
ఇక కేసీఆర్ ‘అల్లం’!
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: రాజకీయాలకు దూరంగా గత మూడు రోజులుగా తన ఫాంహౌస్‌లో ఉండిపోయిన ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు చాలా రోజుల తర్వాత తిరిగి తన వ్యవసాయంపై దృష్టిపెట్టారు. ఇంతకుముందు తన ఫాంహౌస్‌లో గ్రీన్‌హౌస్ పద్ధతిలో విజయవంతంగా క్యాప్సికం పండించిన ఆయన.. ఇప్పుడు అల్లం సాగు మొదలుపెట్టారు. కొద్దిరోజుల కిందే దీనికి బీజం వేశారు. మట్టి నమూనా పరీక్షలు చేయించి, అల్లం పంట వేయడానికి అనుకూలంగా నివేదిక రావడంతో.. కర్ణాటకలోని రాయచూర్ నుంచి మేలురకం అల్లం విత్తనాలను తెప్పించారు.
దాదాపు 80 ఎకరాల్లో అల్లం పంట వేసేందుకు దుక్కి సిద్ధం చేయించారు. ఇటీవల వర్షాలు ప్రారంభం కావడంతో అల్లం విత్తేందుకు సిద్ధమయ్యారు. ఇందుకోసం శుక్రవారం నల్లగొండ జిల్లాలో పర్యటన ముగిసిన తరువాత సీఎం కేసీఆర్ నేరుగా తన వ్యవసాయ క్షేత్రానికి చేరుకున్నారు. శనివారం ఉదయం వ్యవసాయ క్షేత్రంలో అల్లం పంట వేసే భూమిని పరిశీలించి, వ్యవసాయ శాస్త్రవేత్తలతో మాట్లాడారు.
కొత్తగా తవ్వించిన బావిని పరిశీలించారు. అదేరోజు రాయచూర్ నుండి విత్తనంగా ఉపయోగించే రెండు లారీల అల్లం వచ్చింది. ఆదివారం ఉదయం 11 గంటలకు నడుచుకుంటూ మరోమారు వ్యవసాయ క్షేత్రంలో కేసీఆర్ తిరిగారు. డ్రిప్ విధానంలో అల్లం పంటకు నీరందించేలా ఏర్పాట్లు చేయించారు. ఈ పంట విజయవంతం అయితే దీని ఫలితాలను తెలంగాణ రైతాంగానికి అందించాలని నిర్ణయించారు.