపంచ కాఫీ పరిశ్రమగా చైనా ఎదుగుతుండడం విశేషం. ► చైనాలో తమ కంపెనీ ప్రస్థానం ఇంకా ప్రాథమిక దశలోనే ఉందని స్టార్‌బక్స్ సీఈఓ లక్ష్మణ్ నరసింహన్ చెప్పారు. 2025 నాటికి చైనాలో 9,000 కాఫీ దుకాణాలు ప్రారంభించాలని స్టార్‌బక్స్ లక్ష్యంగా పెట్టుకుంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
టాటాలనే ఢీకొట్టేలా.. ఈషా అంబానీ మరో వ్యాపార ఎత్తుగడ!
ప్రముఖ డ్రైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ అనుబంధ సంస్థ రిలయన్స్ రీటైల్ డైరెక్టర్ ఈషా అంబానీ భారత్‌లో అత్యంత విలువైన బ్రాండ్‌గా తన స్థానాన్ని పదిలం చేసుకున్న టాటా గ్రూప్‌ను ఢీకొట్టనున్నారా? టాటా గ్రూప్ అనుబంధ సంస్థ స్టార్‌బక్స్‌కు పోటీగా తన వ్యాపార తంత్రాన్ని ప్రదర్శించనున్నారా? అంటే అవుననే అంటున్నాయి పరిశ్రమ వర్గాలు గత పదేళ్లుగా భారత్ కాఫీ వ్యాపార విభాగంలో టాటా గ్రూప్ జాయింట్ వెంచర్ స్టార్‌బక్స్ ఇండియా తిరుగులేని ఆధిపత్యాన్ని కొనసాగిస్తుంది. 2012లో టాటా గ్రూప్ స్టార్‌బక్స్‌ను మార్కెట్‌కు పరిచయం చేసింది. కేవలం పదేళ్లలో ఆ సంస్థ కాఫీ ప్రియుల ఆదరాభిమానాలు చూరగొన్నది. వెరసీ జాయింట్ వెంచర్‌ను ప్రారంభించిన 10ఏళ్ల తర్వాత వార్షికంగా రూ.1000 కోట్లకు అమ్మకాల్ని నమోదు చేసింది. ఇదే స్టార్‌బక్స్‌తో నేరుగా తలపడేందుకు రిలయన్స్ రీటైల్ గత కొన్నేళ్లుగా గట్టి ప్రయత్నాలే చేసింది. చివరికి రిలయన్స్ రీటైల్ డైరెక్టర్ ఈషా అంబానీ తన వ్యాపార వ్యూహాలతో యూకేలో కాఫీ, శాండ్ విచ్ విభాగంలో ఐకానిక్ బ్రాండ్ ‘ప్రెట్ ఎ మ్యాంగర్’తో చేతులు కలిపారు. ఇటీవల, ఒప్పందంలో భాగంగా రిలయన్స్ రీటైల్ జాయింట్ వెంచర్ ప్రెట్ ఎ మ్యాంగర్ కార్యకలాపాల్ని భారత్‌లో ప్రారంభించింది. దిగ్గజ బ్రిటిష్ బ్రాండ్‌ను ముంబైలోని బాంద్రా - కుర్లా క్లాంప్లెక్స్ (BKC)లో ఏర్పాటు చేసింది. రానున్న రోజుల్లో ఢిల్లీ, బెంగళూరుతో పాటు మొత్తం 12 నగరాల్లో వినియోగదారులకు అందుబాటులోకి రానున్నాయి. ఇషా అంబానీ నేతృత్వంలోని అనుబంధ సంస్థలు ఫుడ్ అండ్ బేవరేజెస్ విభాగంలో దూసుకెళ్లేందుకు సిద్ధంగా ఉన్నాయని నిరూపించేలా..మార్కెట్లోని టీ, కాఫీలకు యువతలో పెరిగిపోతున్న అభిరుచికి అనుగుణంగా ప్రెట్ ఎ మ్యాంగర్ తన కాఫీ ఘుమఘుమలు అందరికీ అందుబాటులోకి తెచ్చేలా ప్రణాళికల్ని సిద్ధం చేసుకున్నారు. ఇప్పటికే తమ భాగస్వామ్యంతో భారత్‌లో వ్యాపారాల్ని ప్రారంభించాలని ఆహ్వానిస్తూ రిలయన్స్ ఇటీవల పలు అంతర్జాతీయ బ్రాండ్లతో ఒప్పందాలు కుదుర్చుకుంటున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. కాగా, ప్రెట్ ఎ మ్యాంగర్ ప్రపంచవ్యాప్తంగా 550 స్టోర్లను నిర్వహిస్తోంది. ఈ బ్రాండ్ ఆర్గానిక్ కాఫీ, కుకీలు, సలాడ్, శాండ్విచ్ల అమ్మకాలు ప్రసిద్ధి చెందింది. టాటా స్టార్‌బక్స్ భారత్‌లోని 43 నగరాల్లో 341 స్టోర్లను నడుపుతుంది.అయితే, దేశీయ స్టార్టప్‌ల నుండి తీవ్రమైన సవాళ్లను ఎదుర్కొనేందుకు బిజినెస్ కార్యకలాపాల్ని మరింత మెరుగుపరుచుకోనుంది. చిన్న పట్టణాలలో సైతం విస్తరించేలా స్టార్‌బక్స్ చిన్న, చౌకైన పానీయాలతో పిల్లలతో సహా భారతీయులను ఆకర్షించడానికి తన వ్యూహాన్ని పునరుద్ధరిస్తున్నట్లు నివేదికలు హైలెట్ చేస్తున్నాయి. చదవండి👉 ముగ్గురు పిల్లలకు..చాలా తెలివిగా ముఖేష్ అంబానీ వీలునామా -
ఫెడ్ పుష్- యూఎస్ మార్కెట్లు ప్లస్
అత్యధిక శాతం మంది విశ్లేషకులు అంచనా వేసిన విధంగానే అమెరికా కేంద్ర బ్యాంకు ఫెడరల్ రిజర్వ్ యథాతథ పాలసీ అమలుకే కట్టుబడింది. దీంతో ఫెడ్ ఫండ్స్ రేట్లు 0-0.25 శాతం స్థాయిలో కొనసాగనున్నాయి. రెండు రోజులపాటు నిర్వహించిన ఫెడ్ పరపతి సమావేశాలు బుధవారం ముగిశాయి. లాక్‌డవున్‌ల తదుపరి ఆర్థిక రికవరీ కనిపిస్తున్నప్పటికీ కోవిడ్-19కు ముందు పరిస్థితులతో పోలిస్తే బాగా వెనకబడి ఉన్నట్లు ఫెడ్ పేర్కొంది. ఇటీవల తిరిగి కరోనా వైరస్ విస్తరిస్తుండటంతో నిరుద్యోగిత పెరగడం వంటి పలు సవాళ్లు ఎదురవుతున్నట్లు తెలియజేసింది. అయితే ఆర్థిక వ్యవస్థకు దన్నుగా అన్నిరకాలుగా చేయూతను అందించనున్నట్లు ఫెడ్ చైర్మన్ జెరోమీ పావెల్ తాజాగా తెలియజేశారు. దీంతో ఆరు ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరు రెండేళ్ల కనిష్టానికి చేరింది. 2018 జూన్ తదుపరి 93.17ను తాకింది. లాభాల్లో ఫెడ్ పాలసీ నిర్ణయాల నేపథ్యంలో బుధవారం యూఎస్ మార్కెట్లు లాభపడ్డాయి. డోజోన్స్ 160 పాయింట్లు(0.6 శాతం) బలపడి 26,540కు చేరగా.. ఎస్అండ్పీ 40 పాయింట్ల(1.25 శాతం) పుంజుకుని 3,258 వద్ద ముగిసింది. ఇక నాస్డాక్ మరింత అధికంగా 141 పాయింట్లు(1.4 శాతం) జంప్‌చేసి 10,543 వద్ద నిలిచింది. ప్రధానంగా నేడు క్యూ2(ఏప్రిల్-జూన్) ఫలితాలు ప్రకటించనున్న యాపిల్, అల్ఫాబెట్, ఫేస్బుక్, అమెజాన్ 2-1 శాతం మధ్య ఎగశాయి. ఈ బాటలో టెస్లా సైతం 1.5 శాతం లాభపడింది. స్టార్‌బక్స్ ప్లస్ 2020 పూర్తి ఏడాదికి ఆశావహ అంచనాలు ప్రకటించడంతో తాజాగా అడ్వాన్స్డ్ మైక్రో డివైసెస్(ఏఎండీ) కౌంటర్‌కు డిమాండ్ ఏర్పడింది. వెరసి చిప్ తయారీ దిగ్గజం ఏఎండీ షేరు 12.5 శాతం దూసుకెళ్లింది. కొద్ది రోజులుగా బిజినెస్ పుంజుకుంటున్నట్లు ప్రకటించడంతో కాఫీ చైన్ దిగ్గజం స్టార్‌బక్స్ కార్ప్ షేరు దాదాపు 4 శాతం జంప్‌చేసింది. అయితే రెండు ఇంజిన్ల జెట్ విమానాల ఉత్పత్తిని తగ్గించినట్లు వెల్లడించడంతో బ్లూచిప్ కంపెనీ బోయింగ్ ఇంక్ షేరు 3 శాతం క్షీణించింది. ఆసియా అటూఇటూ ప్రస్తుతం ఆసియా మార్కెట్లలో సింగపూర్ 1.8 శాతం నష్టపోగా.. తైవాన్, హాంకాంగ్ 1.2 శాతం స్థాయిలో పుంజుకున్నాయి. ఇతర మార్కెట్లలో కొరియా, ఇండొనేసియా 0.2 శాతం చొప్పున బలపడగా.. థాయ్‌లాండ్ 0.4 శాతం నీరసించింది. జపాన్ స్వల్ప నష్టంతోనూ చైనా నామమాత్ర లాభంతోనూ కదులుతున్నాయి. -
ఎఫ్బీ పోస్ట్; టిప్‌గా 32 వేల డాలర్లు!
కాలిఫోర్నియా : కరోనా వైరస్ వ్యాప్తితో మాస్కు ధరించడం అనివార్యంగా మారింది. బయటకు వెళ్లాలంటే తప్పని సరిగా మాస్క్ ఉండాల్సిందే. కొన్ని చోట్ల మాస్కు ధరించకుండా బహిరంగా ప్రదేశాలకు వచ్చే వారిపై జరిమాన సైతం విధిస్తున్నారు. ఈక్రమంలో ఓ రెస్టారెంట్‌కు మాస్కు ధరించకుండా వెళ్లిన మహిళకు వెయిటర్ సర్వ్ చేయని ఘటన కాలిఫోర్నియాలోని శాన్ డియాగోలో చోటుచేసుకుంది. అంతేగాక అతను చేసిన పని తనకు 32,000 డాలర్లను టిప్‌గా తెచ్చిపెట్టింది. వివరాలు.. అండర్ లిన్ గిల్లెస్ అనే మహిళ ఇటీవల స్టార్‌బక్స్ రెస్టారెంట్‌కు వెళ్లింది. అక్కడ ఫుడ్ ఆర్డర్ చేయగా, సదరు మహిళ ముఖానికి మాస్క్ ధరించనందున రెస్టారెంట్లో వెయిటర్‌గా పనిచేస్తున్న లెనిన్ గుటిరెజ్ అనే వ్యక్తి ఆమెకు సర్వ్ చేసేందుకు నిరాకరించాడు. ఆమె ఎంత చెప్పినా వినకుండా మాస్క్ ఉంటేనే సర్వ్ చేయాలని, లేకుంటే చేయొద్దని తమకు ఆదేశాలు ఉన్నాయని వెయిటర్ మొండి స్పష్టం చేశాడు. (భారత ఐటీపై హెచ్1బీ వీసాల రద్దు ప్రభావం?) దీంతో వెయిటర్‌పై కోపంతో ‘మాస్క్ వేసుకోనందుకు కాఫీ తీసుకు రాలేదు’ అంటూ మహిళ ఫేస్బుక్లో పోస్ట్ పెట్టింది. ఈ పోస్టుపై లక్ష మందిపైగా కామెంట్ చేయగా, 50 వేల మంది షేర్ చేశారు. వీరిలో అనేకమంది నెటిజన్లు గిల్లెస్కు వ్యతిరేకంగా స్పందించారు. వెయిటర్ తన పని తాను నిర్వహించాడని లెనిన్‌ను ప్రశంసించారు. అంతేకాదు 32 వేల డాలర్లను అతడికి టిప్‌గా ఇచ్చారు. కాగా మే 1 నుంచి శాన్‌డియాగో ప్రజలు తప్పని సరి మాస్కులు ధరించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇంటి నుంచి బయటకు వచ్చినప్పుడు, పార్కులు, షాపింగ్, రెస్టారెంట్లకు వెళ్లినప్పుడు ఖచ్చితంగా మాస్కు ఉండాలని ఆదేశించింది. (చీటీల పేరుతో రూ. 2 కోట్ల టోకరా! ) ఇదిలా ఉండగా గిల్లెస్ పోస్టును చూసిన మాట్ కోవిన్ అనే ఓ వ్యక్తి లెనిన్‌కు ఎదైనా సాయం చేయేఆలని నిర్ణయించుకున్నాడు. దీంతో ఆ పోస్టును ట్యాగ్ చేస్తూ ‘లెనిన్ స్టాండింగ్ అప్ టు ఏ శాన్ డియాగో కరెన్’ పేరుతో డొనేషన్పేజిని ఏర్పాటు చేసి ఫండ్ రైజింగ్ చేసి ఆ మెత్తాన్ని టిప్ రూపంలో లెనిన్‌కు ఇవ్వాలని అనుకున్నాడు. జూన్ 22న మొదటు పెట్టిన ఈ ఫండింగ్ ద్వారా శుక్రవారం సాయంత్రం వరకు 32 వేల డాలర్లు వసూలు చేశాడు. ఈ మెత్తాన్ని కోవిన్ లెనిన్‌కు అందించాడు. దీనిపై లెనిన్ మాట్లాడుతూ.. ఫండ్ అందించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. తమకు అందిన టిప్‌తో ఏం చేయాలో ఓ ప్రణాళిక ఉన్నట్లు తెలిపారు. తనకు డ్యాన్స్ అంటే చాలా ఇష్టమని ఈ డబ్బుతో డ్యాన్స్ స్కూల్ పెట్టి ఇతరులకు డ్యాన్స్ నేర్పిస్తానని వెల్లడించారు. (‘అలా చేస్తే.. చైనా ఆక్రమణలు తొలగిస్తారా? ) -
హైదరాబాద్‌లో స్టార్‌బక్స్..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రీమియం కాఫీ ఆస్వాదించేందుకు భారతీయులు ఉత్సాహం కనబరుస్తున్నారని టాటా స్టార్‌బక్స్ అంటోంది. ఇక్కడి వారు చవక టీ తాగేవాళ్లు అన్న అభిప్రాయం చాలా కంపెనీలకు ఉంది. ఇదంతా తప్పని తమ అనుభవమే నిరూపిస్తోందని కంపెనీ సీఈవో అవని దావ్దా తెలిపారు. రెండేళ్లలోనే భారత్‌లో స్టార్‌బక్స్ 58 ఔట్లెట్లను ఏర్పాటు చే యడాన్నిబట్టి చూస్తే ప్రీమియం కాఫీకి ఉన్న డిమాండ్‌ను అర్థం చేసుకోవచ్చని చెప్పారు. విభిన్న కాఫీ రుచులతోపాటు అంతర్జాతీయ అనుభూతిని కస్టమర్లు కోరుకుంటున్నారని పేర్కొన్నారు. ఒక్కో స్టోర్ డిజైన్ దేనికదే ప్రత్యేకమని ఆమె వివరించారు. స్టార్‌బక్స్ స్టోర్‌ను మంగళవారమిక్కడి జూబ్లీహిల్స్‌లో ప్రారంభించిన సందర్భంగా మీడియాతో మాట్లాడారు. స్టార్‌బక్స్ కాఫీ కంపెనీ, టాటా గ్లోబల్ బెవరేజెస్ల సంయుక్త కంపెనీయే స్టార్‌బక్స్. ఈ స్టోర్లలో కాఫీతోపాటు ఇతర ఆహారోత్పత్తులు విక్రయిస్తారు. 12-15 శాతం వృద్ధి.. భారతీయ కాఫీ రంగంలో అపార అవకాశాలు ఉన్నాయని అవని చెప్పారు. వ్యవస్థీకృత రంగంలో పరిశ్రమ 12-15 శాతం వృద్ధి చెందుతోందని పేర్కొన్నారు. దేశంలో అన్ని ప్రధాన నగరాలకు విస్తరిస్తామని వెల్లడించారు. ‘50 నగరాలు మా రాడార్‌లో ఉన్నాయి. ఒక్కో నగరానికి ఎటువంటి రుచులను ఆఫర్ చేయాలి అన్న అంశంపై సమాలోచనలు చేస్తున్నాం’ అని అన్నారు. అగ్రస్థానానికి రావాలని అన్ని కంపెనీలకూ ఆశయం ఉంటుందని, ఇందులో స్టార్‌బక్స్ కూడా ఒకటని తెలిపారు. స్టోర్లలో కస్టమర్లకు ఉచిత వైఫై సౌకర్యమూ ఉంటుంది. హైదరాబాద్ ఫోరమ్ మాల్లోనూ స్టోర్ ఏర్పాటైంది. ముంబై, ఢిల్లీ, పునే, బెంగళూరు, చెన్నైలో స్టోర్లున్నాయి. ప్రపంచవ్యాప్తంగా 60 దేశాల్లో విస్తరించింది.