ఆనందం..ఆందోళన
వేతనాల పెంపుతో ఆనందం జీహెచ్‌ఎంసీ కార్మికుల సంబరాలు
వామపక్షాల బంద్ ప్రశాంతం నగరంలో ఆందోళనలు వివిధ పార్టీల నేతలు అరెస్ట్
వేతనాల పెంపుతో జీహెచ్‌ఎంసీ కార్మికుల్లో నూతనోత్సాహం. ఎక్కడికక్కడ సంబరాలు. బాణసంచా కాలుస్తూ... మిఠాయిలు పంచి పెట్టుకుంటూ...రంగులు చల్లుకుంటూ... ఉల్లాసంగా కనిపించారు. సీఎం కేసీఆర్ కటౌట్లకు క్షీరాభిషేకాలు చేశారు. కార్మిక సంఘాల నేతలు కమిషనర్ సోమేశ్ కుమార్‌ను కలసి.. కృతజ్ఞతలు తెలిపారు. శుక్రవారం నుంచి సమ్మె విరమిస్తున్నట్టు ప్రకటించారు.
మరోవైపు కార్మికుల సమ్మెకు మద్దతుగా వామపక్షాలు తలపెట్టిన బంద్‌లో అన్ని పార్టీల నాయకులు పాల్గొన్నారు. వివిధ ప్రాంతాల్లో నిరసన ప్రదర్శనలు, మోటార్ సైకిల్ ర్యాలీలు నిర్వహించారు. వాహనాల రాకపోకలకు అంతరాయం కల్పించారు. ఆందోళనకారులను ఎక్కడికక్కడ పోలీసులు అరెస్ట్ చేసి... సమీపంలోని పోలీస్ స్టేషన్లకు తరలించారు.
సిటీబ్యూరో: జీహెచ్‌ఎంసీలో కార్మికుల సమ్మె ముగిసింది. వేతనాల పెంపుతో... 11 రోజుల అనంతరం సమ్మెను విరమిస్తున్నట్టు కార్మిక సంఘాల జేఏసీ ప్రకటించింది. ముఖ్యమంత్రి హామీ... కమిషనర్ ఆదేశాలతో 15వ తేదీనే మెజార్టీ కార్మికులు విధులకు హాజరు కాగా, కొన్ని కార్మిక సంఘాలు సమ్మె కొనసాగించాయి. సమ్మె కారణంగా పేరుకుపోయిన చెత్త తొలగింపు పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. గురువారం నాటికే చాలా ప్రాంతాల్లో తరలించారు. మిగిలిపోయిన చెత్తపై శుక్రవారం దృష్టి సా రించారు. ఇక ‘స్వచ్ఛ’ వైపు అడుగులు పడబోతున్నాయి.
సంబరాలు...
కార్మికుల వేతనాలను పెంచుతూ గురువారం రాత్రి ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకోవడంతో శుక్రవారం జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో పండుగ వాతావరణం నెలకొంది. జీహెచ్‌ఎంఈయూ, జీహెచ్‌ఎంసీ తెలంగాణ ఎంప్లాయీస్ యూనియన్ తదితర సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున బాణ సంచా కాల్చారు. స్వీట్లు పంచారు. కార్మిక నాయకులు పరస్పరం రంగులు చల్లుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కటౌట్‌కు క్షీరాభిషేకం చేశారు. మున్నెన్నడూ లేనివిధంగా ఒకేసారి రూ.4 వేలు పెంచిన ముఖ్యమంత్రి జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. వేతనాల పెంపులో కీలక పాత్ర పోషించిన జీహెచ్‌ఎంసీ కమిషనర్, స్పెషలాఫీసర్ సోమేశ్ కుమార్‌నుకలసినకార్మిక సంఘాల నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. ఏడాదిలోనే రెండు పర్యాయాలు వేతనాలు పెంచిన కమిషనర్‌కు పుష్పగుచ్ఛాలు అందించి...కృతజ్ఞతలు తెలిపారు. మహిళా కార్మికులు స్వీట్లు ఇచ్చారు. కార్యక్రమాల్లో జీహెచ్‌ఎంఈయూ అధ్యక్షుడు యు.గోపాల్, జీహెచ్‌ఎంసీ తెలంగాణ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షుడు కె.అమరేశ్వర్, నాయకులు మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం పలువురు కార్మికులు క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఆయనకు స్వీట్లు తినిపించారు.
మరింత నిబద్ధతతో పని చేయాలి
కార్మికుల వేతనాలు పెరిగినందున మరింత అంకితభావంతో పని చేయాల్సిందిగా జీహెచ్‌ఎంసీ కమిషనర్, స్పెషలాఫీసర్ సోమేశ్‌కుమార్ పిలుపునిచ్చారు. హైదరాబాద్‌ను అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దే క్రతువులో కార్మికుల పాత్ర కీలకమని వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌ను ఆరోగ్య నగరంగా తీర్చిదిద్దే బాధ్యత వారి చేతుల్లోనే ఉందన్నారు. స్వచ్ఛ హైదరాబాద్‌లో కార్మికుల పనితీరు మెచ్చి... వేతనాలు పెంచుతానని ప్రకటించిన సీఎం మాట నిలబెట్టుకున్నారని ఆయన గుర్తు చేశారు. తిరిగి స్వచ్ఛ హైదరాబాద్ దిశగా పయనం సాగాలని... వేగం పెరగాలని పిలుపునిచ్చారు.
మెచ్చేలా పని చేస్తాం
తమ కష్టాలు తెలిసిన సీఎం కేసీఆర్ వేతనాలు పెంచారని, ఆయన మెచ్చేలా కార్మికులు పనిచేస్తారని జీహెచ్‌ఎంఈయూ అధ్యక్షుడు యు.గోపాల్ అన్నారు. కొందరు రాజకీయ ప్రయోజనాలతో ఆటంకాలు కల్పించాలని ప్రయత్నించినా... కార్మికులు చెక్కు చెదరలేదని తెలిపారు. కమిషనర్ సోమేశ్ కుమార్ పిలుపు మేరకు నగర ప్రజల ఆరోగ్యం కోసం విధుల్లో పాల్గొన్నారన్నారు. తెలంగాణ కార్మికుల రెక్కల కష్టాన్ని దోచుకుంటున్న ఆంధ్రా దళారుల ఆటలిక సాగవని హెచ్చరించారు.
సీఎంపై నమ్మకంతోనే సమ్మెలో పాల్గొనలేదు
ముఖ్యమంత్రి చంద్రశేఖరరావుపై నమ్మకంతోనే తమ యూనియన్ సమ్మెను వ్యతిరేకించిందని జీహెచ్‌ఎంసీ తెలంగాణ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షుడు కె.అమరేశ్వర్ అన్నారు. ఆంధ్రా ప్రాంతానికి చెందిన కొందరు యూనియన్ నాయకులు దళారులుగా వ్యవహరిస్తూ తెలంగాణ కార్మికుల కష్టాన్ని దిగమింగుతున్నారని ఆరోపించారు.
తొలగింపు తగదు
సమ్మెలో ఉన్న కార్మికులను తొలగించాలని తీసుకున్న నిర్ణయం సమంజసం కాదని బీఎంఎస్ ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎ.శంకర్ అన్నారు. వేతనాల పెంపు కోసం సమ్మెలో పాల్గొన్న వారిపై కత్తి కట్టడం తగదన్నారు. ఈ విషయంలో సర్దుకుపోవాలని కోరారు. వారిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో తమ యూనియన్ తరఫున తిరిగి ఉద్యమం చేపడతామని స్పష్టం చేశారు.