
హత్యా రాజకీయాల్ని ప్రోత్సహిస్తున్నారు
ఇటీవల టీడీపీలో చేరిన నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి హత్యా రాజకీయాల్ని ప్రోత్సహిస్తున్నారని మాజీ మంత్రి
భూమాపై సీఎంకు శిల్పా సోదరుల ఫిర్యాదు
సాక్షి, హైదరాబాద్: ఇటీవల టీడీపీలో చేరిన నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి హత్యా రాజకీయాల్ని ప్రోత్సహిస్తున్నారని మాజీ మంత్రి, తెలుగుదేశం నేత శిల్పా మోహన్‌రెడ్డి, ఆయన సోదరుడు, జిల్లా పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణిరెడ్డి మంగళవారం సీఎం చంద్రబాబును కలసి ఫిర్యాదు చేశారు. ప్రశాంతంగా ఉన్న నంద్యాలలో ఫ్యాక్షనిజంతో కల్లోలం రేపాలని భూమా చూస్తే సహించబోమని హెచ్చరించారు. సీఎంను కలసిన అనంతరం శిల్పామోహన్‌రెడ్డి అసెంబ్లీ మీడియాపాయింట్‌లో మాట్లాడారు.
నంద్యాల మండలంలోని కొత్తపల్లె గ్రామ సర్పంచ్, జిల్లా టీడీపీ న్యాయ విభాగం అధ్యక్షుడు తులసిరెడ్డిపై సోమవారం భూమా అనుచరులు కళ్లలో కారం చల్లి వేటకొడవళ్లతో దాడి చేశారని, తీవ్ర గాయాలపాలైన ఆయన హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతున్నారని చెప్పారు. ఆయనకు జరగరానిది జరిగితే అందుకు పూర్తి బాధ్యత భూమా వహించాల్సి ఉంటుందని, ఇదే విషయాన్ని సీఎంకూ చెప్పామన్నారు.