తెరపైకి కొకైన్ బ్యాచ్
డ్రగ్స్ మత్తులో సినీ, రాజకీయ ప్రముఖుల పిల్లలు
- విచారణలో వెల్లడించిన కెల్విన్
- మేం ఎల్‌ఎస్‌డీ మాత్రమే విక్రయిస్తాం
- వీకెండ్, వినాయక నిమజ్జనం సమయంలో ఎక్కువ డిమాండ్
- జీషన్‌ను విచారిస్తే కొకైన్ గుట్టు రట్టు!
సాక్షి, హైదరాబాద్: డ్రగ్స్ వ్యవహారం కొత్త మలుపు తిరుగుతోంది. సినీరంగంతోపాటు రాజకీయ ప్రముఖుల పిల్లలు కూడా ‘మత్తు’లో మునుగుతున్నారన్న కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. డ్రగ్స్ వ్యాపారి కెల్విన్ సిట్ విచారణలో ఈ మేరకు కీలక విషయాలను బయటపెట్టినట్టు తెలిసింది. ‘‘మీరు (సిట్ అధికారులను ఉద్దేశించి) ఎల్‌ఎస్‌డీ బ్యాచ్‌ను మాత్రమే పట్టుకున్నారు. ఇంకా కొకైన్ బ్యాచ్ కూడా ఉంది. అందులో సినిమా, రాజకీయరంగానికి చెందిన ప్రముఖుల పిల్లలు ఉన్నారు’’అని అతడు చెప్పినట్లు విశ్వసనీయంగా తెలిసింది.
ఓ ప్రముఖ దర్శకుడు, ఆయనకు సన్నిహితంగా ఉన్నవాళ్లే కాకుండా మరికొందరు సినిమావాళ్లు కూడా తన వద్ద డ్రగ్స్ తీసుకున్నట్లు కెల్విన్ ఒప్పుకున్నట్లు తెలిసింది. ఆదివారం రెండోరోజు బాలనగర్ ఎక్సైజ్ కార్యాలయంలో సిట్ బృందం కెల్విన్‌ను విచారించింది. తనకు తెలిసిన రహస్య సమాచారాన్ని సాధ్యమైనంత మేరకు దాటవేయడానికే అతడు యత్నించినట్లు తెలిసింది. కస్టడీ గడువు ముగియటంతో సిట్ అధికారులు ఆదివారం సాయంత్రం కెల్విన్, ఖుద్దూస్, వాహిద్‌లను జడ్జి ముందు ప్రవేశపెట్టారు.
కొకైన్ జాబితా పెద్దదే..
కొందరు కొకైన్ తీసుకోవటాన్ని స్టేటస్ సింబల్‌గా భావిస్తారని కెల్విన్ చెప్పినట్టు తెలిసింది. తెలుగు సినిమా రంగంలో అగ్రస్థానంలో ఇద్దరు నిర్మాతలు, మరో ఇద్దరు నిర్మాతల కొడుకులు, ఓ రాజకీయ ప్రముఖుడి కొడుకు ఇందులో ఉన్నారని చెప్పినట్టు సమాచారం. జీషన్ అలీఖాన్ గ్యాంగ్‌తోపాటు మరికొన్ని గ్యాంగులు కొకైన్ సరఫరా చేస్తాయని, జీషన్‌ను విచారిస్తే మరిన్ని వివరాలు తెలుస్తాయని అన్నట్టు తెలిసింది. వాస్తవానికి వారం కిందటే ఓ స్టార్ హోటల్ సమీపంలో కొకైన్ డ్రగ్స్‌ను విక్రయించేందుకు యత్నిస్తుండగా జీషన్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు అరెస్టు చేసి విచారించారు. అతడిచ్చిన సమాచారంతోనే ఏడుగురు ప్రముఖులకు నోటీసులు ఇవ్వాలని నిర్ణయించారు. కానీ ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారం కేవలం సహ నిందితుడు ఇచ్చిన సమాచారాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకుని నోటీసులు ఇవ్వలేమని, ఒకవేళ ఇచ్చినా కోర్టులో నిలబడవన్న ఉద్దేశంతో సిట్ వెనక్కి తగ్గినట్టు తెలిసింది. కెల్విన్ ఇచ్చిన సమాచారం నేపథ్యంలో.. జీషన్‌ను కూడా కస్టడీలోకి తీసుకోవాలని సిట్ అధికారులు నిర్ణయించుకున్నట్లు తెలిసింది. ఆయన బ్యాంకు ఖాతాలను, మొబైల్ కాల్‌డేటా విశ్లేషిస్తే కొంత సమాచారం దొరుకుతుందని, వాటి ఆధారంగా నోటీసులు ఇస్తే పక్కాగా చిక్కుతారని సిట్ భావిస్తోంది.
నిమజ్జనం సమయంలో డిమాండ్
బ్రెండెన్, నిఖిల్‌శెట్టి, అమన్ నాయుడు డ్రగ్ ముఠాలతో తనకు సంబంధం ఉందని, తామంతా ఎల్‌ఎస్‌డీ డ్రగ్స్‌నే విక్రయిస్తామని కెల్విన్ చెప్పినట్టు సమాచారం. సాధారణ రోజుల్లో రోజుకు 500 ఎల్‌ఎస్‌డీ స్ట్రిప్పులు విక్రయిస్తామని, వీకెండ్‌లో మాత్రం 1500 వరకు విక్రయిస్తామని చెప్పినట్టు సమాచారం. వినాయక నిమజ్జనం చివరి నాలుగైదు రోజుల్లో డ్రగ్స్‌కు భారీ డిమాండ్ ఉంటుందని వివరించినట్లు తెలిసింది. ఊరేగింపు సమయంలో.. శరీరంలో గంటలకొద్దీ శక్తి ఉండేందుకు డ్రగ్స్ తీసుకుంటారని అతడు చెప్పినట్టు çతెలిసింది. డార్క్‌నెట్ ద్వారా జర్మనీ, నెదర్లాండ్స్ దేశాల నుంచి ఎక్కువ మొత్తంలో డ్రగ్స్ తెప్పించి నిల్వ చేస్తామని చెప్పాడు. తనకు కూడా డ్రగ్స్ అలవాటు ఉందని, నెలాఖరులో తాను గోవా వెళ్లి ఎంజాయ్ చేసి వస్తానని సిట్ అధికారులకు కెల్విన్ వివరించినట్టు సమాచారం.