సంతానం విషయమై వివాదం భార్యాభర్తల బలవన్మరణం
సర్ధార్‌నగర్‌లో విషాదం
పహాడీషరీఫ్: సంతానం విషయంలో తలెత్తిన వివాదం భార్యాభర్తలను బలిగొంది. భర్త మందలించడంతో భార్య ఆత్మహత్య చేసుకోగా... భార్య మృతిని జీర్ణించుకోలేక భర్త కూడా బలవన్మరణానికి పాల్పడ్డాడు. అందరి హృదయాలను కలిచి వేసిన ఈ ఘటన పహాడీషరీఫ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆదివారం వెలుగు చూసింది. ఎస్‌ఐ మహేందర్ జీ, స్థానికుల కథనం ప్రకారం....తుక్కుగూడ సమీపంలోని సర్ధార్‌నగర్ గ్రామానికి చెందిన పూర్ణ మౌనిక(22), నరేందర్(26) ఐదేళ్ల క్రితం ప్రేమించుకొని పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు. నరేందర్ సెక్యూరిటీ గార్డ్‌గా పని చేస్తుండగా మౌనిక ఇంటి వద్దే ఉంటోంది. జీవితంలో స్థిరపడ్డాక పిల్లలను కనాలనే ఉద్దేశంతో మౌనిక గర్భం రాకుండా మాత్రలు వేసుకుంటోంది. ఈ విషయమై నరేందర్ భార్యను మందలిస్తూ వచ్చాడు.
ఇటీవలే మౌనిక గర్భం దాల్చింది. నెలన్నర గర్భంతో ఉన్న మౌనిక గర్భం పోవాలని శనివారం మాత్రలు వేసుకుంది. విషయం తెలుసుకున్న నరేందర్ సాయంత్రం 4 గంటలకు భార్యను మందలించి బయటికి వెళ్లాడు. దీంతో మనస్తాపానికి గురైన మౌనిక చున్నీతో ఫ్యాన్‌కు ఉరేసుకుంది. కొద్దిసేపటి తర్వాత ఇంటికి వచ్చిన నరేందర్ కొనఊపిరితో ఉన్న భార్యను స్థానికుల సాయంతో సంతోష్‌నగర్‌లోని అపోలో డీఆర్‌డీఓ ఆసుపత్రికి తరలించాడు. చికిత్స పొందుతూ మౌనిక ఆదివారం తెల్లవారుజామున మృతి చెందింది. దీంతో తీవ్రమనోవేదనకు గురైన నరేందర్ వెంటనే సర్దార్‌నగర్ గ్రామానికి వెళ్లి ఊరు బయట ఉన్న హైటెన్షన్ విద్యుత్ స్తంభం ఎక్కి తాడుతో ఉరేసుకున్నాడు. తాడు తెగి పోవడంతో మృతదేహం కింద పడిపోయింది.
ఆదివారం ఉదయం 6 గంటలకు నరేందర్ మృతదేహాన్ని గమనించిన గ్రామస్తులు పహాడీషరీఫ్ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. కాగా ఇంటర్మీడియట్ చదివిన మౌనిక కానిస్టేబుల్ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తోందని స్థానికులు తెలిపారు. మౌనిక, నరేందర్ దంపతులు ఆత్మహత్య చేసుకోవడంతో సర్ధార్‌నగర్‌లో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి.