వడగాడ్పులు.. ఆకస్మిక వానలు!
దక్షిణాది రాష్ట్రాల్లో మున్ముందు ఇదే పరిస్థితి
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఈ ఏడాదీ కరువు ఛాయలే!
‘సాక్షి’తో ఆసియా అభివృద్ధి బ్యాంకు శాస్త్రవేత్త అంచా శ్రీనివాసన్
సాక్షి, హైదరాబాద్: ‘‘వడగాడ్పులు, అధిక ఉష్ణోగ్రతలు, ఉన్నట్టుండి భారీ వర్షాలు(క్లౌడ్ బరస్ట్ రెయిన్స్). దక్షిణాది రాష్ట్రాల్లో మున్ముందు ఇదే పరిస్థితి ఉండబోతోంది. వాతావరణం మార్పులే ఇందుకు కారణం’’ అని ఆసియా అభివృద్ధి బ్యాంక్(ఏడీబీ-ఫిలిప్పీన్స్) శాస్త్రవేత్త అంచా శ్రీనివాసన్ చెప్పారు. ఇప్పటిదాకా ఆర్థిక వలసల్నే (పనులకోసం ఇతర ప్రాంతాలకు తరలిపోవడం) చూశారని, ఇకపై వాతావరణ శరణార్థుల్ని చూస్తారని, రాబోయే పదేళ్లలో ఈ పరిస్థితి ఎదురుకాబోతోందని హెచ్చరించారు. ఏడీబీ తరఫున ఆగ్నేయాసియా దేశాల్లో వాతావరణ మార్పులపై ఈ తెలుగు బిడ్డ పరిశోధన చేస్తున్నారు. అధికారిక పర్యటనకోసం హైదరాబాద్ వచ్చిన ఆయన ఆది వారం ‘సాక్షి ప్రతినిధి’తో మాట్లాడారు. వ్యవసాయంపై వాతావరణ మార్పుల ప్రభావం పడనుందన్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ ఏడాదీ కరువు ఛాయలే కనిపిస్తున్నాయని, ఈ పరిస్థితుల్లో రైతుల్ని ఆదుకోవాల్సింది పాలకులేనని స్పష్టం చేశారు. చైనా, వియత్నాం మాదిరి తెలుగు రాష్ట్రాలు పర్యావరణ పరిస్థితులకు తగ్గట్టుగా ప్రణాళికలు రూపొందించుకోవాలని సూచించారు. ఆయన చెప్పిన వివరాలివీ..
2040కి భారీ వలసలు
వచ్చే పది, ఇరవై ఏళ్లలో దక్షిణాది నుంచి ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాల నుంచి భారీ వలసలు ఉంటాయన్నది అంచనా. ఇవి ఆర్థిక వలసలు కావు. పర్యావరణ వలసలు. శరణార్థుల మాదిరి ఒక దేశం నుంచి మరో దేశం వెళ్లి తలదాచుకునే దుస్థితి. దక్షిణాది నుంచి 2040 నాటికి రెండు కోట్ల మంది వలసలు పోతారని అంచనా.
ప్రభుత్వం భరోసా ఇవ్వాలి!
తెలుగు రాష్ట్రాల్లో ఈ ఏడాదీ కరువు ఛాయలే కనిపిస్తున్న నేపథ్యంలో రైతులు చేయాల్సిన దానికన్నా పాలకులు చేయాల్సిందే ఎక్కువ. ఈ విషయంలో చైనా ఆదర్శం. కరువు వస్తుందనుకున్న ప్రాంతాల్లో రైతుల్ని మామూలుగా వేసే పంటకు బదులు ప్రత్యామ్నాయాన్ని అక్కడి ప్రభుత్వం సూచిస్తుంది. నష్టపరిహారాన్నీ ప్రకటిస్తుంది. వరుస కరువులొచ్చే ప్రాంతాన్ని సేవా, పారిశ్రామికరంగంవైపు మళ్లిస్తుంది. దీన్ని మన పాలకులు అనుసరించాలి.
నీటి పొదుపే శరణ్యం
వాతావరణ మార్పులతో మున్ముందు క్లౌడ్ బరస్టులు ఉంటాయి. అందువల్ల వర్షాలు కురిసినప్పుడే నీటిని నిల్వ చేసుకోవాలి. దీనిపై రైతులకు అవగాహన పెంచాలి. నీటిపొదుపుతోపాటు పంట ల్నీ మార్చుకోవాలి. 2050 నాటికి సుమారు 14 రకాల పంటలు 30 శాతం నష్టపోతాయి. ఈ నేపథ్యంలో దేనిపై పెట్టుబడులు పెట్టాలో వ్యూహాన్ని ప్రభుత్వాలు సిద్ధం చేసుకోవాలి.
రైతులకు సలహా: రైతులు ఒకేపంటపై ఆధారపడొద్దు. తమ ఉత్పత్తులకు అదనపు విలువ ఎలా రాబట్టాలో దృష్టిపెట్టాలి. ప్రభుత్వాలను ఆ దిశగా డిమాండ్ చేయాలి. అప్ స్ట్రీమ్(నదులు, కాల్వలకు ఎగువనుండే) రైతులకు డౌన్ స్ట్రీమ్(దిగువన) రైతులు సాయపడాలి. ఐడియాలతోపాటు ఆచరణ దిశగా పాలకులూ కదిలితేనే రైతుకు మోక్షం.
ప్రభుత్వమే పంటల బీమా చేయాలి
ఏ తరహా ప్రకృతి బీభత్సాలు సంభవించినా నష్టపోయేది రైతులే. వీటిబారి నుంచి కాపాడేలా ప్రభుత్వమే పూర్తిగా పంటల బీమా ప్రీమియం చెల్లించి నష్టపరిహారాన్ని ఇప్పించాలి. ఆ తర్వాత నుంచి క్రమేపీ 10% చొప్పున తగ్గించుకుంటూ వచ్చి రైతులు తమంతటతామే చేసుకునేలా అవగాహన కల్పించాలి. కంబోడియాలాంటి చిన్న దేశాలు చేస్తున్నదిదే. మనమూ అలా చేసినప్పుడే రైతును ఆదుకోగలుగుతాం. అలాగే ‘ఒక ప్రాంతం-ఒక పంట’ పద్ధతిని ప్రవేశపెడితే ఒక ప్రాంతంలో నష్టపోతే మరో ప్రాంతంలోనైనా మేలు జరుగుతుంది. దీంతోపాటు ఐదు లక్షలకు మించని ద్వితీయశ్రేణి నగరాల ఏర్పాటును ప్రవేశపెట్టాలి.