
సీఎం చంద్రబాబును కలిసిన భూమా
శిల్పా మోహన్‌రెడ్డిపై ఫిర్యాదు!
తాడేపల్లి రూరల్: కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గంలో టీడీపీ నాయకుల మధ్య జరుగుతున్న గొడవల నేపథ్యంలో నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి సోమవారం సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యారు. విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమాతో కలసి ఆయన సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చారు. తన చిరకాల ప్రత్యర్థి అయిన శిల్పా మోహన్‌రెడ్డిపై సీఎంకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.
గత 20 రోజుల కిందట శిల్పా మోహనరెడ్డి తన సోదరుడితో కలసి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును అసెంబ్లీ ఆవరణలో ప్రత్యేకంగా కలసి భూమాపై ఫిర్యాదు చేశారు. భూమా నాగిరెడ్డి ఆర్థిక అక్రమాలకు పాల్పడుతున్నారని.... తాను పదేళ్లు ఎమ్మెల్యేగా పనిచేశానని, అయితే ఆ సమయంలో ఎలాంటి గొడవలు జరగలేదని చంద్రబాబుకు వివరించారు. భూమా కుటుంబం టీడీపీలో చేరినప్పటి నుంచి జిల్లా రాజకీయాలలో గొడవలు మొదలయ్యాయని పార్టీ అధ్యక్షుడికి శిల్పా ఇప్పటికే ఫిర్యాదు చేశారు. తమను టీడీపీలో లేకుండా చేయాలని భూమా ప్రయత్నిస్తున్నారంటూ శిల్పా మోహనరెడ్డి తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.