
20 నుంచి సాగుపై జెడ్పీ ప్రత్యేక సమావేశాలు
ఆదిలాబాద్ జిల్లా నుంచి ప్రారంభం
మార్చి ఆఖరు కల్లా వెయ్యి ఎకరాల్లో పాలీహౌజ్‌ల నిర్మాణం
వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి వెల్లడి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో తమ శాఖ చేపడుతున్న కార్యక్రమాలపై చర్చించేందుకు ఈ నెల 20వ తేదీ నుంచి ప్రత్యేకంగా జెడ్పీ సమావేశాలు నిర్వహించనున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి వెల్లడించారు. ఇందులో భాగంగా మొదటి సమావేశం ఆదిలాబాద్ జిల్లాలో జరుగుతుందని తెలిపారు. మంగళవారం ఆయన ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో ‘ఆహార భద్రతకు పాలీహౌజ్‌ల సాంకేతిక పరిజ్ఞానం’ అనే అంశంపై జరిగిన ఒకరోజు సదస్సులో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో కూరగాయల సాగును పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నామని, దీనికోసం పాలీహౌజ్ టెక్నాలజీని అందుబాటులోకి తేనున్నట్లు పేర్కొన్నారు.
వచ్చే ఏడాది మార్చి ఆఖరు నాటికి రూ.250 కోట్లు వెచ్చించి వెయ్యి ఎకరాల్లో పాలీ హౌజ్‌ల నిర్మాణం చేపట్టనున్నామని వివరించారు. హైదరాబాద్ నగరానికి 100 కిలోమీటర్ల లోపు ఉన్న రంగారెడ్డి, మహబూబ్ నగర్, నల్లగొండ, మెదక్ జిల్లాల్లో వీటి నిర్మాణాన్ని చేపడతామని తెలిపారు. ఒక్కో రైతుకు 75శాతం సబ్సిడీతో మూడెకరాల్లో అనుమతి ఇస్తామన్నారు. అలాగే, వచ్చే నాలుగు నెలల్లో రూ.455 కోట్ల ఖర్చుతో 1.32 లక్షల ఎకరాల్లో సూక్ష్మ సేద్యాన్ని చేపట్టనున్నట్లు తెలిపారు.
వ్యవసాయ యాంత్రీకరణకు ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.200 కోట్లు ఖర్చు చేయనున్నామన్నారు. హైదరాబాద్‌లోని గుడిమల్కాపూర్, బోయిన్‌పల్లి మార్కెట్ యార్డుల్లో శీతల గిడ్డంగుల నిర్మాణానికి ప్రణాళికలు రూపొందిస్తున్నామని వివరించారు. ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయ ప్రత్యేక అధికారి డాక్టర్ వి.ప్రవీణ్‌రావు, విస్తరణ సంచాలకుడు డాక్టర్ జి. భూపాల్‌రాజ్, నవరత్న క్రాప్ సైన్స్ ఎం.డి. సరితారెడ్డి, అపెడా జనరల్ మేనేజర్ టి.సుధాకర్, రైతులు, ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు పాల్గొన్నారు.