
త్వరలో కేబినెట్ ఆమోదానికి మైనింగ్ పాలసీ
తుదిరూపునివ్వాలని గనుల శాఖ అధికారులకు మంత్రి హరీశ్‌రావు ఆదేశం
సాక్షి, హైదరాబాద్: మైనింగ్ పాలసీ ముసాయిదాకు వీలయినంత త్వరగా తుది రూపునిచ్చి కేబినెట్ ఆమోదానికి పంపాలని నీటి పారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు ఆదేశించారు. గనులు, భూగర్భ వనరుల శాఖకు సంబంధించి వివిధ అంశాలపై సోమవారం సచివాలయంలో ఆయన సమీక్షించారు. ముసాయిదాలోని అంశాలపై లోతుగా చర్చించడంతో పాటు అవసరమైన మార్పులు చేర్పులు చేయాలని సూచించారు. 2016-17లో సీనరేజీ చార్జీల వసూలు లక్ష్యాన్ని సాధించేందుకు అనుసరించాల్సిన విధానాలను సమీక్షించారు.
బయ్యారంలో ఉక్కు కర్మాగారం ఏర్పాటుకు సంబంధించి జాతీయ ఖనిజాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో జరుగుతున్న సర్వే తదితరాలపై అధికారులను వివరాలు కోరారు. ఖనిజ లభ్యతపై జరుపుతున్న సర్వేలో భాగంగా సింగరేణితో పాటు, ఇతర సంస్థల ఆధ్వర్యంలో జరుగుతున్న డ్రిల్లింగ్ పనుల పురోగతిని తెలుసుకున్నారు. మైనింగ్ శాఖలో కొత్తగా 425 కొత్త పోస్టులు భర్తీ చేయాలని, పెండింగ్‌లో ఉన్న కోర్టు కేసుల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. మైనింగ్ విభాగంలో కంప్యూటరీకరణను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని చెప్పారు. బార్‌కోడ్ విధానం అమలుకు సంబంధించి ఏర్పాట్లు వేగవంతం చేయాలన్నారు. కరీంనగర్ జిల్లాలో ఇసుక కొరత తీర్చేందుకు జిల్లా కలెక్టర్‌కు రెండు రోజుల్లో తగు ఆదేశాలివ్వాలని పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శికి సూచించారు. సమావేశంలో పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్, టీఎస్‌ఎండీసీ ఎండీ ఇలంబర్తి, గనుల శాఖ డెరైక్టర్ సుశీల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.