డిజిటల్ లావాదేవీల్లో ఆధార్ కీలకం
- డిజిటల్ పయనానికి పన్ను రాయితీలు ఉండాలి
- డిజిటల్ లావాదేవీల అమలు కమిటీ చైర్మన్ చంద్రబాబు
సాక్షి, న్యూఢిల్లీ: డిజిటల్ కరెన్సీ అమలు దిశగా హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్‌కు రాయితీలు ఇవ్వడంతో పాటు పన్ను రాయితీలు కూడా ఉండాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, డిజిటల్ లావాదేవీల అమలు కమిటీ చైర్మన్ చంద్రబాబు చెప్పారు. ఢిల్లీలో బుధవారం జరిగిన కమిటీ సమావేశంలో పాల్గొన్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘డిజిటల్ ఎకానమీకి వెళ్లాలంటే ఉత్తమ పద్ధతులు, ఇబ్బందులపై చర్చించాం. అంతర్జాతీయంగా అవలంబిస్తున్న ఉత్తమ పద్ధతులు అధ్యయనం చేస్తున్నాం. ఆధార్ ఆధారంగా చెల్లింపు చేసే పద్ధతి సులువైనది. వ్యాపారికి స్మార్ట్‌ఫోన్ ఉండి, దానికి బయోమెట్రిక్ పరికరం బిగిస్తే సరిపోతోంది. దీనికి రెండువేలు ఖర్చవుతుంది.
ఏపీ రూ.1000 రాయితీ ఇస్తోంది. వినియోగదారుడికి ఎలాంటి ఖర్చు ఉండదు. త్వరలోనే దీన్ని ప్రారంభించాలి. రాష్ట్రంలో ఇప్పటికే పైలెట్‌గా 400 షాపుల్లో ప్రారంభించాం. చౌకధరల దుకాణాల్లో ఇప్పటికే నగదు రహిత లావాదేవీలు జరుపుతున్నాం. నాలుగు మార్గాల ద్వారా నగదు రహిత లావాదేవీలు నిర్వహించవచ్చు. యూఎస్‌ఎస్‌డీ ద్వారా సాధారణ ఫోన్ నుంచి కూడా లావాదేవీలు జరపొచ్చు. యూపీఐ ద్వారా కూడా సులువుగా ఉంటుంది. 600 మిలియన్ సెల్‌ఫోన్లున్నాయి. వీటిద్వారా యూపీఐ విధానంలో సులువుగా లావాదేవీలు జరపొచ్చు. ఎన్‌పీసీఐ 33 బ్యాంకులను యూపీఐ కిందికి తెచ్చింది. ఏ బ్యాంకులో అకౌంట్ ఉన్నా ఒకే ప్లాట్‌ఫామ్ ద్వారా లావాదేవీలు నిర్వహించవచ్చు. స్వైపింగ్ ద్వారా, డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా లావాదేవీలు చేయవచ్చు. ఇండియాకు సైబర్ సెక్యూరిటీలో ఉన్న సామర్థ్యంపై అనుమానాలు అక్కర్లేదు..’ అని పేర్కొన్నారు. నీతి ఆయోగ్‌లో జరిగిన కమిటీ సమావేశంలో సిక్కిం ముఖ్యమంత్రి పవన్‌కుమార్ చామ్లింగ్, నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ అరవింద్ పనగరియా, సీఈవో అమితాబ్‌కాంత్, ఇతర ప్రతినిధులు పాల్గొన్నారు.
వచ్చే వారంలో నివేదిక
‘నగదు రహిత లావాదేవీల అమలు విధానంపై సిఫారసులతో కూడిన మధ్యం తర నివేదికను జనవరి మొదటి వారంలో ప్రధానికి ఇవ్వబోతున్నాం. హార్డ్‌వేర్, ఈపాస్ మిషన్లు లేకపోవడం వంటి సమస్య లున్నాయి. రానున్న 3 నెలల్లో 10 లక్షల ఈ పాస్ మిషన్లు దిగుమతి చేసుకోవాలని, దేశీయంగా 10 లక్షల మిషన్లు సేకరించాలని నిర్ణయించాం. స్మార్ట్‌ఫోన్ల ధరలు దిగి రావాలి. ప్రభుత్వం వీటికి రాయితీ ఇవ్వాలి. వీటన్నింటి వినియోగం ఖర్చుతో కూడినదై ఉండరాదు. బ్యాండ్‌విడ్త్ విస్తరించాలి. డేటా వేగం పెరగాలి. బ్యాంకర్ చార్జీలు, కమ్యూనికేషన్ చార్జీలు అతి తక్కువలో ఉండాలి. పన్ను తగ్గించాలి. పన్ను రాయితీ ఉంటేనే డిజిటల్ కరెన్సీకి పెద్ద ఎత్తున వెళతారు’ అని చంద్రబాబు చెప్పారు. నోట్ల రద్దుపై తన వైఖరి ఎప్పుడూ మారలేదని, నగదు రహిత లావాదేవీలతో విస్తృత ప్రయోజనాలు ఉన్నాయని ఒక ప్రశ్నకు సమాధానంగా పేర్కొన్నారు.