
బాబు..అవకాశవాది
టీడీపీని ఓడించండి...శిల్పాను నిలదీయండి
వైఎస్సార్సీపీతోనే అభివృద్ధి: భూమా నాగిరెడ్డి
నంద్యాల, న్యూస్‌లైన్: టీడీపీ అధినేత నారాచంద్రబాబు నాయుడు అవకాశవాదని వైఎస్సార్సీపీ నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి భూమానాగిరెడ్డి ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో ఆలోచించి ఓట్లు వేయాలని ప్రజలను కోరారు. నంద్యాల పట్టణంలోని పీవీనగర్, దళితవాడల్లో శుక్రవారం భూమా నాగిరెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..విజ్ఞతతో ఓటు వేసి తమ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిని చేయాలని కోరారు. టీడీపీకి చెందిన నాయకులు ప్రజలను మభ్యపెట్టి ఓట్లు పొందాలని భావిస్తున్నారని భూమా ఆరోపించారు.
శిల్పా మోహన్ రెడ్డి ప్రచారానికి వచ్చినప్పుడు .. గత పదేళ్లలో ఏమి చేశావంటూ నిలదీయాలన్నారు. మూడేళ్ల నుంచి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసి అభిమానాన్ని చాటుకోవడానికి పేద ప్రజలు ఎదురు చూస్తున్నారన్నారు. ఈ అవకాశాన్ని ఎన్ని కుటుంబ ఇబ్బందులున్నా వదలుకోకూడదన్నారు. తెలుగుదేశం పార్టీని కోమాలోకి పంపితే మరో ఐదేళ్లు జనజీవన స్రవంతిలో ఆ పార్టీ అగుపించదన్నారు. భారత దేశంలో ఏకైక నియంతగా చలామణి అవుతున్న యూపీఏ చైర్‌పర్సన్ సోనియాగాంధీని ఢీకొన్న నాయకుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మాత్రమేనన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలన్నారు.
పేదల సమస్యలు పరిష్కారం కావాలంటే ఫ్యాన్ గుర్తుకు రెండు ఓట్లు వేసి తిరుగులేని మెజార్టీని ఇవ్వాలన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు కుయుక్తులతో బీజేపీ కుదేలవుతున్నదని ఆరోపించారు. బాబు నిరంతరం తన స్వార్థం కోసం రాజకీయాలు చేస్తారని మరోసారి రుజువు చేశారన్నారు. కాంగ్రెస్‌పార్టీ ప్రకటించిన ఎన్నికల ప్రణాళిక అమలు సాధ్యం కాదన్నారు. రాష్ట్రంలో వైఎస్సార్సీపీ మేనిఫెస్టో ఆచరణ సాధ్యంగా ఉందని ప్రజలు నమ్ముతున్నారని భూమా అన్నారు. తనను, ఎంపీ ఎస్పీవెరైడ్డిని భారీ మెజార్టీతో గెలిపిస్తే.. ఐదేళ్లు సేవలు చేస్తామని భూమా హామీ ఇచ్చారు.