కోటీశ్వర్ల కొమ్ముకాస్తున్న సీఎం
- సీపీఎం రిలే నిరాహార దీక్షకు ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి మద్దతు
కూడేరు : సీఎం చంద్రబాబు కోటీశ్వర్లకు కొమ్ము కాస్తున్నారు..పేద, రైతుల భూములను బలవంతంగా లాక్కొని పరిశ్రమల పేరిట ధనవంతులకు కట్టబెడుతున్నాడని ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి ధ్వజమెత్తారు. పేదలకు సాగు భూమి పట్టాలు ఇవ్వాలని కోరుతూ సీపీఎం నేతలు 5వ రోజు శుక్రవారం కూడేరులోని తహశీల్దార్ కార్యాలయం ఎదుట రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ఈ దీక్షకు ఎమ్మెల్యే మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వానికి పేదలు, కూలీలు, రైతులు కనిపించడం లేదన్నారు.
టీడీపీ అధికారంలోకి వచ్చి 14 నెలలు గడుస్తున్నా అర్హులైన ప్రజలకు ఇంటి స్థలాలు, ఇళ్లు మంజూరు చేసిన పాపాన పోలేదన్నారు. సీఎం చంద్రబాబు ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలేశాడన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, తెలుగు తమ్ముళ్ల అక్రమాలు, దౌర్జన్యాల పాల్పడి కేసుల్లో ఇరుక్కుంటే అధికారాన్ని అడ్డుపెట్టుకొని వారిని ఏ విధంగా కాపాడుకోవాలన్న ఆలోచనలతోనే సీఎంకు సమయమంతా సరిపోతోందని ఆరోపించారు. కూడేరులోని సర్వే నంబర్ 535లో, కమ్మూరు పొలం సర్వే నంబర్ 1లో 100 ఎకరాలు, మరుట్ల-2 కాలనీలో సర్వేనంబర్ 454లోని, కొర్రకోడులో సర్వే నంబర్ 131లోని ప్రభుత్వ భూముల్లో సాగులో ఉన్న పేదలకు పట్టాలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. వైఎస్సార్ సీపీ నేతలు రాకెట్ల అశోక్, మాదన్న, మల్లికార్జున, తిరుపతయ్య పాల్గొన్నారు.
రైతుల గోడు సీఎంకు పట్టదా?
కూడేరు : కరువు రైతుల గోడు ముఖ్యమంత్రి చంద్రబాబుకు పట్టదా? అని ఆల్ ఇండియా కిసాన్ సభ ఉపాధ్యక్షుడు విజ్జు క్రిష్టన్, సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు ఓబులు ప్రశ్నించారు. పేదలకు సాగు భూమి పట్టాలు ఇవ్వాలని కోరుతూ సీపీఎం నేతలు శుక్రవారం కూడేరులోని తహశీల్దార్ కార్యాలయం ఎదుట చేస్తున్న దీక్షకు విజ్జు క్రిష్టన్, ఓబులు మద్దతు తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ పట్టాలు ఇవ్వాలని కోరుతున్నా అధికారులు పట్టించుకోకపోవడం దారుణమన్నారు. పేదలకు భూములు, ఇండ్ల స్థలాలు ఇవ్వాలంటే ప్రభుత్వానికి ఇష్టం లేదన్నారు.