- యంత్రాల అరుగుదల, పెట్టుబడులపై పన్ను రాయితీలు
- హైదరాబాద్ మినహా తొమ్మిది జిల్లాలకు వర్తింపు
సాక్షి, హైదరాబాద్: రాజధాని హైదరాబాద్ మినహా రాష్ట్రంలోని తొమ్మిది జిల్లాలకు పారిశ్రామిక రాయితీలు, ప్రోత్సాహకాలను వర్తింపజేస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వెనుకబడిన జిల్లాల జాబితాలో ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, మెదక్, మహబూబ్‌నగర్, రంగారెడ్డి, నల్లగొండ, ఖమ్మం జిల్లాలకు రాయితీలు లభిస్తాయని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిధిలోని రెవెన్యూ విభాగం ప్రత్యక్ష పన్నుల బోర్డు ప్రకటించింది.
ఆదాయ పన్ను చట్టం-1961 నిబంధనల ప్రకారం.. యంత్రాల అరుగుదల (సెక్షన్ 32), పెట్టుబడులపై పన్ను రాయితీ (సెక్షన్ 32 ఏడీ) కింద 2015 ఏప్రిల్ ఒకటి నుంచి 2020 మార్చి 31 లోపు రాష్ట్రంలో స్థాపించే పరిశ్రమలకు ప్రోత్సాహకాలు అందుతాయి. యంత్రాల తరుగుదల, పెట్టుబడులకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అందిస్తున్న ప్రోత్సాహకాలకు ఇవి అదనం కానున్నాయి. తెలంగాణ, బిహార్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు ఒక విడతలో.. ఏపీకి మరో విడతలో పారిశ్రామిక రాయితీలను కేంద్రం ప్రకటించింది.
ఏపీలో తొలుత ఏడు జిల్లాలకు రాయితీలు ప్రకటించగా.. 13 జిల్లాలకు వర్తింప చేయాలని ఏపీ కోరింది. ఆంధ్రప్రదేశ్ విజ్ఞప్తిని పరిశీలించిన కేంద్రం.. వెనుకబడిన జిల్లాలకే పన్ను రాయితీ వర్తిస్తుందని స్పష్టం చేసింది. ఉత్తరాంధ్రలో మూడు, రాయలసీమలో నాలుగు జిల్లాలకు పారిశ్రామిక రాయితీలు వర్తిస్తాయని పేర్కొంది.
రాష్ట్రం 10, కేంద్రం 15 శాతం..: యంత్రాల అరుగుదలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 10 శాతం పన్ను రాయితీ ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం నిర్ణయంతో అదనంగా మరో 15 శాతం కలిపి మొత్తంగా 25 శాతం మేర పారిశ్రామికవేత్తలకు పన్ను రాయితీ లభిస్తుంది. అదేవిధంగా పారిశ్రామిక పెట్టుబడులపైనా రాష్ట్రం ఇచ్చే 10 శాతంతో పాటు.. కేంద్రం కూడా మరో 15 శాతాన్ని అదనంగా జోడిస్తోంది. నూతన పారిశ్రామిక విధానం టీఎస్‌ఐపాస్ ద్వారా ఇప్పటికే పరిశ్రమల స్థాపన పుంజుకోగా.. కేంద్రం ప్రకటనతో మరింత ఊపందుకుంటుందని పరిశ్రమల శాఖ వర్గాలు వెల్లడించాయి.
రాష్ట్ర పరిశ్రమలకు కేంద్రం ప్రోత్సాహకాలు
Published Sun, Oct 2 2016 2:36 AM | Last Updated on Mon, Sep 4 2017 3:48 PM
Advertisement
Advertisement