tax incentives
-
బీమాకు మరింత ధీమా!
దేశ జనాభా సుమారు 133 కోట్ల స్థాయిలో ఉన్నా దేశీయంగా బీమా పాలసీలు ఇంకా అంతగా ప్రాచుర్యం పొందడం లేదు. స్థూల దేశీయోత్పత్తిలో బీమా రంగం వాటా 5 శాతం లోపే ఉంటోంది. ఈ నేపథ్యంలో బీమా విస్తృతిని మరింతగా పెంచే దిశగా బడ్జెట్లో పన్నుపరమైన ప్రోత్సాహకాలు మరిన్ని ఇవ్వాలని ఇన్సూరెన్స్ సంస్థలు కోరుతున్నాయి. టర్మ్ పాలసీలు, పింఛను పథకాల్లాంటి కొన్ని పాలసీలను ప్రత్యేకంగా పరిగణించి, విడిగా పన్ను మినహాయింపునివ్వాలని జీవిత బీమా సంస్థలు విజ్ఞప్తి చేస్తున్నాయి. ప్రస్తుతం బీమా సంస్థలు పెన్షన్ పాలసీల విషయంలో ఎన్‌పీఎస్‌తో పోటీపడాల్సి ఉంటోంది. నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్పీఎస్)కు లభిస్తున్న పన్నుపరమైన ప్రోత్సాహకాలు, ఆదాయపు పన్నుకు సంబంధించి రూ. 50,000 దాకా మినహాయింపులు వంటి ప్రయోజనాలు మిగతా పెన్షన్ పథకాలకు పెద్దగా లభించడం లేదు. ఇక, టర్మ్ ప్లాన్లకు విడిగా పన్ను మినహాయింపులు ఇవ్వాలని అయిదేళ్లుగా డిమాండ్ చేస్తున్న లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థలు తాజాగా మళ్లీ దాన్ని తెరపైకి తెచ్చాయి. తొలిసారి లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకునేవారికి విడిగా రూ. 50,000 డిడక్షన్, ప్రత్యేకంగా టర్మ్ పాలసీ మాత్రమే తీసుకునేవారికి అదనంగా రూ. 50,000 పన్ను మినహాయింపులిస్తే.. ఈ పాలసీలను మరింతగా విస్తృతిలోకి తేవొచ్చని ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ఇన్సూరెన్స్ ఎండీ కమలేష్ రావు అభిప్రాయపడ్డారు. మరోవైపు, ప్రాపర్టీ ఇన్సూరెన్స్ తీసుకునే వారికీ ప్రత్యేకంగా పన్నుపరమైన ప్రోత్సాహకాలు ఇవ్వాలని సాధారణ బీమా కంపెనీలు కోరుతున్నాయి. ప్రస్తుతం నాన్–లైఫ్ పాలసీల్లో హెల్త్ ఇన్సూరెన్స్‌కి తప్ప మిగతావాటికి పన్ను ప్రయోజనాలు ఉండటం లేదు. మహిళలకు మరిన్ని ప్రయోజనాలు కల్పించాలి .. ►బీమా, పొదుపువైపు మళ్లేలా మహిళలను మరింతగా ప్రోత్సహించేందుకు వారికి అదనంగా పన్నుపరమైన ప్రయోజనాలు కల్పించే అంశాన్ని కూడా ప్రభుత్వం పరిశీలించాలి. ►పన్ను మినహాయింపు లభించాలంటే వార్షిక ప్రీమియంకు పది రెట్లు ఇన్సూరెన్స్ ఉండాలన్న నిబంధన ఎత్తివేయాలి. ►ఒకవేళ వ్యక్తిగత లైఫ్ పాలసీల ప్రీమియంలకు ప్రత్యేకంగా డిడక్షన్ ఇవ్వని పక్షంలో.. సెక్షన్ 80 సీ పరిమితినైనా ప్రస్తుతమున్న రూ. 1.5 లక్షల నుంచి రూ. 3 లక్షలకు పెంచాలి. ►వ్యక్తిగతంగా తీసుకునే గృహ బీమా పథకాలకు పన్ను మినహాయింపునివ్వాలి. ►వ్యక్తిగత ప్రమాద బీమా, గృహ బీమా పథకాలకు సెక్షన్ 80డీ కింద ప్రత్యేకంగా పన్ను మినహాయింపులివ్వాలి. ►పాలసీలు కొనుగోలు చేసే వేతన జీవులకు మరిన్ని పన్నుపరమైన ప్రయోజనాలు కల్పిస్తే బీమా మరింత ప్రాచుర్యంలోకి రాగలదు. ►జాతీయ విపత్తుల సమయంలో ఎక్కువగా నష్టపోతున్నది సామాన్య ప్రజలే. వారికి చౌక ప్రీమియంలతో గృహ బీమా సదుపాయం కల్పించాలి. దీన్ని ప్రాపర్టీ ట్యాక్స్‌తో పాటే వసూలు చేయొచ్చు. విపత్తు వల్ల నష్టం వాటిల్లిన పక్షంలో క్లెయిమ్ మొత్తాన్ని సదరు పాలసీదారు జన్ ధన్ యోజన ఖాతాలోకి నేరుగా మళ్లించవచ్చు. ►ప్రస్తుతం బీమా పాలసీలపై ఏకంగా 18 శాతం జీఎస్టీ ఉంటోంది. పాలసీల కొనుగోళ్లకు ఇది ప్రతిబంధకంగా మారుతోంది. దీన్ని 12 శాతానికి తగ్గిస్తే పాలసీదారులు, కంపెనీలకూ ప్రయోజనకరంగా ఉంటుంది. -
పీఎంపీ నిబంధనల్లో మార్పులు కోరిన యాపిల్
న్యూఢిల్లీ: టెక్నాలజీ దిగ్గజం యాపిల్ తాజాగా ఫేజ్డ్ మాన్యుఫాక్చరింగ్ ప్రోగ్రామ్ (పీఎంపీ)లో కొన్ని మార్పులు చేర్పులు అవసరమని కోరింది. కంపెనీ భారత్‌లో ప్లాంటును ఏర్పాటు చేయాలని భావిస్తోన్న విషయం తెలిసిందే. ఉపకరణాల తయారీలో ఉపయోగించే పలు విడిభాగాలు, యాక్ససరీస్‌పై పన్ను ప్రోత్సాహకాలు, ఇతర ప్రయోజనాలు అందించడం ద్వారా దేశంలో మొబైల్ ఫోన్ల తయారీని పెంచాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం పీఎంపీ కార్యక్రమాన్ని ఆవిష్కరించింది. ‘డిపార్ట్మెంట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (డీఈఐటీవై) యాపిల్ అంశంపై దృష్టిసారించింది. మొబైల్స్ విడిభాగాలకు సంబంధి పన్నుల నిర్మాణంపై వారు పూర్తి స్పష్టత కోరుకుంటున్నారు. ప్రస్తుత పీఎంపీ ప్రకారమైతే యాపిల్ ప్రణాళికలు కార్యరూపం దాల్చేలా లేవు’ అని ఒక అధికారి తెలిపారు. ఇక డీఈఐటీవై కూడా విడిభాగాల ప్రాతిపదికన యాపిల్‌తో చర్చలు జరుపుతోందన్నారు. -
కంపెనీల పన్ను ప్రోత్సాహకాల భారం రూ.83,492 కోట్లు
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ కంపెనీలకు ఇస్తున్న పన్ను ప్రోత్సాహకాల వల్ల ప్రభుత్వం కోల్పోయే ఆదాయం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 8.63 శాతానికి పెరగనుంది. 2017–18 బడ్జెట్ ప్రకారం పన్ను ప్రోత్సాహకాల భారం రూ.83,492 కోట్లుగా తేలింది. 2015–16 ఆర్థిక సంవత్సరంలో రూ.76,857.70 కోట్ల విలువైన పన్ను ప్రోత్సాహకాలను అందించారు. ఈ మొత్తంతో పోల్చితే ఈసారి భారం 8.63 శాతానికి పెరిగింది. -
డిజిటల్ లావాదేవీల్లో ఆధార్ కీలకం
- డిజిటల్ పయనానికి పన్ను రాయితీలు ఉండాలి - డిజిటల్ లావాదేవీల అమలు కమిటీ చైర్మన్ చంద్రబాబు సాక్షి, న్యూఢిల్లీ: డిజిటల్ కరెన్సీ అమలు దిశగా హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్‌కు రాయితీలు ఇవ్వడంతో పాటు పన్ను రాయితీలు కూడా ఉండాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, డిజిటల్ లావాదేవీల అమలు కమిటీ చైర్మన్ చంద్రబాబు చెప్పారు. ఢిల్లీలో బుధవారం జరిగిన కమిటీ సమావేశంలో పాల్గొన్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘డిజిటల్ ఎకానమీకి వెళ్లాలంటే ఉత్తమ పద్ధతులు, ఇబ్బందులపై చర్చించాం. అంతర్జాతీయంగా అవలంబిస్తున్న ఉత్తమ పద్ధతులు అధ్యయనం చేస్తున్నాం. ఆధార్ ఆధారంగా చెల్లింపు చేసే పద్ధతి సులువైనది. వ్యాపారికి స్మార్ట్‌ఫోన్ ఉండి, దానికి బయోమెట్రిక్ పరికరం బిగిస్తే సరిపోతోంది. దీనికి రెండువేలు ఖర్చవుతుంది. ఏపీ రూ.1000 రాయితీ ఇస్తోంది. వినియోగదారుడికి ఎలాంటి ఖర్చు ఉండదు. త్వరలోనే దీన్ని ప్రారంభించాలి. రాష్ట్రంలో ఇప్పటికే పైలెట్‌గా 400 షాపుల్లో ప్రారంభించాం. చౌకధరల దుకాణాల్లో ఇప్పటికే నగదు రహిత లావాదేవీలు జరుపుతున్నాం. నాలుగు మార్గాల ద్వారా నగదు రహిత లావాదేవీలు నిర్వహించవచ్చు. యూఎస్ఎస్డీ ద్వారా సాధారణ ఫోన్ నుంచి కూడా లావాదేవీలు జరపొచ్చు. యూపీఐ ద్వారా కూడా సులువుగా ఉంటుంది. 600 మిలియన్ సెల్ఫోన్లున్నాయి. వీటిద్వారా యూపీఐ విధానంలో సులువుగా లావాదేవీలు జరపొచ్చు. ఎన్పీసీఐ 33 బ్యాంకులను యూపీఐ కిందికి తెచ్చింది. ఏ బ్యాంకులో అకౌంట్ ఉన్నా ఒకే ప్లాట్‌ఫామ్ ద్వారా లావాదేవీలు నిర్వహించవచ్చు. స్వైపింగ్ ద్వారా, డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా లావాదేవీలు చేయవచ్చు. ఇండియాకు సైబర్ సెక్యూరిటీలో ఉన్న సామర్థ్యంపై అనుమానాలు అక్కర్లేదు..’ అని పేర్కొన్నారు. నీతి ఆయోగ్‌లో జరిగిన కమిటీ సమావేశంలో సిక్కిం ముఖ్యమంత్రి పవన్‌కుమార్ చామ్లింగ్, నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ అరవింద్ పనగరియా, సీఈవో అమితాబ్‌కాంత్, ఇతర ప్రతినిధులు పాల్గొన్నారు. వచ్చే వారంలో నివేదిక ‘నగదు రహిత లావాదేవీల అమలు విధానంపై సిఫారసులతో కూడిన మధ్యం తర నివేదికను జనవరి మొదటి వారంలో ప్రధానికి ఇవ్వబోతున్నాం. హార్డ్‌వేర్, ఈపాస్ మిషన్లు లేకపోవడం వంటి సమస్య లున్నాయి. రానున్న 3 నెలల్లో 10 లక్షల ఈ పాస్ మిషన్లు దిగుమతి చేసుకోవాలని, దేశీయంగా 10 లక్షల మిషన్లు సేకరించాలని నిర్ణయించాం. స్మార్ట్ఫోన్ల ధరలు దిగి రావాలి. ప్రభుత్వం వీటికి రాయితీ ఇవ్వాలి. వీటన్నింటి వినియోగం ఖర్చుతో కూడినదై ఉండరాదు. బ్యాండ్‌విడ్త్ విస్తరించాలి. డేటా వేగం పెరగాలి. బ్యాంకర్ చార్జీలు, కమ్యూనికేషన్ చార్జీలు అతి తక్కువలో ఉండాలి. పన్ను తగ్గించాలి. పన్ను రాయితీ ఉంటేనే డిజిటల్ కరెన్సీకి పెద్ద ఎత్తున వెళతారు’ అని చంద్రబాబు చెప్పారు. నోట్ల రద్దుపై తన వైఖరి ఎప్పుడూ మారలేదని, నగదు రహిత లావాదేవీలతో విస్తృత ప్రయోజనాలు ఉన్నాయని ఒక ప్రశ్నకు సమాధానంగా పేర్కొన్నారు. -
రాష్ట్ర పరిశ్రమలకు కేంద్రం ప్రోత్సాహకాలు
- యంత్రాల అరుగుదల, పెట్టుబడులపై పన్ను రాయితీలు - హైదరాబాద్ మినహా తొమ్మిది జిల్లాలకు వర్తింపు సాక్షి, హైదరాబాద్: రాజధాని హైదరాబాద్ మినహా రాష్ట్రంలోని తొమ్మిది జిల్లాలకు పారిశ్రామిక రాయితీలు, ప్రోత్సాహకాలను వర్తింపజేస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వెనుకబడిన జిల్లాల జాబితాలో ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, మెదక్, మహబూబ్‌నగర్, రంగారెడ్డి, నల్లగొండ, ఖమ్మం జిల్లాలకు రాయితీలు లభిస్తాయని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిధిలోని రెవెన్యూ విభాగం ప్రత్యక్ష పన్నుల బోర్డు ప్రకటించింది. ఆదాయ పన్ను చట్టం-1961 నిబంధనల ప్రకారం.. యంత్రాల అరుగుదల (సెక్షన్ 32), పెట్టుబడులపై పన్ను రాయితీ (సెక్షన్ 32 ఏడీ) కింద 2015 ఏప్రిల్ ఒకటి నుంచి 2020 మార్చి 31 లోపు రాష్ట్రంలో స్థాపించే పరిశ్రమలకు ప్రోత్సాహకాలు అందుతాయి. యంత్రాల తరుగుదల, పెట్టుబడులకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అందిస్తున్న ప్రోత్సాహకాలకు ఇవి అదనం కానున్నాయి. తెలంగాణ, బిహార్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు ఒక విడతలో.. ఏపీకి మరో విడతలో పారిశ్రామిక రాయితీలను కేంద్రం ప్రకటించింది. ఏపీలో తొలుత ఏడు జిల్లాలకు రాయితీలు ప్రకటించగా.. 13 జిల్లాలకు వర్తింప చేయాలని ఏపీ కోరింది. ఆంధ్రప్రదేశ్ విజ్ఞప్తిని పరిశీలించిన కేంద్రం.. వెనుకబడిన జిల్లాలకే పన్ను రాయితీ వర్తిస్తుందని స్పష్టం చేసింది. ఉత్తరాంధ్రలో మూడు, రాయలసీమలో నాలుగు జిల్లాలకు పారిశ్రామిక రాయితీలు వర్తిస్తాయని పేర్కొంది. రాష్ట్రం 10, కేంద్రం 15 శాతం..: యంత్రాల అరుగుదలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 10 శాతం పన్ను రాయితీ ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం నిర్ణయంతో అదనంగా మరో 15 శాతం కలిపి మొత్తంగా 25 శాతం మేర పారిశ్రామికవేత్తలకు పన్ను రాయితీ లభిస్తుంది. అదేవిధంగా పారిశ్రామిక పెట్టుబడులపైనా రాష్ట్రం ఇచ్చే 10 శాతంతో పాటు.. కేంద్రం కూడా మరో 15 శాతాన్ని అదనంగా జోడిస్తోంది. నూతన పారిశ్రామిక విధానం టీఎస్ఐపాస్ ద్వారా ఇప్పటికే పరిశ్రమల స్థాపన పుంజుకోగా.. కేంద్రం ప్రకటనతో మరింత ఊపందుకుంటుందని పరిశ్రమల శాఖ వర్గాలు వెల్లడించాయి. -
ఏపీకి ప్రత్యేక హోదా అవసరం లేదు
♦ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హెచ్‌పీ చౌదరి వ్యాఖ్య ♦ పన్ను ప్రోత్సాహకాలు, కేంద్ర సాయం అందిస్తున్నందువల్ల ♦ హోదా ఇవ్వాల్సిన అవసరం లేదు ♦ విభజన చట్టంలో ఇచ్చిన హామీల అమలుకు కేంద్రం కట్టుబడి ఉంది ♦ 14వ ఆర్థిక సంఘం హోదా రాష్ట్రాలకు, ♦ సాధారణ రాష్ట్రాలకు మధ్య వ్యత్యాసం చూపలేదు ♦ రాజ్యసభలో ప్రైవేటు మెంబర్ బిల్లుపై చర్చ ♦ కోరం లేక అసంపూర్తిగా ముగిసిన వైనం సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాల్సిన అవసరం లేదని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి హెచ్‌పీ చౌదరి తేల్చిచెప్పారు. విభజన చట్టం అమలు చేయడమే కాకుండా పన్ను ప్రోత్సాహకాలు, కేంద్ర సాయం అందిస్తున్నందువల్ల ప్రత్యేక హోదా ఇవ్వాల్సిన అవసరం లేదని అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదాకు సంబంధించి శుక్రవారం రాజ్యసభలో ప్రైవేట్ మెంబర్ బిల్లుపై చర్చకు జవాబిచ్చిన తర్వాత పార్లమెంట్ ప్రాంగణంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘నీతి ఆయోగ్ పన్నుల హాలిడే, పన్నుల ప్రోత్సాహకాలు అందించింది. అభివృద్ధి కోసం కేంద్రం పూర్తిగా నిధులందించింది. అందువల్ల ప్రత్యేక హోదా అవసరం లేదనిపిస్తోంది. ప్రైవేట్ మెంబర్ బిల్లులో ప్రత్యేక హోదా డిమాండ్ చే శారు. మీకు కావాల్సినవి చట్టంలో ఉన్నాయని (ప్రత్యేక హోదా చట్టంలో లేదని పరోక్షంగా చెబుతూ) వారికి చెప్పాను. చట్టం అమలు పురోగతిని వివరించాను’ అని చౌదరి వెల్లడించారు. అంతకుముందు రాజ్యసభలో ఏపీకి ప్రత్యేక హోదా కోసం అంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో సవరణ చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ ఎంపీ కేవీపీ రామచంద్రరావు ప్రవేశపెట్టిన ప్రైవేట్ మెంబర్ బిల్లుపై జరిగిన చర్చకు మంత్రి జవాబిచ్చారు. ప్రత్యేక హోదా ప్రస్తావన తేకుండా విభజన చట్టం అమలులో పురోగతిని వివరించారు. చట్టంలో పేర్కొన్న హామీలను అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. ప్రత్యేక హోదాపై కాంగ్రెస్ సభ్యుడు జేడీ శీలం స్పష్టత కోరగా.. 14వ ఆర్థిక సంఘం ప్రత్యేక హోదా రాష్ట్రాలకు, సాధారణ రాష్ట్రాలకు మధ్య వ్యత్యాసం చూపలేదని పేర్కొన్నారు. 2018 కల్లా పోలవరం పూర్తి ఏపీకి పన్నుల ప్రోత్సాహకాలు, కేంద్ర సాయం గురించి నీతి ఆయోగ్ సిఫారసు చేసిందని చౌదరి పేర్కొన్నారు. ‘చట్టంలోని అంశాల అమలు కోసం కమిటీలు వేశాం. సమీక్షలు జరుపుతున్నాం.ఐఐటీ, ఐఐఎం తదితర సంస్థలు ఏర్పాటయ్యాయి. కేంద్రీయ వర్సిటీకి భూసేకరణ జరుగుతోంది. పనుల పురోగతిని బట్టి నిధులు ఇస్తాం. పోలవరం ప్రాజెక్టుకు కావాల్సిన రూ.7 వేల కోట్లను ఇస్తాం. 2018 కల్లా పూర్తి చేస్తాం. రాజధాని అమరావతి నిర్మాణం కోసం రూ.2,050 కోట్లు అందించాం. త్వరలోనే ఏపీలో నూతన హైకోర్టు ఏర్పాటవుతుంది..’ అని చెప్పారు. మోదీ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ తెలుగు రాష్ట్రాలలో నెరవేరుస్తామన్నారు.మరోసారి హోదాపై సభ్యులు పట్టుబట్టగా.. టీడీపీ సభ్యుడు సీఎం రమేశ్ కోరం లేదంటూ అభ్యంతరం వ్యక్తంచేశారు. దీంతో చర్చ అసంపూర్తిగా ముగిసింది. తదుపరి వారంలో ఈ చర్చ కొనసాగనుంది. తెలంగాణాకూ ప్రత్యేక హోదా ఇవ్వాలి: కేశవరావు ఏపీతో పాటు తెలంగాణాకు కూడా ప్రత్యేక హోదా ఇవ్వాలని టీఆర్ఎస్ ఎంపీ కె.కేశవరావు డిమాండ్ చేశారు. అసెంబ్లీ స్థానాలు పెంచాలని తెలుగుు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కోరుతున్నారని గుర్తుచేస్తూ అసెంబ్లీ స్థానాలు పెంచే దిశగా కేంద్రం సత్వరమే చర్యలు చేపట్టాలని కోరారు. ప్రతిపక్షంలో ఉండగా ప్రగల్భాలు పలికిన బీజేపీ నాయకులు విభజన చట్టం అమలుకు ఎందుకు ప్రయత్నించడం లేదని కాంగ్రెస్ ఎంపీ ఎంఏ ఖాన్ నిలదీశారు. మోదీ చెప్పిన మంచి రోజులు ఎప్పడొస్తాయని ప్రశ్నించారు. విభజన చట్టం అమలు కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు కృషి చేస్తున్నారని టీడీపీ సభ్యుడు సీఎం రమేష్ అన్నారు. కేంద్ర మంత్రి జవాబు తర్వాత కేవీపీ వివరణ కోరాల్సిన సమయంలో సభలో కోరం లేకపోవడంతో చర్చ అసంపూర్తిగా ముగిసింది. కేంద్రానికి చిత్తశుద్ధి లేదు: జేడీ శీలం అంతకుముందు చర్చలో పాల్గొంటూ విభజన చట్టం అమలు చేయకుండా కేంద్ర ప్రభుత్వం అబద్ధాలు, తప్పుడు ప్రచారాన్ని చేస్తోందని జేడీ శీలం ఆరోపించారు. విభజన చట్టం అమలు విషయంలో కేంద్రానికి చిత్తశుద్ధి లేదన్నారు. రాజధాని అమరావతికి శంకుస్థాపన సందర్భంగా ప్రధానమంత్రి మోదీ మట్టి, నీరు తెచ్చి ఏపీ ప్రజలను అవమానపర్చారని విమర్శించారు. ప్రత్యేక హోదా విభజన చట్టంలో లేదని కుంటిసాకులు చెబుతున్నారని, 11 రాష్ట్రాలకు ఇచ్చిన విధంగానే ఏపీకీ ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రత్యేక హోదా కల్పిస్తేనే ఏపీలో అభివృధ్ది సాధ్యమవుతుందన్నారు. విభజన చట్టం అమలు, రాష్ట్రానికి ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీ రాబట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయడంలేదన్నారు.