
విద్యాసాగర్ ఎన్నికపై వేసిన పిటిషన్ కొట్టివేత
సాక్షి, హైదరాబాద్: టీఆర్‌ఎస్ తరఫున కోరుట్ల అసెంబ్లీ స్థానం నుంచి గెలిచిన కె.విద్యాసాగర్ ఎన్నికను సవాలు చేస్తూ దాఖలైన ఎన్నికల పిటిషన్(ఈపీ)ను రాష్ట్ర హైకోర్టు మంగళవారం కొట్టివేసింది. 2014 ఎన్నికల్లో శివసేన అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన నరేష్‌కుమార్ హైకోర్టులో ఈ పిటిషన్ దాఖలు చేశారు.
తనకు కేటాయించిన విల్లు,బాణం గుర్తు ఓటర్లను ఆయోమయానికి గురి చేసిందని, దీని వల్ల తనకు వేయాల్సిన ఓట్లను ప్రజలు విద్యాసాగర్‌కు వేశారని ఆయన ఆరోపించారు. వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ రామచంద్రరావు ఎన్నిక పిటిషన్‌లో నరేష్‌కుమార్ చేసిన ఆరోపణలకు తగిన ఆధారాలు చూపలేదంటూ పిటిషన్‌ను కొట్టేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.