రైతులందరికీ పీఎం–కిసాన్‌ | Modi govt notifies extension of benefits to all 14.5 crore farmers | Sakshi
Sakshi News home page

రైతులందరికీ పీఎం–కిసాన్‌

Published Sun, Jun 9 2019 4:26 AM | Last Updated on Sun, Jun 9 2019 4:28 AM

Modi govt notifies extension of benefits to all 14.5 crore farmers - Sakshi

న్యూఢిల్లీ: ఎన్నికల హామీని నెరవేరుస్తూ.. రైతులందరికీ ప్రధానమంత్రి కిసాన్‌ పథకం వర్తింపజేయాలనే నిర్ణయంపై కేంద్రం శనివారం నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈ పథకం కింద దేశవ్యాప్తంగా 14.5 కోట్ల మంది రైతులకు.. వారికెంత భూమి ఉంది అన్న విషయం పరిగణనలోకి తీసుకోకుండా ఏడాదికి రూ.6 వేల చొప్పున సాయం అందజేస్తారు. మే 31న జరిగిన కొత్త ఎన్డీయే ప్రభుత్వ తొట్టతొలి సమావేశంలోనే ఇందుకు సంబంధించిన నిర్ణయం తీసుకున్నారు. ఈ పథకాన్ని రైతులందరికీ వర్తింపజేస్తామని 2019 సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ప్రకటించిన బీజేపీ మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు.

దీనిపై శనివారం నోటిఫికేషన్‌ జారీ చేసిన కేంద్ర వ్యవసాయ శాఖ.. ఈ మేరకు ప్రస్తుతమున్న మినహాయింపు అంశాలను పరిగణనలోకి తీసుకుని లబ్ధిదారులను గుర్తించాల్సిందిగా కోరుతూ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖలు రాసింది. ప్రస్తుతమున్న భూయాజమాన్య విధానాన్ని ఉపయోగించి లబ్ధిదారులను గుర్తించాలని, పీఎం–కిసాన్‌ పోర్టల్‌లో కుటుంబసభ్యుల వివరాలు అప్‌లోడ్‌ చేసిన తర్వాత ప్రయోజనాన్ని వారి ఖాతాల్లోకి బదిలీ చేయాలని ఆదేశించింది. అర్హులైన లబ్ధిదారులను గుర్తించే బాధ్యత, వారి డేటా పీఎం–కిసాన్‌ పోర్టల్‌లో అప్‌లోడ్‌ అయ్యేలా చూడాల్సిన బాధ్యత రాష్ట్రాలపై ఉంటుంది.  

వీరికి వర్తించదు
సంస్థాగత భూ యజమానులు, రాజ్యాంగ పరమైన పదవులు కలిగిన రైతు కుటుంబాలు, సర్వీసులో ఉన్న లేదా పదవీ విరమణ పొందిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు, అలాగే ప్రభుత్వం రంగ, స్వతంత్ర ప్రతిపత్తి గల ప్రభుత్వ సంస్థల అధికారులు, ఉద్యోగులు ప్రధానమంత్రి కిసాన్‌ సమ్మాన్‌ సిద్ధి (పీఎం–కిసాన్‌) పథకం కిందకి రారు. డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు వంటి వృత్తి విద్యా నిపుణలు, అలాగే నెలకు రూ.10 వేలకు పైగా పెన్షన్‌ పొందేవారు, గత మదింపు సంవత్సరంలో ఆదాయ పన్ను కట్టినవారికి కూడా ఈ పథకం వర్తించదు. రూ.75 వేల కోట్ల పీఎం–కిసాన్‌ పథకాన్ని మధ్యంతర బడ్జెట్‌ సందర్భంగా ప్రకటించారు. ప్రస్తుతం సవరించిన పథకం ప్రకారం.. మరో 2 కోట్ల మంది రైతులు దీనికింద లబ్ధి పొందుతారు. దీంతో దీని అంచనా వ్యయం కూడా 2019–20లో రూ.87,217.50 కోట్లకు పెరుగుతుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement