ఈ దశలో జోక్యం చేసుకోలేం | Cash for vote scam: Supreme Court refuses to cancel TDP MLA Revanth Reddy's bail | Sakshi
Sakshi News home page

ఈ దశలో జోక్యం చేసుకోలేం

Published Sat, Jul 4 2015 1:03 AM | Last Updated on Sun, Sep 2 2018 5:24 PM

ఈ దశలో జోక్యం చేసుకోలేం - Sakshi

ఈ దశలో జోక్యం చేసుకోలేం

* రేవంత్‌కు బెయిల్‌పై ఏసీబీ పిటిషన్‌ను తోసిపుచ్చిన సుప్రీంకోర్టు
* నెల రోజులు రిమాండ్‌లో ఉన్నా మళ్లీ ఎందుకని వ్యాఖ్య

సాక్షి, న్యూఢిల్లీ: ఓటుకు కోట్లు కేసులో మొదటి నిందితుడిగా ఉన్న టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డికి, ఇతర నిందితులకు హైకోర్టు ఇచ్చిన బెయిల్‌ను రద్దు చేయాలని కోరుతూ తెలంగాణ అవినీతి నిరోధక విభాగం(ఏసీబీ) దాఖలు చేసిన రెండు పిటిషన్లను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది.

ఈ సమయంలో తాము జోక్యం చేసుకోలేమని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హెచ్‌ఎల్ దత్తు నేతృత్వంలోని ధర్మాసనం తెలిపింది. బెయిల్ రద్దు చేయాలని కోరుతూ ఏసీబీ దాఖలు చేసిన పిటిషన్‌ను ప్రస్తావించేందుకు శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు ధర్మాసనం వద్ద అవకాశం వచ్చింది. ఏసీబీ తరపు సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ కేసు పూర్వాపరాలను వివరిస్తూ బెయిల్ రద్దు చేయాలని కోరారు. ‘‘జూన్ ఒకటో తేదీన తెలంగాణ శాసన మండలి ఎన్నికల ప్రక్రియకు రెండ్రోజుల ముందు టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి టీడీపీ అభ్యర్థికి ఓటు వేయాలంటూ నామినేటెడ్ ఎమ్మెల్యేకు రూ.50 లక్షల నగదు లంచంగా ఇస్తూ ఏసీబీకి పట్టుబడ్డారు.

ఈ కేసు దర్యాప్తు ఇంకా పూర్తికాలేదు. అయితే ఈలోపే ఉమ్మడి హైకోర్టు నిందితులకు బెయిల్ ఇచ్చింది. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడిన ఈ కేసులో, ప్రాథమిక ఆధారాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. బెయిల్ ఇవ్వడంతో పలుకుబడి కలిగిన నిందితుడు సాక్ష్యాధారాలను తారుమారు చేసే అవకాశం ఉంది. హైకోర్టు విధించిన షరతులు ఉల్లంఘించి నిందితుడు ఇప్పటికే రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారు. వాటిపై వివిధ పోలీస్ స్టేషన్లలో ఎఫ్‌ఐఆర్ కూడా నమోదైంది. అందువల్ల హైకోర్టు ఇచ్చిన బెయిల్ ఉత్తర్వులను రద్దు చేయాలి’’ అని విన్నవించారు.

ఈ సందర్భంలో జస్టిస్ అరుణ్ మిశ్రా కల్పించుకుంటూ.. ‘‘ఇప్పటికే నెల రోజుల పాటు జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. ఇందులో 4 రోజులు ఏసీబీ కస్టడీలో ఉన్నారు’’ అని వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హెచ్‌ఎల్ దత్తు కల్పించుకుని ‘‘నిన్న అరెస్టయి ఈరోజు బెయిల్ వస్తే మీరు సవాలు చేయవచ్చు. కానీ నెల రోజుల కింద మీరు అరెస్ట్ చేశారు. ఏ న్యాయమూర్తి అయినా తన విచక్షణకు అనుగుణంగా బెయిల్ విషయంలో ఉత్తర్వులు జారీ చేస్తారు.

1985 నుంచి సుప్రీంకోర్టు నిందితులకు బెయిల్ మంజూరు చేసే విషయంలో ఉదారంగానే ఉంటోంది. ఇప్పటికే మీరు సీఆర్‌పీసీ 164 సెక్షన్ కింద నిందితుడి వాంగ్మూలం కూడా తీసుకున్నారు. దర్యాప్తు కూడా చేశారు. ఈ సమయంలో మేం జోక్యం చేసుకోలేం’ అని వ్యాఖ్యానించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement