
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం తమకు అందించాలనుకుంటున్న ఎకరానికి రూ. 4 వేల చొప్పున పెట్టుబడి సాయాన్ని చెక్కుల పంపిణీ లేదా బ్యాంకులో నగదు జమ ద్వారా అందించాలని మెజారిటీ జిల్లాల రైతులు అభిప్రాయపడ్డారు. ఈ పథకం అమలుపై ఏర్పడిన మంత్రివర్గ ఉపసంఘం ఆదేశం మేరకు మంగళవారం వ్యవసాయశాఖ జిల్లాకో గ్రామంలో నిర్వహించిన గ్రామ సభల్లో ఇదే విషయాన్ని వారు వెల్లడించారు.
ప్రభుత్వం తమకు చెక్కులు ఇవ్వాలని 13 జిల్లాల రైతులు కోరగా మరో 10 జిల్లాల రైతులు తమ బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇంకో 7 జిల్లాల రైతులు నేరుగా తమకే డబ్బు ఇవ్వాలని విన్నవించారు. గ్రామసభల్లో ఐదారు అంశా లపై వ్యవసాయశాఖ రైతుల అభిప్రాయాలు సేకరించింది. చెక్కులు ఇవ్వడం, బ్యాంకు ఖాతాల్లో వేయడం, నేరుగా డబ్బులు ఇవ్వడం, పోస్టాఫీసుల ద్వారా అందజే యడం, టీ వ్యాలెట్ ద్వారా, ప్రాథమిక సహకార సంఘాల ద్వారా పంపిణీ చేయడంపై గ్రామ సభల్లో రైతులను సర్వే చేసింది.
నేరుగా డబ్బులిస్తే గందరగోళం ఏర్పడుతుందని 23 జిల్లాల రైతులు నిక్కచ్చిగా తేల్చిచెప్పారని వ్యవసాయశాఖ వర్గాలు తెలిపాయి. పోస్టాఫీసుల ద్వారా అందించే విషయంపై రైతులు పెద్దగా స్పందించలేదన్నారు. టీ వ్యాలెట్ పద్ధతి తమకు తెలియదన్నారు. రైతుల అభిప్రా యాల నేపథ్యంలో మంత్రివర్గ ఉపసంఘం బుధవారం మరోసారి సమావేశం కానుంది.
ఈ భేటీలో రైతుల అభిప్రాయాలతో కూడిన నివేదికను వ్యవసాయశాఖ అందించనుంది. పెట్టుబడి సాయం పథకం కింద రైతులకు చెక్కులు జారీ చేస్తే వారి అప్పుల కింద ఆ డబ్బును జమ చేసుకోబోమని రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమితి(ఎస్‌ఎల్‌బీసీ) సర్కారుకు హామీ ఇచ్చింది. దీనిపై చర్చించేందుకు మంగళ వారం ఎస్‌ఎల్‌బీసీ అత్యవసర సమావేశం నిర్వహించింది. ఆ వివరాలను వ్యవసాయ శాఖ కార్యదర్శి పార్థసారథి వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment